NRI-NRT

సింగపూర్ బోనాల్లో పులివేషాలు

Singapore Telugu NRIs Celebrates Bonalu 2019 - సింగపూర్ బోనాల్లో పులివేషాలు

బోనాల పండుగ వేడుకలు దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా సింగపూర్‌లో ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్’ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ పండగ వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్‌’ లోని శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్‌లో తెలంగాణ ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న ప్రవాస భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ‘తీన్ మార్’ స్టెప్పులు వేసి అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. ప్రజలకు మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్‌ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. బోనాల పండుగను సింగపూర్‌కు మూడేళ్ల క్రితం పరిచయం చేశామని టీసీఎస్‌ఎస్‌ పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలోటి‌సి‌ఎస్‌ఎస్ ఎప్పుడు ముందుంటూ నిర్విరామంగా కృషి చేస్తుందని అభిప్రాయపడ్డారు.