Health

మతిమరుపు…నిద్రలేమికి ఆరోగ్యవంతమైన చిట్కా

Sankhu Flower Aides In Treating Insomnia And Alzheimers

‘నిద్రపట్టడం లేదా… మతిమరపు, ఆందోళనలతో బాధపడుతున్నారా… కొంతకాలం శంఖుపూల తేనీరు తాగి చూడండి…’ ఓ కుర్ర డాక్టర్‌ సలహా. ‘ఐస్‌క్రీములూ కేకులూ చేస్తున్నారా… వాటిల్లో కాస్త శంఖుపూల పొడి వేయండి…’ ఓ ఆధునిక షెఫ్‌ సూచన. గ్రీన్‌ టీ తెలుసు… ఎల్లో, ఆరెంజ్‌… ఇలా ఫుడ్డు కలర్లూ తెలుసు కానీ ఈ శంఖుపూల టీ ఏమిటీ, ఆ రంగేమిటీ అనిపిస్తోంది కదూ. నిజమే, ఫ్యాషన్ల మాదిరిగానే ఈమధ్య ఫుడ్డు ట్రెండ్లూ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అలా వచ్చిందే ఈ నీలి ఆహారం!
**శంఖుపువ్వు… నిన్నమొన్నటివరకూ అందంకోసం పెంచుకునే ఓ నీలి రంగు పువ్వుగానే అందరికీ తెలుసు. కానీ ఇటీవల తేనీరుగానూ ఫుడ్‌కలర్‌గానూ పాపులరైపోయింది. అలాగని కొత్తగా సీనులోకి వచ్చింది కాదు. ఆగ్నేయాసియా దేశాల్లోని సంప్రదాయ వైద్యులకీ మన ఆయుర్వేద పండితులకీ శంఖుపువ్వు చిరపరిచితమే.తెలుపు, నీలం, ఊదా రంగుల్లో విరిసే శంఖుపూలు అద్భుత ఔషధాలు. పువ్వే కాదు, ఆకూ వేరూ కాండమూ గింజా అన్నీ ఆరోగ్యానికి మేలుచేసేవే. అందుకే ఈ మొక్కని పూర్వకాలం నుంచీ ఆయుర్వేదంలో వాడేవారు. నెలసరి ఇబ్బందులకి పూల కషాయాన్ని ఇస్తే, విషపదార్థాలకి విరుగుడుగా వేళ్లతో చేసిన మందుని ఇచ్చేవారట ఆనాటి వైద్యులు. మద్యపానం అలవాటు ఉండి, తరచూ అలసటకి లోనయ్యేవాళ్లకి ఈ మొక్కలోని ఏ భాగాన్ని నీళ్లలో మరిగించి ఇచ్చినా ఫలితం ఉంటుందట. తెలుపురంగు శంఖుపూల మందు పాముకాటుకి విరుగుడుగానూ పనిచేస్తుందట.
***మెదడుకు మందు!
శంఖుపూలు, ఆకులు, వేళ్లతో చేసిన పొడి జ్ఞాపకశక్తినీ తెలివితేటల్నీ పెంచుతుందనీ; నిద్రలేమికీ డిప్రెషన్‌కీ మందులా పనిచేస్తుందనీ సంప్రదాయ వైద్యం పేర్కొంటోంది.ఈ విషయాన్ని ఆధునిక పరిశీలకులూ నిర్ధరించారు. ఈ ఆకు లేదా పువ్వుని నోట్లో వేసుకుని నమిలినా మంచిదే. లేదంటే గ్రీన్‌ టీ మాదిరిగానే మరిగించిన నీళ్లలో వేసుకుని తాగితే మరీ మంచిది. శంఖుపువ్వులోని ఆర్గనెల్లోలిన్‌ అనే పదార్థం మెదడు పనితీరుకి తోడ్పడటంతో మతిమరపు తగ్గుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమాలతో బాధపడేవాళ్లకీ ఈ టీ మంచిదే. మూర్ఛవ్యాధినీ నివారిస్తుంది. జ్వర ఉష్ణోగ్రత వెంటనే తగ్గుతుంది. పొట్టలో మంటని తగ్గించడంతోబాటు మలబద్ధకం లేకుండా చూస్తుంది. ఇందులోని ప్రొయాంథోసైనిడిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కంటినరాల్లో రక్తసరఫరాని మెరుగుపరచడంతో గ్లకోమాని నిరోధించడంతోబాటు రెటీనాని దెబ్బతినకుండా చూస్తుంది. శంఖుపుష్పంలోని క్యుయెర్సిటిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం సాగుదలని పెంచి, ముడతల్ని రానివ్వదు. ఇది అద్భుతమైన శృంగారప్రేరితం. పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలు లేకుండా చూస్తుంది.
***ఎలా వాడతారు?
ఈ పూలని వేడినీళ్లలో వేసి కాసేపు ఉంచి ఆ నీటితో రకరకాల ఆహారపదార్థాలు చేస్తుంటారు. థాయ్‌, చైనా, మలేషియా… వంటి ఆగ్నేయాసియా దేశాల్లో అన్నంలోనూ మోమోల్లోనూ వాడతారు. పూలతో చేసిన చల్లని టీలో పుదీనా, తేనె, అల్లం జోడించి కూడా తాగుతుంటారు. ఆ రంగుని చూసి ముచ్చటపడుతూ ఈతరం షెఫ్‌లు ఐస్‌క్రీమ్‌లూ డెజర్ట్‌లూ స్వీట్లూ కేకులూ నూడుల్సూ, సలాడ్లూ… ఇలా అన్నింటిలోనూ నీలిరంగుని గుప్పిస్తూ అందంగా అమర్చేస్తున్నారు. అది చూశాక వంటింటి మహరాణులు మాత్రం ఊరికే ఉంటారా… ఇడ్లీలూ దోసెలూ ఉప్మా… ఇలా వేటినైనా ముచ్చటైన నీలిరంగులో మెరిపించేయరూ. సో నీలాల నింగీ నీలి సాగరజలాలూ మనసుకి హాయినీ ఉల్లాసాన్నీ పంచిస్తే, నీలిరంగు ఆహారం అందాన్నీ ఆరోగ్యాన్నీ అందిస్తుందన్నమాట. మరింకెందుకు ఆలస్యం… రోజూ ఓ కప్పు ఈ నీలి టీని సిప్‌ చేసి రోజంతా హాయిగా తాజాగా గడిపేసెయ్యండి.