Sports

ఫ్లోరిడాలో ఇండియా-వెస్టిండీస్ టీ20

India West Indies 2019 T20 In FLorida - ఫ్లోరిడాలో ఇండియా-వెస్టిండీస్ టీ20

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా అమెరికాకు బయలుదేరింది. అదేంటి వెస్టిండిస్ పర్యటన అంటే టీమిండియా కరీబియన్ దీవులకు పయనమవ్వాలి కానీ అమెరికాకు వెళ్లడమేంటని ఆశ్యర్యపోతున్నారా. అయితే మీరు మరోసారి భారత్-వెస్టిండిస్  మధ్య జరగనున్న టీ20 సీరిస్ షెడ్యూల్ ను జాగ్రత్తగా గమనించాల్సిందే. వచ్చే నెల(ఆగస్ట్) 3నుండి 6వ తేదీ వరకు భారత్-వెస్టిండిస్ లు మూడు టీ20 మ్యాచుల్లో తలపడనున్నాయి. అయితే ఈ టీ20 సీరిస్ వెస్టిండిస్ లో కాకుండా   అమెరికాలో జరగనుంది. వరుసగా 3,4 తేదీల్లో జరగనున్న మ్యాచులకు ప్లోరిడా ఆతిథ్యమివ్వనుంది. ఇక 6వ తేదీన గయానాలో చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.   ఇందుకోసమే టీమిండియా ఇవాళ నేరుగా అమెరికాకు పయనమయ్యింది. ఈ సీరిస్ అనంతరం భారత జట్టు కరీబియన్ దీవుల్లో అడుగుపెట్టనుంది. ఇలా టీమిండియా, వెస్టిండిస్ ల మధ్య జరిగే పోరు అమెరికన్లకు మజానివ్వనుందన్న మాట. అంతేకాకుండా యూఎస్ఎ లో భారీ సంఖ్యలో స్థిరపడ్డ భారతీయులతో పాటు వెస్టిండిస్ దేశస్థులకు ఈ సీరిస్ ద్వారా తమ జట్ల ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం  వచ్చింది. ఇప్పటికే ఈ మ్యాచ్ ల కోసం భారతీయులు భారీగా టికెట్లు కొనుగోలుచేసినట్లు సమాచారం. అలాగే అమెరికన్లు కూడా ఈ సీరిస్ పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ టీ20 సీరిస్ ముగిసిన తర్వాత  కూడా 8వ తేదీన వన్డే సీరిస్ గయానాలోనే ప్రారంభంకానుంది. ఆ తర్వాత 11, 14 తేదీల్లో జరిగే 2,3 వన్డేలకు ట్రినిడాన్ వేదిక కానుంది. ఇక రెండు టెస్ట్ మ్యాచుల్లో మొదటి  మ్యాచ్ అంటిగ్వా, రెండో మ్యాచ్ జమైకాలో జరగనుంది. ఇలా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య సీరిస్ వివిధ దేశాల్లో సాగనుంది.