Kids

బహుముఖీన ప్రజ్ఞాశాలి – డావించీ

The story of Lenoardo Davinci - Telugu Kids Moral Stories

ఒక వ్యక్తి శాస్త్రవేత్త అయితేనే గొప్పగా చెప్పుకొంటాం… కానీ అదే వ్యక్తి ఓ రచయిత… ఆయనే చిత్రకారుడు… ఇంకా ఇంజినీరు… ఆర్కిటెక్ట్‌… వాస్తుశిల్పి… సంగీత కళాకారుడు… కాస్ట్యూమ్‌ డిజైనర్‌… ఇలా మరెన్నింట్లోనో ప్రతిభావంతుడు… ఇంతకీ ఆయన ఎవరంటే… మోనాలిసా బొమ్మ వేసిన లియోనార్డో డావిన్సీ! ఆయన జీవిత విశేషాలేంటో తెలుసుకుందామా?
****లియోనార్డో డావిన్సీ ఇటలీలోని ఫారెన్స్‌ నగరం దగ్గరుండే విన్సీ గ్రామంలో 1452 ఏప్రిల్‌ 15న పుట్టాడు. ఓ పనమ్మాయికి జన్మించిన ఈ బాలుడు పెరిగి పెద్దయి ఒక ప్రముఖ చిత్రకారునిగానే కాకుండా శిల్పి, వాస్తుశిల్పి, సంగీత కళాకారుడు, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, గణిత శాస్త్రవేత్త, ఆర్కిటెక్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఇంజినీర్‌, శరీరధర్మ శాస్త్రజ్ఞుడు, భూగర్భ పరిశోధకుడు, వృక్షశాస్త్రజ్ఞుడు, కార్టోగ్రాఫర్‌, గొప్పరచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఈయన ఏ విషయంలో నిపుణుడు అని అడగడం కన్నా ఏ విషయంలో కాడు? అని అనొచ్చు.
* ఈయన పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన కుంచె నుంచి జాలువారిన కళాఖండాలు.. మోనాలిసా, లాస్ట్‌ సప్పర్‌. అప్పట్లో శాస్త్ర భావనలు అంతగా లేవు. ఒకవేళ ఉన్నా, అవి శాస్త్రజ్ఞుల ఆలోచనలు, సిద్ధాంతప్రతిపాదనలకు మాత్రమే పరిమితం. ఆ స్థితిలో శాస్త్ర అధ్యయనాన్ని ప్రయోగాల వైపు పయనింపజేశాడు. శాస్త్ర అధ్యయనానికి పునాదులు వేశాడు. మనకు ఉపయోగపడే ఎన్నో పరికరాలను అందించాడు.
* లియోనార్డో తన బాల్యాన్ని తాతగారి దగ్గరే గడిపాడు. స్కూల్లో చదివే రోజుల్లో గణిత శాస్త్రంతో పాటు, చిత్రలేఖనంపైనా ఆసక్తి చూపడంతో పెద్దలు ఆయనను ఒక ప్రముఖ కళాకారుని దగ్గర శిష్యుడిగా చేర్చారు.
****కళాకారుడి నుంచి…
* మంచి కళాకారునిగా ఎదగాలంటే కలప, చలువరాయి, లోహాలపై చిత్రాలు చెక్కడంతో పాటు లాటిన్‌, గ్రీకు సాహిత్యం, వేదాంత, గణిత, శరీర ధర్మ శాస్త్రాలపై మంచి అవగాహన ఉండాలని గురువు చెప్పాడు. దీంతో లియోనార్డో ఆ శాస్త్రాలను అధ్యయనం చేశాడు.
* గురువు దగ్గర శిక్షణ పూర్తయిన తర్వాత లియోనార్డో మొట్టమొదటిగా తయారు చేసింది ‘గుర్రపు తల’ ఆకారంలో ఉండే లూట్‌ అనే తీగలతో కూడిన సంగీత వాద్యం. అప్పటి మిలాన్‌ పరిపాలకుడు దాన్ని చూసి లియోకి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు.
* ఇరుగుపొరుగు దేశాలతో తరచూ యుద్ధాలు జరుగుతున్న ఆ రోజుల్లో ఈయన రక్షణ సామాగ్రి డిజైన్లు తయారుచేసేవాడు.
* ఆ కొలువులో ఉన్నప్పుడే దేశంలో ప్లేగు వ్యాధి వచ్చింది. నగరాలను ఖాళీ చేసినవారికి కొత్త ప్రదేశాల్లో గృహ నిర్మాణానికి ప్లాన్లు సిద్ధం చేశాడు. మురికి నీటి పారుదలకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటుచేశాడు.
* మిలాన్‌లో ఉన్న రోజుల్లోనే ఈయన శరీరధర్మ శాస్త్రంపై దృష్టిపెట్టాడు. ఈ అధ్యయనంలో భాగంగా దేశంలోని ప్రఖ్యాత డాక్టర్లను పిలిపించేవాడు. వారు శస్త్రచికిత్సలు చేస్తున్నప్పుడు ఆ దృశ్యాల్ని చిత్రాల రూపంలో చిత్రీకరించాడు.
* తాను తయారుచేయాలనుకున్న జలాంతర్గాములు, డైవింగ్‌ సూట్‌ల వివరాల్ని చిత్రాలతో ఐదువేల పేజీల పుస్తకాన్ని తయారుచేశాడు. తన ఆలోచనల్ని మరెవరూ కాపీ చేయకుండా అక్షరాలను అద్దంలో కనబడే ప్రతిబింబాల రూపంలో రాసేవాడు.
* 1490లోనే లియో పక్షుల రెక్కల్ని పోలిన రెక్కల్ని నిర్మించాడు. వాటితో ఒక వ్యక్తి పైకి ఎగరడానికి ప్రయత్నించే ఎగిరే యంత్రాన్ని తయారుచేశాడు. ఆధునిక కాలంలో రూపొందించిన హెలీకాఫ్టర్‌ డిజైన్‌ను ఆ రోజుల్లోనే తయారు చేశాడన్నమాట.
* సౌరశక్తిని ఉపయోగించుకునే పద్ధతుల గురించి చెప్పాడు.
* గాలి వేగం కొలిచే ఎనిమా మీటర్‌ తయారు చేశాడు.
* పొద్దుతిరుగుడు పువ్వులాంటివి ఎప్పుడూ సూర్యునివైపే ఉండటానికి కారణమేంటో వివరించాడు.
* భూకంపాలకు, అగ్నిపర్వతాలు పేలడానికి కారణమైన భూమి పొరల్లోని ఫలకాల కదలికల్ని ఆ కాలంలోనే వివరించాడు.
* బరువు సాయంతో తిరుగుతూ గంటలు, నిమిషాలు చూపించే గడియారం కనిపెట్టాడు.
* వృక్షాల కాండాల్లో పెరిగే వలయాల్ని బట్టి వాటి వయసును నిర్ణయించడం, మొక్కల్లో స్త్రీ, పురుష లింగ భేదం ఉంటుందని నిర్దారించడం లియోవృక్షశాస్త్ర పరిజ్ఞానాన్ని తెలుపుతుంది.
* బరువులు ఎత్తడానికి ‘జాక్‌’. దాన్నే ఇప్పుడు టైర్లు మార్చడానికి ఆ వాహనాలను భూమి నుంచి కొంత ఎత్తుకు ఎత్తడానికి ఉపయోగిస్తున్నాం.
****ఎన్నెన్నో పరికరాలు!
* అమెరికన్లు గ్లాటింగ్‌ గన్‌ వాడక ముందే ఈయన మెషిన్‌ గన్‌ వ్యవస్థను రూపొందించాడు. దీంట్లో కొన్ని తుపాకులు ఫైర్‌ చేస్తుంటే వాటిపక్కనే ఉన్న మరికొన్ని లోడ్‌ అవుతుంటాయి. ఇంకొన్ని ఫైర్‌ చేసిన తర్వాత కూల్‌ అవుతుంటాయి. చక్రాల అమరికతో ఏ దిశకైనా తిరిగే మిలటరీ సాయుధ శకటం(ట్యాంకు) తయారుచేశాడు.
* మరో ఆవిష్కరణ నౌక. ఇది రెండు ఆవరణలతో విచిత్రంగా ఉండేది. శత్రువులు బయటి ఆవరణను తుపాకీ గుళ్లతో ఛేదించినా రెండో ఆవరణతో నౌక సురక్షితంగా నీటిపై తేలుతుండేది.
* చక్రాలు పయనించే దూరాన్ని లెక్కకట్టే ‘ఓడోమీటర్‌’. అదే ఇప్పుడు మనం నడుపుతున్న కారు ఎంత దూరం పయనించిందో తెలుపుతోంది.
* మనం వాడుతున్న స్క్రూ కటింగ్‌ యంత్రాలు, పల్లంలో ఉన్న నీటిని పైకి తోడే పంపు, గణనకు ఉపయోగించే కాలిక్యులేటర్‌ మోడల్‌ని ఆ రోజుల్లోనే తయారుచేశాడు. విచిత్రమేమంటే లోహాలు అంతగా వాడుకలో లేని కారణంగా ఆ రోజుల్లో ఈ పరికరాల్ని కొయ్యతో తయారుచేయడం.
* మానవ శరీర నిర్మాణం, ముఖ్యంగా వెన్నెముక నిర్మాణం, శిశువు తల్లి గర్భంలోని స్థితి, గుండె, అందులో ఉండే అరలు తన స్కెచ్‌ల ద్వారా చిత్రీకరించాడు. అవి ఇప్పటికీ వైద్యశాస్త్ర అధ్యయనంలో అపురూపమైన నమూనాలుగా ఉన్నాయి.