NRI-NRT

అమెరికాలో తెలుగువారికి మంచి రోజులు

Will HR1044 Pass Senate And Yields Better Days To Telugus?

అమెరికా పౌరసత్వం పొందాలన్న తెలుగువారి కలలు త్వరలో సాకారం కానున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వృత్తి నిపుణులకు మంచిరోజులు రానున్నాయి. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లినవారు చట్టబద్ధమైన పౌరులు కావాలంటే గ్రీన్కార్డును పొందాలి. అందుకోసం ఆ దేశం వెళ్లిన లక్షలాదిమంది సంవత్సరాల తరబడి ఎదురు చూస్తుంటారు. అమెరికా ప్రభుత్వం ఏడాదికి సగటున 1.40 లక్షల కార్డులే జారీ చేస్తుంది. అన్ని దేశాలవారికీ అవకాశం కల్పించేందుకు కోటా విధానాన్ని అమలు చేస్తుంది. ఒక్కో దేశానికి 7 శాతానికి మించకుండా గ్రీన్కార్డులు జారీ చేస్తుంది. ఫలితంగా సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆ విధానాన్ని దశల వారీగా ఎత్తివేసేందుకు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అమలులోకి వస్తే అత్యధికంగా లబ్ధిపొందే వారిలో భారత్, చైనా దేశాలకు చెందిన వారే అధికంగా ఉంటారు. భారతీయుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐటీ, ఎలక్ట్రానిక్, ఫార్మా, వైద్య నిపుణులు అత్యధికులు గ్రీన్కార్డులను పొందనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హెచ్1బి వీసాపై అమెరికాలో లక్ష మంది వరకు పని చేస్తున్నట్లు ఇమిగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ అధ్యయనం పేర్కొంది.
*15 ఏళ్లుగా ఎదురుచూపులు
ఉపాధి కోసం అమెరికా వెళ్లిన ఆసియా దేశాలకు చెందిన నైపుణ్య సాంకేతిక నిపుణులు గ్రీన్కార్డు పొందాలంటే కనీసం 15 ఏళ్లపాటు ఎదురుచూడాల్సి వస్తోంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డుల జారీలో ఆంక్షలు ఎత్తివేస్తే ఈ ఎదురుచూపులు గణనీయంగా తగ్గుతాయి. అత్యధిక జీతాలను పొందే వారికి ప్రాధాన్యం పెరగనుంది. నిపుణులు అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు 2020లో 15 శాతం, 2021, 2022 సంవత్సరాల్లో 10 శాతం చొప్పున వెసులుబాటు కల్పించాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. 2023 సంవత్సరం నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఒకదఫా గ్రీన్కార్డు లభిస్తే చట్టబద్ధంగా అమెరికా పౌరసత్వం లభించినట్లే. శాశ్వత నివాసం, ఉద్యోగ వసతి లభించటంతోపాటు భార్య లేదా భర్త ఉద్యోగం చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.
*విద్యార్థులూ పెరుగుతారు
గ్రీన్కార్డుల జారీలో ఆంక్షలు ఎత్తివేస్తే అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపే వారికి సంఖ్య పెరుగుతుందని అంచనా. విద్యార్థి వీసాపై వెళ్లి ఆ తరవాత హెచ్1బి వీసాతో ఉద్యోగాలు పొందే వారు ఎక్కువగా ఉంటుంటారు. ఇలాంటి వారు బోగస్ విశ్వవిద్యాలయాల బారినపడి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం విద్యార్థులకు ఉపయుక్తం అవుతుంది.