Politics

అనర్హత వేటు వేసిన కర్ణాటక స్పీకర్

Karnataka Speaker Declares 14 MLAs Ineligible

యడియూరప్ప ప్రభుత్వం సోమవారం బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా కర్ణాటకీయం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్ అనర్హత వేటు వేశారు. మొత్తం 14 మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. బలపరీక్షలో కుమార స్వామి ప్రభుత్వం పతనమైన మరుసటి రోజే స్పీకర్‌ ముగ్గురి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడీ సంఖ్య 17కు చేరింది. ఇందులో ముగ్గురు జేడీఎస్‌, 14 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ షాకిచ్చారు.

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేయడం బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం నాడు యడియూరప్ప అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

11 మంది కాంగ్రెస్ రెబెల్స్, 3 జేడీ(ఎస్) ఎమ్మెల్యేలపై ఆదివారం నాడు స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేశారు. మూడు రోజుల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.దీంతో 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటేశారు.

17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడంతో కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 105.జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమికి 99 సభ్యుల బలం ఉంది.

అనర్హతకు గురైన ఎమ్మెల్యేలలో కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు చెందిన వారే ఉన్నారు. వీరంతా కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తివాదులుగా ముద్రపడ్డారు. ముంబైలో క్యాంప్ వేశారు.

అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. మరో ఇండిపెండెంట్ సభ్యుడు కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ బలం 106కు చేరింది. కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం బీజేపీకి కలిసివచ్చే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు సోమవారం నాడు అసెంబ్లీలోకి అనుమతించబోమని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత సోమవారం నాడు తొలిసారిగా అడుగుపెట్టనున్నారు.

కుమారస్వామి విశ్వాస పరీక్ష సమయంలో స్పీకర్ తీరుపై బీజేపీ విమర్శలు గుప్పించింది. యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత స్పీకర్ ను మారుస్తారా అనే ప్రచారం సాగింది. ఈ తరుణంలో స్పీకర్ తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

రెబెల్ ఎమ్మెల్యేలు ముంబై హోటల్ లో చాలా రోజుల పాటు ఉన్నారు. విశ్వాస పరీక్షకు కూడ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది. స్పీకర్ నిర్ణయంపై ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.