Agriculture

తక్కువ కాలంలో దిగుబడినిచ్చే వంగడాలు నాటండి

Use rice strains that yield in less span of time

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వానకాలం పంటలపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎండిపోతాయనుకున్న పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. రైతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. అయితే, రాష్ట్రంలో వానకాలం సాధారణ సాగు 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయింది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, సకాలంలో వానలు కురవకపోవడంతో వరి పంటకాలం అదునుదాటింది. ఇప్పటికే పోసిన సంప్రదాయ వరి వంగడాల నార్లు ముదిరిపోయాయి. ఇప్పుడు వానలు పడుతుండటం, రిజర్వాయర్లలోకి పెద్దఎత్తున వరద చేరుతుండటంతో వానకాలం సీజన్‌పై భరోసా పెరిగిన రైతులు మళ్లీ నార్లు పోయడానికి సిద్ధమవుతున్నారు. 150, 145, 140 రోజుల సాగు ఉండే దీర్ఘకాలిక వరి వంగడాలకు బదులుగా తక్కువకాలంలో 105 రోజుల నుంచి 125 రోజుల మధ్య దిగుబడి వచ్చే వరి రకాలను వేసుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. దీర్ఘకాలిక రకాల వరికి జూన్‌లోనే నార్లు పోసి జూలై చివరి నాటికి నాట్లు వేయాల్సి ఉంటుంది. నారుపోశాక 30 రోజులు దాటకుండా నాట్లు వేయాలి. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక వరిని వేయాలని వ్యవసాయాధికారులు తెలిపారు. ఆగస్టు ఒకటి నుంచి నారుపోసినా ఆగస్టు చివరి వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉంటుందని, స్వల్పకాలిక రకాల్లో చదరపు మీటర్‌కు 66 కుదుళ్లు ఉండేలా నాటుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పండిస్తున్న దొడ్డురకం వరి యంటీయూ 1010కు బదులుగా బతుకమ్మ రకాన్ని వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితులకు ఎర్రమల్లెలు, తెల్లహంస, కృష్ణహంస (115-120 రోజులు), కూనారం సన్నరకాలు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు సన్నాలు, ఎర్రమల్లెలు, తెల్లహంస, సత్య (120 రోజులు) ఇందూర్ సాంబ రకాలు అనువుగా ఉంటాయని పేర్కొన్నారు.