Movies

అల్లూరి తండ్రిగా అజయ్

Ajay Devgan To Star As Alluri Seetaramarajus Father in RRR

ఎన్నో అంచనాల మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఇదే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, ఆయన పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో చెర్రీ తండ్రి పాత్రలో అజయ్‌ నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ఆయన కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రెండో భాగంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌లో అజయ్‌ పాత్ర కనిపించనుందని సమాచారం. తన పాత్ర నిడివి తక్కువ కావడంతో తొలుత అజయ్‌ ఈ చిత్రంలో నటించేందుకు మొగ్గుచూపలేదట. కానీ, రాజమౌళి వ్యాఖ్యానం ఆయనకు సినిమాపై ఆసక్తిని పెంచినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘ఆర్‌.ఆర్.ఆర్‌’లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం చరణ్‌, తారక్‌ చాలా శ్రమిస్తున్నారు. ఎన్నో కసరత్తులు చేసి ఇంకా ఫిట్‌గా తయారయ్యారు. మంగళవారం ‘లెగ్‌ డే’ సందర్భంగా తారక్‌ జిమ్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ఓ ట్వీట్‌ చేశారు. తారక్‌ కాళ్లను మాత్రమే చూపిస్తూ.. ఎంతో శ్రమించి ఇది సాధించామని పోస్ట్‌ చేశారు. దీంతో ఆ ఫొటో కాస్త వైరల్‌ అయ్యింది. తారక్‌ అంకితభావాన్ని మెచ్చుకుంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేశారు.