Editorials

ఉత్తమ ఎమార్వోకు 14రోజుల రిమాండ్

Best MRO Award Recipient And Fraudster Lavanya Sentenced To 14 Days Remand

నెల నెలా వేలకు వేలు జీతం… సమాజంలో పేరు ప్రఖ్యాతలు.. ప్రజలు ఇచ్చే గౌరవ మర్యాదలు.. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దే ప్రభుత్వాధికారం. ఇవేవీ ఆమెకు సరిపోలేదు. పేదోడి చెమటను దోచుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. ఇంకేముంది చేయి తడపందే పనిజరగదంటూ అక్రమాలుకు తెరలేపింది. ఇది కేసంపేట తహసీల్దారు కార్యాలయంలోని లంచావతారిణి లావణ్య దందాతీరు. పైసలిస్తే అందలం ఎక్కిస్తా… కాదంటే కాళ్లు పట్టిస్తా ఇదో తహసీల్దారు కార్యాలయం ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి లంచాలు ఇవ్వనక్కరలేదు అనే బోర్డు చూసి మోసపోయేరు. ఇక్కడ చేయి తడపందే అంగుళం కూడా ఫైలు కదలదు. కింది స్థాయి సిబ్బంది నుంచి తహసీల్దారు వరకూ ప్రతి పనికీ ఓ రేటు.. రేటుకు తగ్గ ప్రతిఫలం అని లోనికి అడుగుపెట్టగానే తెలిసిపోతుంది. రంగారెడ్డి జిల్లా కేసంపేట మండల తహసీల్దారు లావణ్య… దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సర్వీసులో ఉండగానే నాలుగు కాసులు వెనకేసుకునేందుకు లంచావతారిణిగా అవతారమెత్తింది.
మీరే లంచమడిగితే ఇంకెవరికి చెప్పుకోవాలి కార్యాలయంలోని గోడలపై వీఆర్​ఏ, వీఆర్వో నుంచి సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే తహసీల్దారుకు ఫిర్యాదు చేయండి అనే బోర్డులు కట్టారు. మరి తహసీల్దారే లంచం డిమాండ్​ చేస్తే ఏంచేస్తాం. పై స్థాయి అధికారులకు సమాచారం అందించే సాహసం సాధారణ ప్రజలు, రైతులు చేయగలరా.. ఇదే అస్త్రంగా మార్చుకుని కొన్నేళ్లుగా అక్రమదందాకు తెరలేపింది లావణ్య. మధ్యవర్తులుగా కింది స్థాయి సిబ్బందిని ఉపయోగించడం వచ్చిన మొత్తంలో వాటాలు వేసుకొని పంచుకోవడం నిత్యకృత్యంగా మారింది. చేయి తడపనిదే పనవ్వదు.. ఈ కార్యాలయంలో అధికారులకు లక్ష్మీకటాక్షం కలిగించకపోతే ఎన్నిరోజులైనా పనికాదు. పైసలిస్తేనే క్షణాల్లో పనైపోయి బైటపడిపోవచ్చు. లేకుంటే కాళ్లావేళ్లా పడినా పనవ్వదు. తమకు ఆర్థిక స్తోమత లేదని రైతులు కాళ్లు పట్టుకున్నా కనికరించేది కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తహసీల్దారు లావణ్య తమకు న్యాయం చెయ్యడం లేదంటూ ఆకుల లలిత అనే మహిళా రైతు గతంలో కార్యాలయం ముందే ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇన్ని ఆగడాలకు పాల్పడుతున్నా ఆమెపై ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారు కాదని స్థానికులు వాపోతున్నారు. సర్కారు ఆశయానికి తూట్లు పొడుస్తూ.. ఓ వైపు రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు ఇలాంటి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఓవైపు ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు తీసుకుంటూనే.. మరోవైపు ప్రజల సొమ్మును రక్తంలా పీల్చుకుతాగుతున్నారు. నిత్యం ఎంతో మంది ఏసీబీకి దొరుకుతున్నా దర్జాగా దందా చేసుకుపోతున్నారు. ఇచ్చే వాడుండాలే కాని తీసుకోవడానికి మాకేమిటంటూ ఉద్యోగాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చేస్తున్నారు. దొరికిపోతే ఏమౌతుంది మహా అయితే కొన్నాళ్లు జైల్లో ఉంటాం.. అంతేగా అన్న అభిప్రాయంతో ఉన్నారు. అవినీతి నిరోధక చట్టాలు కూడా పటిష్ఠంగా లేకవపోవడం ఇలాంటి ఉద్యోగులకు వరంగా మారింది.

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వీఆర్వో అనంతయ్యకు… దీని వెనక ఉన్న తహసీల్దార్​ లావణ్యకు 14 రోజుల రిమాండ్​ విధించింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరినీ పోలీసులు చంచల్​గూడా జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడం వల్ల అధికారులు కేసు నమోదు చేసి లావణ్యను విచారించనున్నారు. సర్వే రికార్డుల్లో పొలం నంబరు నమోదు చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేశంపేట తహసిల్దార్​ లావణ్య, వీఆర్వో అనంతయ్యకు అనిశా ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. నిందితులిద్దరినీ చంచల్​గూడా జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. రూ.4 లక్షలు తీసుకుంటూ అనిశా అధికారులకు దొరికిపోయిన వీఆర్వో అనంతయ్య కేసులో తహసీల్దార్​ లావణ్యను అరెస్ట్ చేశారు. అనంతయ్య వెనుక లావణ్య పాత్ర ఉందని ఆధారాలు సేకరించారు. తహసీల్దార్​ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ. 93 లక్షల 50 వేల నగదుతో పాటు, 400 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో మరో 5 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చర్లపల్లి జైలుకు అవినీతి ఎమ్మార్వోఆదాయానికి మించి ఆస్తులు: ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు తేలడం వల్ల లావణ్యను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారించారు. విచారణ తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం లావణ్యను, వీఆర్వో అనంతయ్యను బంజారాహిల్స్​లోని అనిశా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. 14 రోజుల రిమాండ్​ విధిస్తూ తీర్పు వెలువర్చిన న్యాయస్థానం నిందితులను చంచల్​గూడా జైలుకు తరలించాలని ఆదేశించింది. అనేక ఫిర్యాదులు: తహసీల్దార్‌ లావణ్య.. వీఆర్వోల ద్వారా భారీగానే అక్రమాలకు పాల్డడినట్టు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. కేశంపేట తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టాక లావణ్య అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం వల్ల, గత నెలలో పదిమంది వీఆర్వోలు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన వీఆర్వోలు విధుల్లో చేరినా… తహసీల్దార్‌ మాత్రం పాతవారిని మరో చోటికి పంపలేదు. బదిలీ అయిన వారిలో వీఆర్వో అనంతయ్య కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో లావణ్య బాధితులు..? లావణ్య ఓ స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరిచేందుకు నిబంధనలు మార్చి ఆమె రూ. 30 లక్షలు డిమాండ్‌ చేశారు. అయితే ఆ సంస్థ 30 లక్షలను సంచిలో తీసుకువచ్చినట్టు అనిశా అధికారులు ఆధారాలు సేకరించారు. అలాగే ఇంటి స్థలాలను కొనుగోలు చేసినట్టు దస్త్రాలు లభించాయి. బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయని గుర్తించారు. దీనితో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా మరో కేసు నమోదు చేసి ఆమెను లోతుగా విచారించనున్నారు. తహసీల్దార్‌ లావణ్య బాధితులు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్న అనిశా ఆ దిశగా విచారణ జరపనున్నారు.