Business

కరెంట్ బిల్లులు కట్టలేదని BSNL టవర్లు మూసేశారు

BSNL Towers Closed Due To Pending Power Bills

కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో బీఎస్‌‌ఎన్‌‌ఎల్ మొబైల్ టవర్స్ మూతపడ్డాయి. వెయ్యికి పైగా మొబైల్ టవర్లు, 500 టెలిఫోన్ ఎక్సైంజీలు కార్యకలాపాలు సాగించడం లేదని కమ్యూనికేషన్ మంత్రి రవి శంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌‌సభకు రాత పూర్వకంగా తెలియజేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌‌ఎన్‌‌ఎల్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్‌‌ఎల్)లను పునరుద్ధరించే ప్రణాళికలు సాగుతున్నట్టు చెప్పారు. డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) ఇప్పటికే తన చర్యలను ప్రారంభించిందని, బీఎస్‌‌ఎన్‌‌ఎల్, ఎంటీఎన్‌‌ఎల్ పునరుద్ధరణ ప్రణాళికలు ప్రిపరేషన్‌‌లో ఉన్నాయని తెలిపారు. బీఎస్‌‌ఎన్‌‌ఎల్ విషయానికొస్తే.. కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో పలు ప్రాంతాల్లో మూతపడిన మొబైల్ టవర్లు 1,083 ఉండగా.. టెలిఫోన్ ఎక్సైంజీలు 524 ఉన్నట్టు రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ల్యాండ్ ఓనర్లకు బకాయిలు చెల్లించకపోవడంతో 258 టవర్లు కూడా మూతపడినట్టు బీఎస్‌‌ఎన్‌‌ఎల్ తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. కాగా, బీఎస్‌‌ఎన్‌‌ఎల్ మొత్తం మార్కెట్ షేరు 2017 మార్చి నుంచి 2019 మార్చి మధ్య కాలంలో స్వల్పంగా పెరుగగా.. ఎంటీఎన్‌‌ఎల్ మార్కెట్ షేరు తగ్గింది. 2018–19 ఏడాదిలో బీఎస్‌‌ఎన్‌‌ఎల్​కు 53.64 లక్షల మంది సబ్‌‌స్క్రైబర్లు పోర్ట్‌‌ ఇన్ అవగా.. 28.27 లక్షల మంది పోర్ట్ అవుట్స్ అయ్యారు. ఇదే ఏడాదిలో ఎంటీఎన్‌‌ఎల్‌‌కు 10,195 పోర్ట్‌‌ ఇన్‌‌లు నమోదవగా.. 1.35 లక్షల పోర్ట్‌‌ అవుట్‌‌లు ఉన్నాయి. 2009–10 ఆర్థిక సంవత్సరం నుంచి బీఎస్‌‌ఎన్‌‌ఎల్, ఎంటీఎన్‌‌ఎల్‌‌ కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి.