Business

ఏడాది పాటు సెర్బియా నిర్బంధంలో నిమ్మగడ్డ

Nimmagadda Gets Conditional Bail In Serbia.Might Be In Serbia For An Year. - ఏడాది పాటు సెర్బియా నిర్బంధంలో నిమ్మగడ్డ

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెల్‌గ్రేడ్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రస్‌అల్‌ ఖైమా ఫిర్యాదుతో నాలుగు రోజుల క్రితం నిమ్మగడ్డను బెల్‌గ్రేడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మగడ్డ స్వదేశానికి వచ్చే విషయంపై బెయిల్ ఉత్తర్వుల పరిశీలన తర్వాత స్పష్టత వస్తుందని లాయర్లు తెలిపారు. 

వాన్‌పిక్‌ వ్యవహారంలో లాభాలు ఆర్జించడానికి, నిధులు తరలించడానికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించారనే ఆరోపణలపై యూఏఈ ఫెడరల్‌ క్రిమినల్‌ కోడ్‌లోని ఆర్టికల్‌ 5/5, 44, 225, 227, 228, 230, 399 కింద నిమ్మగడ్డ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుడిని తమకు అప్పగించాలన్న రస్‌ ఆల్‌ ఖైమా(రాక్‌) దేశ అభ్యర్థన మేరకు అబుదాబిలోని ఇంటర్‌ పోల్‌ 2016 సెప్టెంబరు 5న రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

అది జారీ అయ్యాక బ్రిటన్‌, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో నిమ్మగడ్డ పర్యటించినా పట్టించుకోలేదు. సెర్బియా వెళ్లినపుడు అకస్మాత్తుగా అక్కడి పోలీసులు జులై 27న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెల్‌గ్రేడ్‌లోని ఉన్నత న్యాయస్థానంలో హాజరుపరిచారు. సదరు నిర్బంధాన్ని కోర్టు అనుమతించింది.

‘‘ఈ నిర్బంధం జులై 27న ఉదయం 8.20 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. ప్రతి రెండు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఏడాది వరకు నిర్బంధాన్ని కొనసాగించడానికి వీలుంటుంది’’ అని కోర్టు పేర్కొంది.

‘‘ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసు, తమకు అప్పగించాలన్న రాక్‌ అభ్యర్థన మా వద్ద ఉంది. సెర్బియాలో నిందితునికి నివాసం లేదు. రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యేలోగా పారిపోవడానికి, తప్పించుకుని తిరగడానికి అవకాశం ఉన్నందున నిర్బంధంలోకి తీసుకోవచ్చు’’ అని కోర్టు అభిప్రాయపడింది.

నిందితుడి వాదనలు వినకుండా తక్షణం అదుపులోకి తీసుకోవడానికి చట్టాలు అనుమతిస్తున్నాయని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా షరతులతో నిమ్మగడ్డను కోర్టు విడుదల చేసినట్టు సమాచారం. విడుదలైనప్పటికీ అక్కడున్న చట్ట ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆయన బెల్‌గ్రేడ్‌ నగరం నుంచి బయటికి వెళ్లడానికి అవకాశం ఉండదు.