Agriculture

గుంటూరు మిర్చి యార్డులో పెరుగుతున్న మిర్చి ధరలు

Chillies Prices Rising In Guntur Mirchi Yard

గుంటూరు మిర్చి యార్డులో ఎండు మిర్చి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగుమతులు ఆశాజనకంగా, సరకు నిల్వలు తక్కువగా ఉండటంతో వారం రోజుల్లో కిలోకు రూ.10కి పైగా ధర పెరిగింది. తేజ, బాడిగి, సూపర్ 10 రకాల్లో నాణ్యమైనవి వచ్చినవి వచ్చినట్లే అమ్ముడుపోతున్నాయి. ధరలు పెరగడంతో శీతల గోదాముల్లో నిల్వ చేసిన సరకును రైతులు, వ్యాపారులు బయటకు తీస్తున్నారు. దీంతో రోజూ 60 వేలకుపైగా టిక్కీలు వస్తుండగా అంతేస్థాయిలో విక్రయిస్తున్నారు. తేజ మిర్చి క్వింటా గరిష్ఠంగా రూ.14 వేల ధర పలికింది. మిగిలిన అన్ని రకాలూ సగటున కిలో రూ.100 పైనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ధరలు పెరిగినా స్థిరంగా కొనసాగుతుండటం ఇదేనని మార్కెట్వర్గాలు చెబుతున్నాయి. ఇండోనేసియా, థాయ్లాండ్, చైనా నుంచి రోజురోజుకూఆర్డర్లు పెరుగుతున్నాయి. గుంటూరు యార్డుకు వచ్చే సరకులో నాణ్యమైన మిరపకాయలకు అధిక ధర వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పైకి ఎగబాకే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని శీతల గోదాముల్లో 70 లక్షల టిక్కీలు (బస్తాలు) ఉన్నాయనేది వ్యాపారవర్గాల వర్గాల అంచనా.