Business

షేర్లు కొంటున్నారా? ఇవిగో కొన్ని సూచనలు.

Read these tips before investing in stocks

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా.. రూ.5,000తో స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించి కొన్నివేలకోట్ల పెట్టుబడుల సామ్రాజ్యాన్ని నిర్మించారు. చాలా మందికి ఆయనొక రోల్‌ మోడల్‌..! ఈ క్రమంలో చాలా మంది ఇంట్లో కూడబెట్టుకొన్న సొమ్మును స్టాక్‌ మార్కెట్లో పెట్టి చేతులు కాల్చుకొన్నారు. వారికి శ్రద్ధలేక ఈ సొమ్మును కోల్పోరు.. కేవలం అంచనా వేయలేకే ఈ సొమ్మును కోల్పోతుంటారు..! అందుకే కొన్ని కీలక అంశాలు గమనిస్తే మనం పెట్టుబడి పెట్టే కంపెనీ ఆర్థికంగా బలంగా ఉందా.. లేక సంక్షోభం వాకిట్లో ఉందో అర్థం చేసుకోవచ్చు..ఇటీవల బ్యాంకింగ్‌ నిబంధనలు కఠినంగా మారడంతో చాలా కంపెనీలు ఎన్‌సీఎల్‌టీకి చేరుతున్నాయి. ఫలితంగా కంపెనీల షేర్లు భారీగా పతనం అయి మదుపరులు నష్టపోతున్నారు. ఎన్‌సీఎల్‌టీకి చేరే కంపెనీలను ముందుగానే పసిగట్టే అవకాశం ఉంది. నష్టాల్లో ఉన్న సంస్థలను అంచనా వేసేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఇన్‌ ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ కొన్ని అంశాలను తెలిపింది.

నగదు..
ఒక సంస్థ తరచూ నగదు కొరతతో ఇబ్బంది పడుతుంటే కచ్చింతంగా దానిలో ఏదో సమస్య ఉన్నట్లే లెక్క. సాధారణంగా అన్ని వ్యాపారాలు ఏదోఒక దశలో నగదు కొరతతో ఇబ్బంది పడుతుంటాయి. కానీ, చిక్కుల్లో ఉన్న సంస్థ మాత్రం నిరంతరాయంగా నగదు సమస్యను ఎదుర్కొంటుంది. ఆ సంస్థలు సంపాదించేదాని కంటే ఖర్చుపెట్టేది ఎక్కువగా ఉండటం కానీ, లేద ఉద్దేశపూరితంగా చేస్తున్న ఖర్చు వంటివి సమస్యలను సృష్టిస్తాయి.

అత్యధిక వడ్డీ చెల్లింపులు..
అత్యధిక వడ్డీ చెల్లించే సంస్థలు దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ సంస్థకు ఎక్కడా సాధారణ రేటుకు అప్పు దొరక్కపోతే అత్యధిక వడ్డీరేటుకు తెచ్చుకొన్నట్లు భావించాయి. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నట్లే లెక్క. రుణదాతకు కూడా ఆ సంస్థ ఆర్థిక పరిస్థితిపై నమ్మకంలేకనే ఎక్కువ వడ్డీకి ఇచ్చినట్లు భావించాలి. దీంతోపాటు రుణదాత బలమైన వ్యక్తిగత హామీలను కోరడం, లేదా అత్యధిక గ్యారెంటీలను కోరడం కూడా ఆ సంస్థ కష్టాలకు చిహ్నంగానే భావించాలి.

బిల్లులు చెల్లించలేకపోవం..
సంస్థలు చెల్లింపుల చేయకపోవడం ఎప్పుడో ఒక సారి జరిగితే భయపడాల్సింది ఏమీ ఉండదు. కానీ, కంపెనీ బిల్లుల చెల్లింపులు చేయలేకపోతే ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్లే. కంపెనీలో నగదు సమస్య ఉన్నా.. రుణాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఇలా జరుగుతుంటుంది. కనీసం పన్నులు కూడా చెల్లించలేకపోతే ఇక ఆ కంపెనీని కష్టాల నుంచి ఎవరూ కాపాడలేరు. ఇది కంపెనీ పరపతిని దారుణంగా దెబ్బతీస్తుంది.

అప్పుల గడువు పెంచుకుంటూ పోవడం..
రుణదాతలు లేదా రుణ గ్రహీతలు గడువుతేదీలను పొడిగించుకుంటూ పోవడం కూడా ఆర్థిక సమస్యలకే దారితీస్తుంది. ఒక వేళ రుణ చెల్లింపుల్లో జాప్యం జరిగితే ముడిసరఫరాదారులు సప్లైని ఆపివేసే ప్రమాదం ఉంది. ఒక వేళ ఆ సంస్థకు రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలు కాకపోయినా తీవ్రమైన నగదు సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఒక వేళ ఈ రెండిట్లో ఏవైనా భారీ మార్పులు హఠాత్తుగా చోటు చేసుకొంటే వాటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అవి మరింత తీవ్రమైన అంశాలు మరేమైనా ఉండొచ్చు.

లాభాలు పడిపోవడం..
వ్యాపారానికి లాభాలే మూలం. అంతే కానీ, అమ్మకాలు భారీగా ఉన్నాయని ఏదో ఊహించుకోకూడదు. భారీ టర్నోవర్‌ ఉన్నా అతి స్వల్ప లాభాలు ఉంటే ఆ కంపెనీకి సంక్షోభం తప్పదు. లాభాలు పడిపోవడం అనేది ఉత్పత్తి వ్యయం పెరిగి.. విక్రయ ధర తగ్గిందనడానికి చిహ్నాం. ఇది వ్యాపారానికి ఏమాత్రం మంచిది కాదు.

అసంతృప్తి..
ఒక వ్యాపారంలో తీవ్రంగా ఉన్న అసంతృప్తికూడా సంక్షోభానికి చిహ్నమే. యజమానులు లేదా ప్రమోటర్లు, మేనేజర్లలో ఎవరో ఒకరు వ్యాపారంలోని లోపాలను గుర్తిస్తారు.. వాటిని నేరుగా చెప్పకుండా హఠాత్తుగా వ్యూహాలను మార్చేస్తారు. దీంతోపాటు భారీగా పొదుపు చర్యలు మొదలుపెడతారు. పరిస్థితులను అదుపులోపెట్టడానికి వారు చేసే ప్రయత్నాలు ఎల్లవేళలా సఫలం అవుతాయనే హామీ ఉండదు.

సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ వెళ్లిపోవడం..
ఏదైనా కంపెనీల నుంచి సీనియర్లు వెళ్లిపోవడం అనేది సాధారణంగా జరిగేదే. కానీ, అతి స్వల్పకాలంలో భారీ సంఖ్యలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ వెళ్లిపోవడం అనేది చెడుసంకేతం. కంపెనీలో ఏదైనా అవకతవకలు, ఇతర సంక్షోభాలు ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటుంది.