DailyDose

భాజపా వైపు వల్లభనేని చూపు-రాజకీయ–07/08

Is Vallabhaneni Vamsi Joining BJP-Daily Political News In Telugu-July82019

* ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు పక్కచూపులు చూడటం టీడీపీ అధినేత చంద్రబాబును కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో వంశీ ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.వల్లభనేని వంశీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు బీజేపీ, అటు వల్లభనేని వంశీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ నేత సుజనా చౌదరి ఇటీవల వల్లభనేని వంశీని బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీని వీడబోనని అప్పట్లోనే వల్లభనేని వంశీ ప్రకటించారు.
* ఎన్‌ఐఏ దర్యాప్తు పరిధిని పెంచబోతున్నాం : కిషన్‌రెడ్డి
తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్ర రాష్ట్రాలుగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామిని కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని కోరుకున్నట్టు తెలిపారు. ఎన్‌ఐఏ దర్యాప్తు పరిధిని పెంచబోతున్నట్టు వెల్లడించారు. ఇతర దేశాల్లో కూడా మనపై జరుగుతున్న దాడులపై కూడా ఎన్‌ఐఏ దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకుంటాన్నామని అన్నారు. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ను కూడా ఎన్‌ఐఏ పరిధిలో తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ మూడు బిల్లులను సోమవారం పార్లమెంట్‌లో హోం శాఖ ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు.
* ‘కుమార’ మంత్రివర్గం రాజీనామా
కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాలతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు సంకీర్ణ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌కు దిగింది. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడింది. మరోవైపు ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు కూటమి మంత్రులు త్యాగాలకు సిద్ధపడ్డారు. తిరుగుబాటు నేతలను కేబినెట్‌లో చోటు కల్పించేందుకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
* వారి వల్లే ట్రిపుల్‌ ఐటీకి చెడ్డపేరు: ఇంద్రకరణ్‌‌రెడ్డి
కొంతమంది కీచక ప్రొఫెసర్ల వల్ల ట్రిపుల్‌ ఐటీకి చెడ్డపేరు రావడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బాసర ట్రిపుల్‌ ఐటీని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగనివ్వమని చెప్పారు. పూర్తిస్థాయి వీసీని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. మంగళవారం నుంచి ట్రిపుల్‌ ఐటీలో మహిళా ఎస్‌ఐ విధుల్లో ఉంటారని వెల్లడించారు. అవుట్‌ గేట్‌ సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా విద్యార్థులను ఎలా బయటకు పంపుతారని మండిపడ్డారు. విద్యార్థులు మనోధైర్యం, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని మంత్రి సూచించారు.
* కేసీఆర్‌పై పోరు:చేతులు కలిపిన బీజేపీ, కాంగ్రెస్…..
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రజల పక్షా న పోరాటం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలిపాయి. తెలంగాణ సీఎం కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణాలను ఈ రెండు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఈ ఏడాది జూన్ 27వ తేదీన కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. అయితే కొత్త తెలంగాణ సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణాలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ సాగుతోంది.ఈ నెల 8వ తేదీన పిటిషన్లపై విచారణ సాగనుంది.మాజీ ఎంపీ జి. వివేక్ ఆదివారం నాడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్,బీజేపీ,, లెఫ్ట్, టీడీపీ, టీజేఎస్ బీసీ సంఘాల నేతలు కూడ హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాలను కూల్చవద్దని అఖిలపక్షం తీర్మాణం చేసింది. కొత్త భవనాల నిర్మాణాన్ని ఈ సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది.
* కేటీఆర్ ట్విటర్ కే పరిమితమయ్యారు- డీకే అరుణ
టీఆర్ఎస్ నాయకులు కమీషన్ ఏజెంట్లుగా వ్వవహరిస్తున్నారని అన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రాజెక్టులకు పైసలు కర్చుపెడుతున్నామంటూ… వేల కోట్ల ధనాన్ని టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. తొందరలోనే టీఆర్ఎస్ చేసిన అవినీతిని తాము బయటపెడతామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని అసహ్యించుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పారు.
* స్కూళ్లు కట్టరు కానీ.. ఉన్నవి కూల్చేస్తారా – ఆర్. కృష్ణయ్య
సెక్రటేరియట్, అసెంబ్లీ కొత్త భవనాలకు రూ.4 వందల కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.. కానీ వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య. ఎవడు అడిగే వాడు లేడని కేసీఆర్ బాధ్యత రాహిత్యంగా నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. స్కూళ్లకు భవనాలు లేక చెట్ల కింద క్లాస్ లు నడుస్తున్నాయని గుర్తుచేశారు. మనమంతా ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల నేతలు కోర్ట్ లో కేసులు వేస్తే.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ వాదనలు జరుపుతారని అన్నారు.
* కేంద్ర బడ్జెట్ లో కొత్త కేటాయింపులు లేవు – గుత్తా
కేంద్ర బడ్జెట్ లో కొత్త కేటాయింపులు లేవన్నారు మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉన్న బడ్జెట్ లోనే కోతలు కోశారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందన్నారు గుత్తా. తెలంగాణలో అధికారం అనేది బీజేపీకి కలగానే ఉంటుందని ఎద్దేవా చేశారు.
* గ్రామాల్లో మూడు నెలల్లో మార్పు – సీఎం కేసీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు, గ్రామాల వికాసానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ సమ్మేళనాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని నాలుగు చోట్ల ఈ సమ్మేళనాలు నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, జడ్పీ చైర్ పర్సన్లతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఇఓపిఆర్డీలు, ఎంపిడివోలు, డిఎల్పీవోలు, సిఇవోలను ఈ సమ్మేళనాలకు ఆహ్వానిస్తామన్నారు ముఖ్యమంత్రి. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా తయారు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే విషయంలోకూడా సమ్మేళనాలలో చర్చిస్తామన్నారు. సమ్మేళనాల తరువాత అధికారులతో 100 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేస్తామని, అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతామన్నారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
* కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యం- ఈటెల
కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. వైద్య రంగంలో ప్రజలు మెచ్చే విధంగా పని చేస్తామన్నారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లితో కలిసి వరంగల్ MGM హాస్పిటల్ ను పరిశీలించారు ఈటెల. హెల్త్ యూనివర్సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత డాక్టర్లతో సమీక్ష నిర్వహించి . హైదరాబాద్ హాస్పిటల్స్ తరహాలో MGMని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, జెడ్పీ ఛైర్మన్ సుధీర్‌కుమార్ ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, రమేష్, రాజయ్య, సతీష్‌కుమార్, మేయర్ ప్రకాష్‌రావు, , కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
* రైతులకు రూ.150 కోట్లు ఇచ్చాం- మంత్రి నిరంజ‌న్ రెడ్డి
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలకు 150.17 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వ్యవ‌సాయ మంత్రి నిరంజ‌న్ రెడ్డి వెల్లడించారు. శనగలు, మినుములు, జొన్న, పొద్దు తిరుగుడు రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయిందని పేర్కొన్నారు. మ‌ద్దతు ధ‌ర‌ల విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌లో స్పష్టత‌ కరువైందని చెప్పారు. ప‌రిమిత పంట‌ల‌కే కేంద్రం మ‌ద్దతు ధ‌ర ఇస్తోందని వెల్లడించారు. మిగిలిన పంట‌లకు రాష్ట్ర ప్రభుత్వమే మ‌ద్దతు ధ‌ర ఇచ్చి కొనుగోలు చేస్తోంద‌ని తెలిపారు.
* రలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు
తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. వచ్చే రెండేళ్లలో ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని అన్నారు. ఏపీ,తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన విజయవాడలో బీజేపీ సభ్యత్వాల నమోదును ప్రారంభించారు.ఏపీ, తెలంగాణలపై బీజేపీ ఫోకస్‌ చేసింది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బలపడాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఆపరేషన్‌ కమలంతో.. పార్టీ కేడర్‌లో జోష్‌ పెరిగింది. అదే జోష్‌ను సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా కొనసాగించే వ్యూహాన్ని రచించారు బీజేపీ పెద్దలు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ నుంచే శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇద్దరు కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, కిషన్‌ రెడ్డి.. ఏపీలో సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టారు.
*వారి వల్లే ట్రిపుల్‌ ఐటీకి చెడ్డపేరు- ఇంద్రకరణ్‌‌రెడ్డి
కొంతమంది కీచక ప్రొఫెసర్ల వల్ల ట్రిపుల్‌ ఐటీకి చెడ్డపేరు రావడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బాసర ట్రిపుల్‌ ఐటీని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగనివ్వమని చెప్పారు. పూర్తిస్థాయి వీసీని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. మంగళవారం నుంచి ట్రిపుల్‌ ఐటీలో మహిళా ఎస్‌ఐ విధుల్లో ఉంటారని వెల్లడించారు. అవుట్‌ గేట్‌ సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా విద్యార్థులను ఎలా బయటకు పంపుతారని మండిపడ్డారు. విద్యార్థులు మనోధైర్యం, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని మంత్రి సూచించారు.
*జగన్ పాలనలో రైతులకు అన్యాయం- ఆలపాటి రాజా
జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు సకాలంలో విత్తనాలు, నీరు కూడా ఇవ్వలేదని, ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ చివరి రెండు విడతలు ఎందుకు ఇవ్వరంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రుణమాఫీ ప్రకటించారు కాబట్టి రైతులకు అన్యాయం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా.. కేవలం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయటంపైనే దృష్టి సారించిందని విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఆధారాలు ఉంటే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ది గాలికి వదిలిపెట్టి.. టీడీపీపై కక్ష్య సాదింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని, లక్షల కోట్లు అవినీతి అని ప్రచారం చేశారని, ఒక్కరూపాయి అయినా నిరూపించారా? అని ఆలపాటి రాజా ప్రశ్నించారు.
*21 మంది మంత్రులు రాజీనామా చేశారు-కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య
కర్ణాటక రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు 21 మంది కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నేత సిద్ధరామయ్య తెలిపారు. బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ.. మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలన్న వారి కోరిక నెరవేరబోతోందని తెలిపారు. కాంగ్రెస్‌ను అస్థిరపరిచేందుకు భాజపా కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యసభలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తోందన్నారు. ముంబయిలో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేస్తారన్న నమ్మకం ఉందన్నారు.
*భాజపాలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం
కర్ణాటకలో నెలకొన్న తాజా పరిణామాల వెనక భాజపా హస్తం ఉన్నట్లు కాంగ్రెస్‌ చేస్తున్న వ్యాఖ్యలను భాజపా ఖండించింది. స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ రాజీనామా చేసి భాజపాకు మద్దతిస్తానని తెలపడంపై ఆ పార్టీ స్పందించింది. దీనిపై పార్టీ నాయకురాలు శోభ మాట్లాడారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. అసమ్మతి నేతలతో భాజపా నేతలెవ్వరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మెజారిటీ కోల్పోయినందున ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారని తెలిపారు. మరో ప్రభుత్వం ఏర్పాటు కోసం కుమార స్వామి దారివ్వాలన్నారు. మరోవైపు కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినప్పటికీ తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదంటూ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
*విజయసాయి రెడ్డి పునర్నియామకం
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పదవిని లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేయడంతో తాజాగా నియామకం జరిగింది. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
*తెలంగాణ ప్రభుత్వానికి తహసీల్దార్‌ సంఘం హెచ్చరిక.
