Business

మమ్మల్ని దోచుకుని ఇండియా చాలా లాభపడింది

Trump Claims India Profited A Lot By Looting The USA

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకు సంబంధించి మంగళవారం మరోసారి భారత్ మీద విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా భారత్ చర్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జపాన్లోని ఒసాకాలో జరిగిన జీ20 సమావేశంలో భాగంగా టారిఫ్లకు సంబంధించి ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చర్చలు జరిగి రెండు వారాలు కూడా కాకముందే మరో సారి విమర్శలకు దిగడం గమనార్హం. ‘అమెరికా ఉత్పత్తుల మీద టారిఫ్లు విధించి, భారత్ ఎప్పటి నుంచో లాభపడుతోంది. ఇక ముందు ఇది అంగీకారయోగ్యం కాదు’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. త్వరలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అంశాలను పరిష్కరిచేందుకు భారత్, యూఎస్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. దీనికి సంబంధించి యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్టీఆర్) అధికారులు వచ్చే వారం దిల్లీకి రానున్నారు. ఒసాకాలో ఇరు దేశాల అధినేతల సమావేశం అనంతరం ఈ చర్చలు జరుగుతాయని వెల్లడించారు. భారత్కు చెందిన కొన్ని ఉత్పత్తుల మీద యూఎస్ పన్నులు ఎత్తివేసినప్పటికీ, భారత్ మాత్రం ఆ దేశానికి చెందిన 28 ఉత్పత్తుల మీద అధిక మొత్తంలో టారిఫ్లు విధించింది. ఈ కామర్స్ రంగంలో మనదేశం అవలంబిస్తోన్న కఠిన నిబంధనలు కూడా భారత్లో నడుస్తోన్న కొన్ని యూఎస్ సంస్థల మీద ప్రభావం చూపుతుండటం ట్రంప్ ఆగ్రహానికి కారణం.

అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తూ…భారత్ చాలా కాలంపాటు ‘పండగ’ చేసుకుందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ఇలాంటి విధానాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని నిష్కర్షగా పేర్కొంటూ మంగళవారం ట్వీట్ చేశారు. జూన్ 28న భారత ప్రధాని నరేంద్రమోదీ…..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒసాకాలో కలుసుకుని ద్వైపాక్షిక వాణిజ్య వివాదాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్న విషయం గమనార్హం. అమెరికా ఉత్పత్తులపై భారీస్థాయిలో సుంకాలు విధిస్తోందంటూ ఆయన గతంలో కూడా తీవ్రంగా విమర్శిస్తూ… భారత్ను ‘సుంకాల రాజు’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
* ‘బ్రెక్సిట్’ నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని థెరిసా మే పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ తాజాగా నిప్పులు చెరిగారు. ఐరోపా యూనియన్తో ‘బ్రెక్సిట్’ చర్చల విషయంలో ఆమె అంతులేని గందరగోళాన్ని సృష్టించారంటూ ట్రంప్ విరుచుకుపడ్డారు. పదవి నుంచి ఆమె త్వరలోనే వైదొలగనుండటం ఓ రకంగా శుభవార్త అంటూ ఆమెపై ట్విటర్లో విమర్శల వర్షమే కురిపించారు.
* పర్యావరణానికి సంబంధించి ఒబామా సర్కారు గతంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను ట్రంప్ ఖండించారు. నిష్ప్రయోజనకరమైన ఒప్పందాలుగా అభివర్ణించారు. వాటి మూలంగా ప్రపంచంలోనే అత్యంత విపరీత కాలుష్యానికి కారణమౌతున్న దేశాలు కొన్ని నేటికీ పాత పద్ధతులనే పాటిస్తున్నాయంటూ విమర్శించారు. వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమన్న అభిప్రాయాన్ని అమెరికా ఎప్పటి నుంచో వ్యక్తం చేస్తున్న విషయం గమనార్హం.