Politics

చంద్రబాబు…నీ కుక్కని అదుపులో పెట్టుకో

Kesineni Issues Ultimatum To Chandrababu Over Buddha Venkanna

విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నా లాంటి వాడు పార్టీకి అవసరం లేదనుకుంటే.. తెదేపా అధినేత చంద్రబాబు ఆ విషయాన్నైనా నాకు తెలియజేయాలి. అలా చెప్తే తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. తన లాంటి వాడు పార్టీ లో కొనసాగాలంటే చంద్రబాబు తన పెంపుడు కుక్కని అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఉద్దేశించి అన్నారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు.. నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్లు చేస్తున్నాడు. దౌర్భాగ్యం! నిన్నటి వరకూ చంద్రబాబు కాళ్లు.. రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు.. వ్యక్తులు మాత్రమే తేడా.. కాళ్లు కాళ్లే. రాజకీయ జన్మలు, పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులనేవి… గుళ్లో కొబ్బరి చిప్పల దొంగలు, సైకిల్‌ బెల్లుల దొంగలకి, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవీదారులకు అవసరం. నాకు అవసరం లేదు.’ అంటూ కేశినేని ట్విటర్‌ వేదికగా ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందిస్తూ ‘బస్సుల మీద ఫైనాన్స్‌ తీసుకుని.. 1997లో సొంతంగా దొంగ రసీదులు తయారు చేసి దొంగ ముద్ర వేసుకుని.. కోట్లాది రూపాయలు ఫైనాన్స్‌ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్లు చేసేది. దళిత నాయకుడు, మాజీ స్పీకర్‌ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి.. వినే ధైర్యం నీకుందా? చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే.. అతడినే అనరాని మాటలని ఆ పార్టీని కూల్చావు. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మనిస్తే ఇవాళ ఆయన గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి మీద నేనో.. నువ్వో.. ఎవరు పోరాడుతున్నారనేది ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు. ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చే ముందు ఆడిన ఆటలు.. ఈ పార్టీలో సాగవు. సంక్షోభం సమయంలో పార్టీ, నాయకుడి కోసం పోరాడే వాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు. చనిపోయే వరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గతంలో ఘాటుగా సమాధానమిచ్చారు.