తెలంగాణ ప్రభుత్వానికి తహసీల్దార్ల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన తహసీల్దార్లను తక్షణమే సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 15న సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయం తహసీల్దార్‌ సంఘం నేతలు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచే నిరసన కార్యక్రమాలకు తహసీల్దార్ సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం తెలంగాణ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో జరిగింది. తహసీల్దార్ల సమస్యలపై కార్యవర్గ సభ్యులు చర్చించారు. ముఖ్యంగా ఎన్నికల వేళ ఇతర జిల్లాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకవటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
*ఊపిరున్నంతవరకు పోరాడతా
ఎస్సీ వర్గీకరణే తన జీవిత ధ్యేయమని, దానికోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడిలో ఆదివారం రాత్రి నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ జాతర సభలో ఆయన మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్గీకరణ ఉద్యమానికి దన్నుగా ఉన్నారని మంద కృష్ణ చెప్పారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో కిషన్రెడ్డి కూడా వర్గీకరణ కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. భాజపా వర్గీకరణ చేసి తీరుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
*రాజీలేని కర్ణాటకం
కర్ణాటక రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. కాంగ్రెస్, జనతాదళ్కు చెందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఒక్కసారిగా కుదుపునకు లోనైన సంకీర్ణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగమేఘాలమీద బెంగళూరు చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఏడు గంటలకు నగరానికి వచ్చిన ఆయన జనతాదళ్ శాసనసభాపక్ష సమావేశంలోనూ, అనంతరం కాంగ్రెస్ నాయకులతోనూ సమావేశమయ్యారు. కేవలం 14 మంది ఎమ్మెల్యేల కోసం రాజీనామా చేయనని ఆయన తేల్చిచెప్పారు. అదే సమయంలో నష్టనివారణ చర్యలను ప్రతిపాదించారు. ‘‘అసమ్మతుల్లో అత్యధికులు రామలింగారెడ్డి సన్నిహితులే. ఆయనను సముదాయించాలి.
*రెండేళ్లలో రాజకీయ ప్రకంపనలు
‘రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు వస్తాయి. భాజపా రెండు చోట్లా ప్రధాన పార్టీగా ఆవిర్భవిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భాజపాను బలోపేతం చేయటమే లక్ష్యం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని.. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంఘటన పర్వ్లో భాగంగా ఆదివారం విజయవాడలో వేర్వేరు చోట్ల జరిగిన కార్యకర్తల, ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నట్లు స్పష్టంగా కనిపించింది.
*సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలి
పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శాసన సభ్యులు, పార్టీ ఇన్ఛార్జులకు సూచించారు. ఈ నెల పదో తేదీ వరకు గడువును నిర్దేశించినందున అప్పటివరకు పూర్తి లక్ష్యాలను చేరాలని కోరారు. మరోవైపు ఆన్లైన్ సభ్యత్వాలు చేపట్టాలని కేటీఆర్ నిర్ణయించారు. గత నెల 27 నుంచి తెరాస సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎమ్మెల్యేకు 50 వేల నుంచి లక్ష వరకు సభ్యులను చేర్చాలనే లక్ష్యాన్ని అధిష్ఠానం నిర్దేశించింది. దాదాపు కోటికి పైగా సభ్యత్వ పుస్తకాలు జిల్లాలకు చేరాయి. సభ్యత్వ నమోదు ప్రక్రియను కేటీఆర్ ఆదివారం సమీక్షించారు. మంత్రుల నియోజకవర్గాలు, సీఎం నియోజకవర్గం గజ్వేల్, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల, హరీశ్రావు నియోజకవర్గం సిద్దిపేట తదితర 80కి పైగా ప్రాంతాల్లో 10వ తేదీ వరకు లక్ష్యాన్ని చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
*భాజపాలో జనసేనను కలపం
గతంలో తాను భాజపాతో కలిసి పనిచేశానని…ఆ పార్టీతో వ్యక్తిగత గొడవలేమీ లేవని జనసేన అధినేత పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై స్పష్టతివ్వమని కోరుతున్నానే తప్ప…వ్యక్తిగతంగా భాజపాతో తనకు సమస్య లేదని వ్యాఖ్యానించారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన ఆదివారం ఓ తెలుగు వార్తాఛానల్తో మాట్లాడారు. ‘‘భాజపా ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా జనసేనను ఆ పార్టీలో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయటకదా’’ అని ఆ విలేకరి అడగ్గా..అలాంటిదేమీ లేదని పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. ‘‘భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్తో మీరు భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది’’ అన్న మరోప్రశ్నకు..‘‘అవునా! అలా అంటున్నారా?’’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలని బలమైన కోరిక ఉంటే ప్రస్తుత ప్రభుత్వం సహా ఎవరైనా సరే దాని కోసం పోరాడాల్సిందే. అమెరికా, ఐరోపా, గల్ఫ్ దేశాల్లో త్వరలో పర్యటిస్తా. అక్కడ తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటా. భారత్కు వెళ్లిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలవారీగా పార్టీసమీక్షలు నిర్వహిస్తాం’’ అని పవన్ అన్నారు.
