Business

గన్నవరం నుండి భారీ రద్దీ

Gannavaram Airport Witnesses Lot Of Crowd In 2019 Year

గన్నవరం విమానాశ్రయం నుంచి గత మూడు నెలల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. 2019 తొలి త్రైమాసికంలో ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల్లోనే 3.20లక్షల మంది దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. నాలుగేళ్ల ముందు వరకూ ఏడాది మొత్తానికి కలిపి మూడు లక్షల మంది ప్రయాణికులుండేవారు. తాజాగా మూడు నెలల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. విమాన ప్రయాణికులకు సంబంధించి గత మూడు నెలల నివేదికలో గతేడాది కంటే భారీగా పెరుగుదల కనిపించింది. 2018లో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ 3.08 లక్షల మంది ప్రయాణించగా.. ఈ ఏడాది మరో 11వేల మంది పెరిగారు. తాజా నివేదిక ప్రకారం నెలకు 1.10లక్షల మందికి పైగా ప్రయాణికులు గన్నవరం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.గన్నవరం విమానాశ్రయం నుంచి నిత్యం 60 విమాన సర్వీసులు దేశంలోని ఎనిమిది నగరాలకు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇతర నగరాలకు ఈ సర్వీసుల్లో వెళ్లే వారి కంటే.. అటునుంచి వస్తున్న వారే అధికంగా ఉన్నారు. గత మూడు నెలల్లో ఇతర నగరాల నుంచి గన్నవరానికి 1.66లక్షల ప్రయాణికులు రాగా.. ఇటు నుంచి 1.49లక్షల మంది వెళ్లారు. విదేశీ ప్రయాణికులు సైతం గన్నవరం విమానాశ్రయం నుంచి గత మూడు నెలల్లో 4830 మంది రాకపోకలు సాగించారు. సింగపూర్ అంతర్జాతీయ సర్వీసు వారానికి రెండు రోజులు జూన్ నెలాఖరు వరకూ నడిచింది దీనిలో కనీసం 1200 నుంచి 1900 వరకూ గత మూడు నెలల్లో రాకపోకలు సాగించారు. జులై ఆరంభం నుంచి ఈ సర్వీసు ఆగిపోయిన విషయం తెలిసిందే.