Health

6000 సంవత్సరాల నుండి క్యాన్సర్ ఉంది

Cancer Has Been Around Since 6000 Years From Sledge Cart Dogs - 6000 సంవత్సరాల నుండి క్యాన్సర్ ఉంది

క్యాన్సర్ కణాల వయస్సు ఎంతో తెలుసా ? ఒకటి కాదు రెండు కాదు ఆరువేల సంవత్సరాలు. అప్పటి నుంచి యుగాలను జగాలను దాటుకుంటూ వ్యాపిస్తోంది. ఎన్నో ప్రాణాలను బలిగొంటోంది. దీని పుట్టుపూర్వోత్తరాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి. మంచు కొండల్లో కుక్కలు బళ్లను లాగుతుంటాయి. ఆ బళ్లను స్లెడ్జి బళ్లు అని పిలుస్తారు. అటువంటి స్లెడ్జి బళ్లను లాగే కుక్కల వంటి కుక్కలే వీటికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. భరించరాని మంచుతో నిండిన సైబీరియా స్టెప్పె ఈ కుక్కలకు జన్మభూమి. అక్కడే క్యాన్సర్ కణాలు పుట్టాయి. అప్పటి నుంచి ఎన్నో యుగాల సాక్షిగా ఆరువేల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నాయి.ఈ క్యాన్సర్ కణాలు ఒక దాని వెంట ఒకటి వంతున మొదట ఈ కుక్కలకు సంక్రమించి వాటిపై దాదాపు 5500 సంవత్సరాల పాటు మనుగడ సాగించాయి. ఆ తరువాత మార్పులు చెంది 550 సంవత్సరాలుగా ప్రపంచంలో వ్యాప్తి చెందుతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రపంచం మొత్తం మీద గత 15 ఏళ్లుగా శాస్త్రవేత్తలు క్యాన్సర్ ట్యూమర్ల నమూనాలను సేకరించి పరిశోధించిన మీదట ఈ వివరాలు వెలుగు లోకి వచ్చాయి. సీలు చేసిన ఈ నమూనాలను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన ఎలిజెబెత్ మర్కిసన్ లేబొరేటరీకి పంపించి పరీక్షించారు. కెనైన్ ట్రాన్స్‌మిసిబుల్ వెనెరియల్ ట్యూమర్ (సిటివిటి) మలవి నుంచి మెల్‌బోర్న్ వరకు, మెల్‌బోర్న్ నుంచి మినియపొలిస్ వరకు గల కుక్కల్లో కనిపించిందని మేగజైన్ వివరించింది.ఈ సిటివిటి కుక్కల మధ్య సెక్సు సంబంధాల ద్వారా వ్యాపించిందని తెలుసుకున్నారు. ఒక సిటివిటి నమూనా సరాసరిన 38000 మార్పులు చెందింది. దీనికి విరుద్ధంగా మానవ క్యాన్సర్ లో మాత్రం విచిత్రంగా కేవలం వంద మార్పు లే కనిపించాయి. సిటివిటిలో అయిదు మార్పులు చెందిన జన్యువులు ఉంటాయి. అవే క్యాన్సర్ కణాలకు శక్తిని సామర్ధాన్ని పెంపొందిస్తాయి. ఈ మార్పులు సర్వకాలం క్యాన్సర్ మనుగడ సాగించేలా చేస్తున్నాయి. ఖండఖండాంతరాలుగా సాగుతున్న ఈ క్యాన్సర్ పరిణామం మనుషుల్లోని క్యాన్సర్ చికిత్సకు కావలసిన ఆధారాలు అందిస్తుందని, పరిణామాత్మకంగా క్యాన్సర్ బలహీనమైందని, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కిమోథెరపీ సింగిల్ డోస్ సిటివిటిని నయం చేయగలదని అన్నారు.