Business

మోడీ ప్రభుత్వం ఏపీకి సాయం ఆపేయమంది

World Bank Says Indian Government Ordered To Back Off Supporting AP

కేంద్రం సూచనతోనే ఏపీ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం ఉపసంహరించుకున్నట్లు ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అమరావతికి రుణ ప్రతిపాదనపై ప్రపంచ బ్యాంకు తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. రాజధాని మౌలిక వసతులకు ఉద్దేశించిన ‘అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు’ కోసం రుణం ఇవ్వాలని గతంలో ప్రపంచ బ్యాంకుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్రం చేసిన సూచనల మేరకే అమరావతికి రుణ ప్రతిపాదన రద్దు చేసినట్లు తాజాగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుంటూ ఈ నెల 15న కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించింది. రాజధాని ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నప్పటికీ ఏపీ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ద్వారా తమకు ప్రతిపాదనలు పంపితే పరిశీలించి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఇప్పటికే బిలియన్‌ డాలర్ల సాయాన్ని అందజేస్తున్నామని, అది కొనసాగుతుందని చెప్పింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో 328 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు గతనెల 27న తాము ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన విషయాన్ని ప్రకటనలో ప్రస్తావించింది.