Sports

జమ్మూ కాశ్మీర్ నుండి ఇర్ఫాన్ పఠాన్ తరలింపు

Irfan Pathan Asked to Move Out Of Jammu & Kashmir

జమ్ముకశ్మీర్‌ నుంచి టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో సహా వందమంది యువ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తరలివెళ్లాలని చెప్పిన్నట్లు ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం సీఈవో సయ్యద్‌ ఆశిక్‌ హుస్సేన్‌ బుఖారీ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల మధ్య క్రికెటర్లందరినీ వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్‌పఠాన్‌ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ జట్టుతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు ఆటగాడిగా, మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడితోపాటు శిక్షకుడు సుదర్శన్‌ ఆదివారం కశ్మీర్‌ లోయను వీడిపోతున్నారని బుఖారీ చెప్పుకొచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో జరగాల్సిన అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామని, పరిస్థితులు సద్దుమణిగాక మళ్లీ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తామని బుఖారీ పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో శిక్షణ పొందుతున్న వంద మందికి పైగా యువ క్రికెటర్లను వారి గమ్యస్థానాలకు తరలించామని, ప్రస్తుతం అక్కడ ఏం జరగుతుందో అర్థంకావడం లేదని బుఖారీ పేర్కొన్నాడని రాసింది. ఇదిలా ఉండగా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాకపోవడంతో పాటు బీసీసీఐ కూడా స్పందించకపోవడం గమనార్హం.