ScienceAndTech

విక్రం సారభాయి కలలకు రూపమే ఇస్రో

The origin history of ISRO - Vikram Sarabhai Behind Its Development

చంద్రయాన్‌2… ఇప్పుడు అందరి చూపూ దీని వైపే… దీంట్లో విక్రం పేరుతో ఓ ల్యాండర్‌ వెళుతోంది కదా… ఆ విక్రం ఎవరనుకుంటున్నారూ? మన భారతీయ శాస్త్రజ్ఞుడు విక్రం సారాభాయి! ఆయన జీవిత విశేషాలే ఇవి.ఇప్పుడు మన దేశం అంతరిక్ష రంగంలో దూసుకెళుతోంది. అందుకు ఆద్యుడు విక్రం సారాభాయి. భారత్‌ ప్రపంచ దేశాలకు ఏ మాత్రం తీసి పోకూడదని కలలుగన్నారు. మనమూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్నిసాధించాలనుకున్నారు. ఇస్రో స్థాపనకు ఎంతో కృషి చేసిన ఈయన గొప్ప శాస్త్రవేత్త. రష్యా స్ఫుత్నిక్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తొలి రోజులవి. అప్పుడే యువ శాస్త్రవేత్తగా ఉన్న ఈయనకు మన భారతదేశమూ ఇలా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ పరిశోధనల ఆవశ్యకతను ప్రభుత్వానికి వివరించి ‘అంతరిక్ష పరిశోధనా సంస్థ’(ఇస్రో) స్థాపనకు కారకుడయ్యారు.
***స్కూలే పెట్టారు!
* విక్రం సారాభాయి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1919 ఆగస్టు 12న పుట్టారు.
* వీళ్లది ధనిక, పారిశ్రామిక, వ్యాపార జైనుల కుటుంబం. తండ్రి పారిశ్రామికవేత్త.
* సంతానం ఎనిమిది మందిలో విక్రం ఒకరు.
* గుజరాత్‌లోని ఎన్నో మిల్లులకు అధిపతి అయిన ఈయన తల్లి తమ పిల్లల ప్రాథమిక విద్య కోసం ఏకంగా మాంటిస్సోరీ పద్ధతుల్లో నడిచే ఒక ప్రైవేటు స్కూల్‌ని స్థాపించారు.
* వీరి కుటుంబం అప్పటికే భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేది. దీంతో వీరి ఇంటికి మహాత్మాగాంధీ, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జిడ్డు కృష్ణమూర్తిలాంటి వారు వచ్చి వెళుతుండేవారు. ఆ మహనీయుల పరిచయం విక్రం వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడింది.
* అహ్మదాబాద్‌లోని గుజరాతీ కాలేజీలో మెట్రిక్యులేషన్‌ పూర్తిచేశారు.
* తర్వాత లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ అనుబంధ కళాశాల సెయింట్‌జోన్స్‌లో చదువు కొనసాగించారు.
* రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన సారాభాయి భౌతికశాస్త్రంలో నోబెల్‌ విజేత సర్‌ సీవీ రామన్‌ పర్యవేక్షణలో బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌’లో కాస్మిక్‌ కిరణాలపై పరిశోధనలు జరిపారు.
ఆ తర్వాత తిరిగి లండన్‌కు వెళ్లిన ఈయనకు కాస్మిక్‌ కిరణాలపై చేసిన పరిశోధనలకుగాను 1947లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ లభించింది.
***ఇస్రోకు ముందు…
* 1947లో భారత్‌కు తిరిగి వచ్చిన సారాభాయి దేశ అవసరాలను గమనించి, తన కుటుంబం నిర్వహిస్తున్న ధార్మిక సంస్థలను ఒప్పించి నవంబరు 11, 1947న ఒక పరిశోధనా సంస్థను నెలకొల్పారు. అదే అహ్మదాబాద్‌లోని ‘ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ’. ఇప్పటికీ ఇక్కడ భౌతికశాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి.
* ఈయన విజయాల్లో గొప్పది ఇస్రో స్థాపన. దీని స్థాపనకు ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఆయన కృషి ఎంతో.
* అరేబియా సముద్ర తీరంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న తుంబా దగ్గర రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రాన్ని స్థాపించారు. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, సాంకేతిక నిపుణుల్ని సమకూర్చడంలో ఆయన ఎంతో కష్టపడ్డారు.
* నవంబరు 21, 1963న సోడియం వేపర్‌ పేలోడ్‌తో ఈయన ఆధ్వర్యంలో భారత్‌ తొలి రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ ప్రయోగంతో దేశం అంతరిక్ష రంగంలోకి అడుగు పెట్టినట్లయ్యింది.
* సారాభాయి 1966లో అమెరికాలోని నాసాతో జరిపిన చర్చల ఫలితంగా ఆయన మరణానంతరం శాటిలైట్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ ఎక్స్‌పరిమెంట్‌ను 1975-76ల మధ్య కాలంలో జరిపారు.
* స్వతంత్ర ప్రతిపత్తిని ఎంతో ఇష్టపడే సారాభాయి భారత్‌ స్వయంగా ఉపగ్రహాన్ని నిర్మించి అంతరిక్షంలోకి ప్రయోగించాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్టును ప్రారంభించారు. దాని ఫలితమే 1975లో భారతీయ శాస్త్రజ్ఞులు ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. ఈ ప్రయోగం సారాభాయి స్మృతికి నివాళి. తర్వాత రాకెట్లకు కావాల్సిన ఘన, ద్రవ, వాయు పదార్థాల ఇంధనాలను సమకూర్చే పరిశోధనా సంస్థను శాస్త్రజ్ఞులు నిర్మించి, దానికి విక్రం సారాభాయి స్పేస్‌ సెంటర్‌ అనే పేరు పెట్టారు.
***సేవలెన్నో!
* అంతరిక్షం నుంచి భూమి వైపు వచ్చే కాస్మిక్‌ కిరణాల్ని అధ్యయనం చేయడానికి అహ్మదాబాద్‌, కొడైకెనాల్‌, తిరువనంతపురాల్లో స్థాపించిన రికార్డింగ్‌ స్టేషన్లు పరిశోధనలపై సారాభాయికి ఉన్న మక్కువకు నిదర్శనం.
* ఒకవైపు తన కుటుంబ వ్యాపారాలు, పరిశ్రమల్ని పర్యవేక్షిస్తూనే… అహ్మదాబాద్‌లో కమ్యూనిటీ సెంటర్‌, దేశంలోనే తొలి మార్కెటింగ్‌ రిసెర్చ్‌ సంస్థ ఆపరేషన్‌ రిసెర్చ్‌ గ్రూప్‌, వస్త్ర వ్యాపార అభివృద్ధికి అహ్మదాబాద్‌ టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌, సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీ, అంధుల కోసం బ్లైండ్‌మెన్‌ అసోసియేషన్‌లను స్థాపించడం దేశంపై ఆయనకున్న అంకితభావం, అభిమానానికి నిదర్శనం. ఈయనకు సంగీత,
నృత్యాలన్నా చాలా ఇష్టం.
* మన దేశ అటామిక్‌ ఎనర్జీ ఛైర్మన్‌గా 1966-71మధ్య పనిచేశారు.
* 1962లో ఇండియన్‌ స్పేస్‌ కాంగ్రెస్‌, ఫిజిక్స్‌ విభాగానికి అధ్యక్షుడిగానూ, 1971లో నాలుగో యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ పీస్‌ఫుల్‌ యూజ్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
* మన దేశంలోని శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారాన్ని, భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషన్‌ బిరుదును అందుకున్నారు. 52 ఏళ్లకే 1971లో మరణించారు.