Movies

రజనీ…రాజకీయాలకు దూరంగా ఉండు

Alagiri Says Rajinikanth Should Stay Away From Politics

ఎంజీఆర్‌ తర్వాత సినీ నటులు ఎవరూ రాజకీయాల్లో రాణించలేదని, అందుకే రజనీకాంత్‌ దీనికి సంబంధించిన అనవసర ప్రయత్నాలు మానుకోవాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ సమాచార సాంకేతిక, సామాజిక మాధ్యమ విభాగం జిల్లా నిర్వాహకుల సమావేశం ఆదివారం సాయంత్రం చెన్నై సత్యమూర్తి భవన్‌లో జరిగింది. దీనికి ఆ విభాగ రాష్ట్ర కన్వీనరు లక్ష్మీకాంతన్‌ అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథులుగా పార్టీ జాతీయ కార్యదర్శి సంజయ్‌ దత్‌, కేఎస్‌ అళగిరి పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో కేఎస్‌ అళగిరి మాట్లాడారు. వేలూరు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఏసీ షణ్ముగానికి మద్దతుగా రజనీ మక్కల్‌ మండ్రం సభ్యులు రంగంలోకి దిగడంపై విలేకర్లు ఆయన్ను ప్రశ్నించారు. దీనికి కేఎస్‌ అళగిరి బదులిస్తూ.. వేలూరులో సినిమా థియేటర్లు అధికంగా ఉన్నాయని, అక్కడ రజనీ సినిమాను ప్రదర్శించి అభిమానులు చూడొచ్చని, ఎన్నికల్లో వారి ప్రభావం ఉండదని తెలిపారు. సినిమాలు, రాజీకీయాలు వేర్వేరని రజనీకాంత్‌ అర్థం చేసుకోవాలని సూచించారు. ఎంజీఆర్‌ తర్వాత సినీ నటుడు ఎవరూ రాజకీయాల్లో రాణించలేదని పేర్కొన్నారు. రజనీ కూడా అనవసర ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.

రజనీకాంత్‌కు సలహాలు ఇచ్చే అర్హత కేఎస్‌ అళగిరికి లేదని భాజపా జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా తెలిపారు. పళనిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘రాజకీయాల్లో ఉండొచ్చా?’ అనే విషయాన్ని అవినీతి ఆరోపణలు ఉన్న రాహుల్‌గాంధీ, పి.చిదంబరం, కార్తీ చిదంబరం కింద పని చేసే కేఎస్‌ అళగిరి ఆలోచించాలని పేర్కొన్నారు. ఓ తీవ్రవాద సంస్థకు చెందిన కొంత మందిని రాష్ట్రంలో అరెస్టు చేయటం దిగ్భ్రాంతికర విషయమని తెలిపారు. హిందూ సంఘాలకు చెందిన కొంత మంది హత్యకు గురవుతున్నారని, ఆ కేసుల్లో ఇంతవరకు తీర్పు రావకపోవటం తీవ్రవాద సంస్థలు అభివృద్ధి చెందటానికి ఓ కారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా చెన్నై మన్నడి ప్రాంతం తీవ్రవాదుల స్థావరంగా మారిందని, ఇది రాష్ట్రానికి ముప్పు అని చెప్పారు. విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగ ప్రత్యేక అధికారి పొన్‌.మాణిక్కవేల్‌కు ఆయా కార్యకలాపాలు నిర్వర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. విదేశాల్లో స్వాధీనం చేసుకున్న విగ్రహాలు ఏ దేవాలయానికి చెందినవో తెలియలేదని మంత్రి పాండియరాజన్‌ చెప్పారని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం దేవాలయ ఆస్తులను పరిరక్షించలేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదన్న విషయం కూడా న్యాయశాస్త్రం చదివిన పి.చిదంబరంనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. ఆయన దృష్టి ఆస్తులు కూడబెట్టటంపైనే ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ శాసనసభ్యులను కాపాడుకోలేక భాజపాపై ఆరోపణలు చేయటం తగదని హితవు పలికారు.