Politics

పార్క్‌హయత్‌లో ప్రతిపక్ష పోరాటం

Telangana Opposition Protests Against New Secretariat

తెలంగాణ సచివాలయం తరలింపుపై ప్రతిపక్షాలు పోరాటం ఉద్ధృతం చేశాయి. హైదరాబాద్‌లో పార్క్‌హయత్‌ హోటల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సచివాలయం కూల్చివేత, కొత్తశాసన సభ నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ భవనం చరిత్రాత్మకమైనదన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీలో రెండు రాష్ట్రాల సభలు నడిచాయని గుర్తు చేశారు. ‘‘గతంలో మెట్రో విషయంలో అసెంబ్లీని ముట్టుకోవద్దని కేసీఆర్‌ అన్నారు. కానీ, ప్రస్తుతం వాస్తు బాగోలేకపోవడం వల్లే కూల్చివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న అసెంబ్లీలో విశాలమైన గదులు, ప్రాంగణాలు ఉన్నాయి’’ అని ఉత్తమ్‌ అన్నారు. నూతన సచివాలయం, శాసనసభల నిర్మాణం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత లాభం, విలాసవంతమైన జీవితం కోసం..మూఢనమ్మకాలతో ఉన్నవాటిని కూల్చి కొత్త భవనాలను కడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ, సచివాలయం 30 నుంచి 35 ఏళ్ల క్రితమే నిర్మించిన కట్టడాలేనని చెప్పారు. ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. వాస్తు దోషం ఉంటే సరిదిద్దుకోవాలి కానీ..కట్టడాలను కూల్చుతారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తమ ఇష్టానుసారం చేస్తామంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజాభీష్టం ప్రకారం పాలన సాగించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు భవనాలపై ఉన్న దృష్టి.. ప్రజల అవసరాలను తీర్చడంలో లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు.