Business

అమెరికా ఇండియా మధ్య భారీగా పెరిగిన విమాన ఛార్జీలు

Flight Prices Hiked Between India and USA

అమెరికా యాత్ర ప్రియంగా మారింది. అంతర్జాతీయ విమానాలకు టికెట్లు లభించడం లేదు. ఒకవేళ దొరికినా రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోంది. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. జెట్ ఎయిర్వేస్ విమానాల్లో 40ు అంతర్జాతీయ కనెక్టివిటీ ఉన్నవే. ఇప్పుడు అవన్నీ నిలిచిపోవడంతో సుమారు 2 వేల సీట్లను ఇతర విమాన సంస్థలు సర్దుబాటు చేస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరు నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.ప్రపంచ కప్ క్రికెట్ పోటీల నేపథ్యంలో టికెట్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని కొందరు సర్దుకుపోయారు. ఇప్పుడు అది కూడా పూర్తయినా రేట్లు ఎందుకు తగ్గడం లేదని ఆరా తీస్తే జెట్ ఎయిర్వేస్ సంక్షోభమని చెబుతున్నారు. ఏపీ నుంచి అమెరికాకు వెళ్లేవారు.. సింగపూర్కు వెళ్లి అక్కడి నుంచి వెస్ట్కోస్టు నగరాలైన లాస్ ఏంజిల్స్, ఆమ్స్టర్డామ్లకు కనెక్టింగ్ విమానాలు ఎక్కేవారు. ఈస్ట్కోస్టు సిటీలకు వెళ్లేవారు దుబాయ్ వెళ్లి కనెక్టింగ్ విమానాలు ఎక్కేవారు.వీటన్నింటికీ జెట్ ఎయిర్వేస్ అనుసంధానంగా ఉండేది. ఇంతకు ముందు అమెరికా వెళ్లి రావాలంటే రానుపోను రూ.60 వేల నుంచి రూ.70 వేలు సరిపోయేయి.ఇప్పుడు రెండు వైపులా టిక్కెట్లకు రూ.1.5 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని తేదీల్లో అయితే అమెరికాకు ఒక వైపు టిక్కెట్టే రూ.లక్ష ఉంటోంది. జూలైతోపాటు ఆగస్టు నెల టికెట్ల ధరలు కూడా ఇలాగే ఉంటాయని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయమోహన్ తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ధర రెట్టింపు అయ్యిందని వివరించారు.