DailyDose

న్యూయార్క్ లో డాయిష్ బ్యాంక్ మూత-వాణిజ్య-07/10

Bank Closed in New York - Daily Business News In Telugu - July 10 2019

* నష్టాల్లో నడుస్తున్న ఈక్విటీ వ్యాపారాన్ని మూసివేయనున్నట్లు తాజాగా జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకున్న డాయిష్ బ్యాంక్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని, బ్యాంకుకు వార్షికంగా 8.3 బిలియన్‌ డాలర్ల వరకు మిగులు ఉంటుందని పేర్కొంది. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలో అంటే సొమవారం నాడే భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు డాయిష్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల నుంచి తొలగిస్తారని ముందు నుంచే ఉద్యోగులకు కూడా సంకేతాలు ఉన్నాయి. అయినా ఆ తొలగించే వాళ్లలో తమ పేరు ఉండకపోవచ్చనే నమ్మకంతోనే చాలామంది ఉన్నారు. చివరకు తమకూ ఉద్వాసన పత్రం అందడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భవిష్యత్‌పై ఆందోళన చెందుతూ, సహోద్యుగులకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగాలకు లోనయ్యారు.వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగాల కోతపై తమ మాతృసంస్థ డాయిష్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయం భారత్‌లో పనిచేస్తున్న సిబ్బందిపైనా ప్రభావం పడుతుందని డాయిష్‌ బ్యాంక్‌ ఇండియా తెలిపింది. ‘భారత్‌లోని ఈక్విటీ వ్యాపారాన్ని కూడా మూసివేస్తారు. దీనిపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదు’అని పీటీఐ వార్తా సంస్థకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే భారత్‌లో ఎన్ని ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని, తొలగించిన వారిని ఇతర విభాగాల్లో తిరిగి నియమించుకునే విషయంపైనా స్పష్టత లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాల తొలగింపుపై ఇప్పుడు వ్యాఖ్యానించడం సరి కాదని బ్యాంకు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించే విషయాన్ని నేరుగానే ఉద్యోగులకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.సిడ్నీ, హాంకాంగ్ డివిజన్లలో పని చేసే సిబ్బంది ముందుకు వైదొలగాల్సి ఉంటుందని డాయిష్ బ్యాంక్ ముందే సమాచారం ఇచ్చింది. హంకాంగ్ లో డాయిష్ బ్యాంక్ హెడాఫీసు సిబ్బందిని పిలిచి మరీ పింక్ స్లిప్ లు అందజేసి వీడ్కోలు పలుకడంతో వారంతా భావోద్వేగానికి గురయ్యారు. సీనియర్ బ్యాంక్ అధికారి సైతం తనకు జాబ్ కావాలని అభ్యర్థించడం దయనీయ పరిస్థితిని తెలియజేస్తోంది. యాజమాన్యం అందజేసిన ఉద్వాసన లేఖలు, వేతన చెల్లింపుల కవర్లతో బయటకు వచ్చే ముందు ఒకరినొకరు పలుకరించుకుని, కౌగిలించుకుని, సెల్ఫీలు తీసుకుంటూ భారమైన మనస్సులతో ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. ముందస్తు సమావేశాల్లోనే డాయిష్ బ్యాంక్ సిబ్బంది కుదింపు తప్పదని యాజమాన్యం తేల్చేసింది. కొన్ని వారాలుగా తమ ఉద్యోగాలు పోతాయని ముందే ఊహించామని పలువురు చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాలు కష్టతరంగా ఉన్న పరిస్థితుల్లో కొత్త కొలువులు సంపాదించుకోవడం కష్ట సాధ్యమేనని అభిప్రాయ పడుతున్నారు.
* ఇటలీకి చెందిన లగ్జరీ మోటార్‌ బైక్‌ల తయారీ సంస్థ డుకాటి.. తన సూపర్‌ బైక్‌ మల్టిస్ట్రాడ 1260 బైక్‌లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘మల్టిస్ట్రాడ 1260 ఎండ్యూరో’ పేరుతో విడుదలైన ఈ బైక్‌ ధర రూ.19.99 లక్షలు. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలలోని తమ డీలర్ల వద్ద బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెర్గీ కానోవాస్‌ మాట్లాడుతూ.. ’ప్రత్యేకించి యువత కోసం రూపొందిన బైక్‌ ఇది. ఆఫ్‌ రోడ్‌ డ్రైవ్‌ ఇష్టపడే ఔత్సాహికుల స్పోర్టీ బైక్‌గా ఈ నూతన వేరియంట్‌ను అభివర్ణిస్తున్నాం’ అని అన్నారు.
* బడ్జెట్‌ అనంతరం కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన దేశీయ మార్కెట్లు బుధవారం కాస్త కోలుకున్నాయి. ఉదయం 9.40 గంటల నుండి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 76 పాయింట్లు లాభపడి 38,807 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 23 పాయింట్ల లాభాలతో 11,579 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.63 వద్ద కొనసాగుతోంది. రంగాలవారీగా చూస్తే ఐటి మినహా దాదాపు మిగతా రంగాల షేర్లన్నీ లాభాల్లో నమోదవుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టీసీఎస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎమ్‌అండ్‌ఎమ్‌, జజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
*అన్ని రుణాలకు సంబంధించి వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్ల (0.05 శాతం) మేర తగ్గిస్తున్నట్లు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంగళవారం ప్రకటించింది. బుధవారం నుంచే కొత్తరేట్లు అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.
* వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,570, ప్రొద్దుటూరులో రూ.34,160, చెన్నైలో రూ.34,210గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,940, ప్రొద్దుటూరులో రూ.31,690, చెన్నైలో రూ.32,640గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,000, ప్రొద్దుటూరులో రూ.38,900, చెన్నైలో రూ.40,800 వద్ద ముగిసింది.
*అధికాదాయ (సూపర్ రిచ్) వర్గంపై సర్ఛార్జి రూపంలో అధిక పన్ను రేటు విధించడం వెనుక విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లను (ఎఫ్పీఐ) లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ వివరణ ఇచ్చారు.
*జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లాలంటే రుణదాతలకు కంపెనీ బకాయిపడ్డ రూ.18,000 కోట్లను ముందుగా జమ చేయాలని స్పష్టం చేసింది.
*అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగించేదిగా హైదరాబాద్కు చెందిన సువెన్ లైఫ్సైన్సెస్ అభివృద్ధి చేస్తున్న మసుపిర్డైన్ (సువెన్- 502) ఔషధంపై నిర్వహిస్తున్న రెండో దశ (ఫేజ్-2) ప్రయోగ ఫలితాలు ఇంతకు ముందు అనుకున్న సమయానికి వెల్లడి కావటం లేదు.
*భెల్ ఛైర్మన్, ఎండీగా నళిన్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. గత నెల 30న పదవీ విరమణ చేసిన ఎంవీ గౌతమ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. ఇంతకు ముందు సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్, ఎండీగా సింఘాల్ పనిచేశారు.
*ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ప్రవీణ్ కుమార్ పూర్వార్ నియమితులయ్యారు. ప్రస్తుతం పూర్వార్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) సీఎండీగా వ్యవహరిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ సీఎండీగా అయిదేళ్ల పాటు పనిచేస్తారని వ్యక్తిగత వ్యవహారాలు చూసే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30న పదవీ విరమణ చేసిన అనుపమ్ శ్రీవాస్తవా స్థానాన్ని పూర్వార్ భర్తీ చేయనున్నారు.
*హ్యుందాయ్ మోటార్ ఇండియా విద్యుత్ స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) ‘కోన’ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.25.3 లక్షలు (ఎక్స్- షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు.
*టైటన్ షేరు గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా దారుణ పతనాన్ని చవి చూసింది. ఇంట్రాడేలో ఏకంగా 14 శాతానికి పైగా నష్టపోయింది. వినియోగ గిరాకీ తగ్గడంతో జూన్ త్రైమాసికంలో విక్రయాలు నెమ్మదించాయని కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో మదుపర్లు విక్రయాలకు తెగబడ్డారు.