Business

నీరవ్ మోడీని ₹7200కోట్లు కట్టమని తీర్పు

Pune Debt Recovery Tribunal Orders Nirav Modi To Repay Back

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌కు వడ్డీతో సహా రూ.7,200 కోట్లు  కట్టాలంటూ డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీని, అతని సన్నిహితులను పుణే డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్‌‌‌‌టీ) ఆదేశించింది. పీఎన్‌‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీనే. పీఎన్‌‌బీ రిజిస్టర్ చేసిన రెండు కేసులను విచారించిన ప్రెసిడింగ్ ఆఫీసర్, జడ్జి దీపక్ ఠక్కర్ ఈ ఆదేశాలను జారీ చేశారు. ఠక్కర్ ముంబయిలోని డీఆర్‌‌‌‌టీకి కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ఎగవేతదారుడు, అతని పార్టనర్లు 2018 జూన్ 30 నుంచి ఏడాదికి 14.30 శాతం వడ్డీ చొప్పున మొత్తంగా రూ.ఏడు వేల కోట్లను పీఎన్‌‌బీకి చెల్లించండి’ అని డీఆర్‌‌‌‌టీ ఆదేశాలు జారీ చేసింది. మరో ఆదేశాలు జారీ చేసిన జడ్జి, మోడీ,ఇతరులు 2018 జూలై 27నుంచి 16.20 శాతం వడ్డీతో సహా రూ.223  కోట్లు చెల్లించాలంటూ ఆదేశించారు. డీఆర్‌‌‌‌టీ రికవరీ ఆఫీసర్లు తదుపరి చర్యలు తీసుకుంటారని ట్రిబ్యునల్ తెలిపింది. నీరవ్ మోడీకి వ్యతిరేకంగా పీఎన్‌‌బీ మరో రూ.1,700 కోట్ల మోసపూరిత కేసును కూడా నమోదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం ముంబయిలోని డీఆర్‌‌‌‌టీ ముందు పెండింగ్‌‌లో ఉంది. నీరవ్ సోదరి, బావమరిదికి సంబంధించిన బ్యాంక్‌‌ అకౌంట్‌‌ను ఫ్రీజ్ చేయాలని సింగపూర్ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన వారంలోనే పుణే డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు పాస్ చేసింది.  ఈడీ అభ్యర్థన మేరకు పెవిలియన్ పాయింట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న సింగపూర్‌‌‌‌ అకౌంట్‌‌లో ఉన్న రూ.44.41 కోట్ల బ్యాలెన్స్‌‌ను హైకోర్ట్‌‌ ఫ్రీజ్ చేసింది. ఈ కంపెనీ మయాంక్ మెహతా, పుర్వి మోడీలకు చెందింది. పీఎన్‌‌బీలో రూ.13,500 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినందుకు గాను, నీరవ్ మోడీని స్కాంట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, మనీ లాండరింగ్ వంటి ఆర్థిక నేరాలు పాల్పడినందుకు గాను, నీరవ్‌‌ను తమకు అప్పజెప్పాలని ఇండియా కోరుతోంది.