*రాహుల్ బృందం రాజీనామా!
ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన సన్నిహిత బృందంగా పేరు పడ్డ యువనేతలు కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. పార్టీ పదవులను వదులుకుంటున్నారు. ఆదివారం ప్రధాన కార్యదర్శి పదవికి జ్యోతిరాదిత్య సింధియా, ముంబయి ప్రాంత కమిటీ అధ్యక్ష పదవికి మిలింద్ దేవ్రా రాజీనామా చేశారు. ఇరువురు నేతలూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. పార్టీకి నూతన జవసత్వాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో రాహుల్కు విశ్వాసపాత్రులుగా ఉన్న యువనేతలకు గతంలో కీలక పదవులు కట్టబెట్టారు. అయితే అధ్యక్షుడే రాజీనామా చేయడంతో వారంతా పదవుల నుంచి తప్పుకొంటున్నారు.
*తెలంగాణకు భాజపా ద్రోహం
భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోందని, రాష్ట్రంపై వివక్ష చూపుతోందని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నా ఇక్కడి విపక్షాలు నోరు మెదపడం లేదని, అవి రాజకీయంగా దిగజారి వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆదివారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో బాల్క సుమన్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం విలేకర్లతో మాట్లాడారు. ‘‘కేంద్రం బడ్జెట్లో తెలంగాణను విస్మరించింది. దీనిపై తెరాస ఎలుగెత్తి చాటింది. కాంగ్రెస్ సహా విపక్షాల్లో ఏ మాత్రం చలనం లేదు. తెలంగాణ నుంచి నలుగురు భాజపా ఎంపీలు, అందులో ఒక కేంద్ర సహాయ మంత్రి ఉన్నా బడ్జెట్లో జరిగిన అన్యాయంపై అమిత్షా దృష్టికి తీసుకెళ్లలేక పోయారు.
*గవర్నర్ దృష్టికి సెక్షన్-8
సచివాలయ భవనాల కూల్చివేత, అసెంబ్లీని ఎర్రమంజిల్లో కట్టాలన్న నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పరిధిలోని అంశాల్లో గవర్నర్పై బాధ్యత ఉందని.. అసెంబ్లీ తరలింపు, సచివాలయ భవనాల కూల్చివేతను ఆయన దృష్టికి తీసుకెళతామన్నారు. పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్లో ఉమ్మడి ఆస్తుల పంపకాల్లో చొరవ తీసుకున్న గవర్నర్..వాటిని కాపాడటంలోనూ అదేవిధంగా వ్యవహరించాలన్నారు. ఆయన స్పందించకపోతే కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
*దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మరోసారి విజయసాయిరెడ్డి
దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని మరోసారి నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 22నే విజయసాయిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన లాభదాయక పదవి చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని గమనించి ఈ నెల 4న ఆ ఉత్తర్వును రద్దు చేశారు. ప్రస్తుతం ఈ పదవితో జీతభత్యాలు, ఎలాంటి హోదా లేకుండా ఆర్డినెన్స్ జారీ చేస్తూ తిరిగి ఆయనను ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు.
*బీసీలకు క్రిమీలేయర్ ఎత్తివేయాలి: వీహెచ్
బీసీలకు క్రిమీలేయర్ ఎత్తివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. 1993లో ఓబీసీ కమిటీ ఏర్పడినా.. ఉద్యోగాల్లో 9శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు బీసీలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు క్రిమీలేయర్ ఎత్తివేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసి మూడేళ్లవుతున్నా పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో సోమవారం జస్టిస్ రోహిణీ కమిటీ పర్యటించనుందని, బీసీల్లో ఎన్ని కులాలను కలిపినా అభ్యంతరం లేదని చెప్పారు. క్రిమీలేయర్ ఎత్తివేయకపోతే భవిష్యత్తులో బీసీ విద్యార్థులు బిచ్చగాళ్లు అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
*ఎస్సీ వర్గీకరణ ఇక దిల్లీ చేతుల్లోనే
ఎస్సీ వర్గీకరణ తేలాల్సింది ఇక దిల్లీలోనే అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటేల రాజేందర్ స్పష్టం చేశారు. వర్గీకరణ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతృత్వంలో శాసనసభలో తీర్మానం చేసి దిల్లీకి పంపినట్టు గుర్తు చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన దండోరా రజతోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాదిగలు ఆత్మగౌరవంతో బతికే రోజులు వచ్చాయన్నారు. త్వరలో కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ, ప్రాథమిక ఆసుపత్రులలో వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ కల్పించిన హక్కులను పొందాలని సూచించారు.
*చారిత్రక వారసత్వ ప్రాంతంగా సర్వాయిపేట గుట్ట: శ్రీనివాస్గౌడ్
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలోని సర్దార్ పాపన్నగౌడ్ కోటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. త్వరలోనే అధికారుల బృందంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామన్నారు. సర్వాయిపేటకు చెందిన నేతలు ఆదివారం మంత్రిని కలిశారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, పాపన్నగౌడ్ నివాస ప్రాంతాన్ని చారిత్రక వారసత్వ సంపదగా అభివృద్ధి చేయాలని, పాపన్న గుట్టను శాశ్వత మైనింగ్ రహిత ప్రాంతంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిపై పర్యాటక, పురావస్తు, గనుల శాఖలు చర్యలు చేపడతాయన్నారు.
*అమరావతికి అనుకూలమా.. వ్యతిరేకమా?: పంచుమర్తి అనూరాధ
జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అనుకూలమో, వ్యతిరేకమో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ డిమాండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో తాగునీటి కొరత, విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నా ఎమ్మెల్యే స్పందించట్లేదని, విత్తనాల కొరతతో రైతులు తంటాలు పడుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనిఎద్దేవా చేశారు.
*ప్రజాప్రతినిధులకూ భద్రత లేదు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం తెదేపా ఎమ్మెల్యే బెందాళం అశోక్పై వైకాపా వర్గాలు దాడికి యత్నించి, అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్లకుండా అడ్డుకోవడం గర్హనీయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. దాడిని ఖండిస్తూ ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెదేపా కార్యకర్తలపై 200కు పైగా దాడులు జరిగాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడికి యత్నించడం రాష్ట్రంలోని పరిస్థితులకు అద్దం పడుతోంది. సీఎం జగన్ దాడులపై ఎందుకు స్పందించట్లేదు? ఇకనైనా ఇలాంటి దాడులను నిలువరించేందుకు ముఖ్యమంత్రి, డీజీపీ చర్యలు తీసుకోవాలి’’ అని కళా కోరారు.