DailyDose

టెలికాంకు “టాటా”-వాణిజ్య-07/09

TATA Telecom Being Sold To Bharti Airtel-Daily Business News in Telugu-July92019

* సరికొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘కోన’ను హ్యుందాయ్‌ సంస్థ విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.25.30 లక్షలుగా నిర్ణయించారు. భారత్‌లో మొట్టమొదటి ఎస్‌యూవీగా ‘కోన’ రికార్డు సృష్టించింది. ఇంటీరియర్‌, ఫీచర్లు, కారు లోపల విశాలమైన స్థలం విషయంలో క్రెటాను పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో పగలు కూడా వెలిగే ఎల్‌ఈడీ బల్బ్‌ లను అమర్చారు. ఈ డిజైన్‌ విభిన్నంగా ఉంది. ఈ కారు బంపర్‌కు హ్యుందాయ్‌ కాస్కేడింగ్‌ డిజైన్‌ గ్రిల్‌ను అమర్చింది.
* భారతీ ఎయిర్‌టెల్‌కు తన మొబైల్‌ ఫోన్‌ వ్యాపారాన్ని అమ్మేయడానికి టాటా గ్రూపు తన లెండర్లకు, ప్రభుత్వానికి 7.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 వేల కోట్లు) చెల్లించింది. ఎయిర్‌టెల్‌లో విలీనం కావడానికి ఈ కంపెనీ రెండేళ్ల క్రితమే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గత నెల టెలికం శాఖకు రూ.10 వేల కోట్లు చెల్లించింది. అంతకుముందే టాటా టెలిసర్వీసెస్‌ (మహారాష్ట్ర)కు ఉన్న రూ.40 వేల కోట్ల అప్పులను తీర్చేసింది. షెడ్యూలు ప్రకారమే కన్జూమర్‌ మొబైల్‌ బిజినెస్‌ విభాగానికి ఉన్న అప్పులను చెల్లించామని టాటా టెలిసర్వీసెస్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు. జియో 2016లో రంగప్రవేశం చేసిన తరువాత టాటా, ఎయిర్‌సెల్‌, ఆర్‌కామ్‌ వంటి కంపెనీలు పోటీలో నిలబడలేకపోయాయి. కొన్ని దివాలా తీయగా, టాటా వంటివి ఇతర కంపెనీల్లో విలీనం అయ్యాయి.
*నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్ఈఎంఎంపీ) కింద 2020 నాటికి 60- 70 లక్షల హైబ్రిడ్, విద్యుత్ వాహన విక్రయాలను సాధించడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.
*అన్ని మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను 1 శాతం వరకు పెంచినట్లు ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఎక్స్-షోరూమ్ ధరలపై 1% పెంపు ఉంటుందని, అయితే వివిధ విపణులు, మోడల్ ఆధారంగా ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ధరల పెంపునకు కారణాలను వివరించలేదు.
*ఆర్థిక వ్యవస్థను భాజపా ప్రభుత్వం గాడిలో పెట్టిందని మాజీ కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. భాజపా ఆర్థిక వ్యవస్థను సూపర్ఫాస్ట్ రైలు ‘రాజధాని’గా మలిచిందని, త్వరలో బుల్లెట్ రైలులా పరుగెడుతుందని వెల్లడించారు.
* ప్రభుత్వ రంగ బ్యాంకు సిండికేట్ బ్యాంక్ ‘సిండ్నివాస్ టేకోవర్ ధమాకా’ పేరుతో గృహరుణ పథకాన్ని ప్రకటించింది.
*వాహన పోర్టల్ కార్దేఖో గ్రూప్ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో టెక్, నాన్-టెక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
*మ్యూచువల్ ఫండ్ల జోరుకు కళ్లెం పడింది. జూన్లో మ్యూచువల్ ఫండ్ పథకాల నుంచి మదుపర్లు రూ.1.60 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు.
*పత్రికలు ముద్రణకు వినియోగించే న్యూస్ప్రింట్, అన్కోటెడ్ పేపర్, మేగజీన్ల ముద్రణకు వినియోగించే లైట్ వెయిట్ కోటెడ్ పేపర్లపై విధించిన 10శాతం కస్టమ్స్ డ్యూటీని తక్షణమే ఉపసంహరించాలని ద ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
*విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల(ఎఫ్పీఐ)పై పన్ను రేటు పెంపు విషయంలో వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో త్వరలోనే వీటిపై స్పష్టత ఇవ్వనున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్ పీసీ మోడీ పేర్కొన్నారు.
*రోజు మొత్తంలో ఎప్పుడైనా ఒకే ధరకు క్యాబ్ సేవలను అందించేందుకు కొత్త అంకురం ముందుకు వచ్చింది. రద్దీ సమయాల్లో క్యాబ్ ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో వినియోగదారులకు పెద్ద భారంగా మారుతోంది.
*మనదేశంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గత దశాబ్దకాలంగా 6-7 శాతానికి కాస్త అటూఇటుగా ఉంటోందని, ఇదే స్థాయి వృద్ధి రేటుతో 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాకారం చేయలేమని కేంద్ర ఆర్థిక మంత్రి మాజీ సలహాదారు, సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్స్ ఛైర్మన్ మోహన్ గురుస్వామి అన్నారు.