Editorials

శరవణా భవన్ రాజగోపాల్ అభ్యర్థన తిరస్కరించిన సుప్రీం కోర్టు

Justice NV Ramana Panel Denies Saravana Bhavan Rajagopal Request

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడో పెళ్లి కోసం ఓ వ్యక్తిని చంపిన కేసులో రాజగోపాల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల రీత్యా కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రాజగోపాల్‌ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ‘ఈ కేసు విచారణ జరుగుతుండగా ఒక్క రోజు కూడా మీ అనారోగ్యం గురించి ఎందుకు చెప్పలేదు. ఇక చెప్పేదేం లేదు. వెంటనే లొంగిపోవాలి’ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శరవణ భవన్‌ పేరుతో దేశ విదేశాల్లో ఎన్నో రెస్టరెంట్లు ప్రారంభించి పేరు గడించిన రాజగోపాల్‌ ఓ హత్య కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి కుమార్తెను మూడో భార్యగా చేసుకుంటే ఇంకా బాగా కలిసొస్తుందని ఓ జ్యోతిష్కుడు చెబితే… రాజగోపాల్‌ నమ్మాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే పెళ్లయినందున ఆమె అంగీకరించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా… 2001లో ఆమె భర్తను చంపించాడు. దీంతో రాజగోపాల్‌తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు తొలుత అతడికి 10ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మారుస్తూ 2009లో తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం కూడా మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులో బెయిల్‌పై బయట ఉన్న రాజగోపాల్‌.. జులై 7న కోర్టులో లొంగిపోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా తాను ఇప్పుడే లొంగిపోలేనని, కొంత సమయమివ్వాలని రాజగోపాల్‌ కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం అందుకు నిరాకరించింది.