ScienceAndTech

కంప్యూటర్లకు సంస్కృతం వస్తేనే అది సాధ్యం

Speaking Computers Are A Possibility Only With Sanskrit Says Indian Minister

భవిష్యత్తుల్లో మాట్లాడే కంప్యూటర్ల సృష్టి జరిగితే.. అది కేవలం సంస్కృత భాష వల్లే సాధ్యమవుతుందని కేంద్ర మానవ వనరుల శాఖమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాయే తెలిపిందన్నారు. ‘‘నాసా తెలిపిన ప్రకారం సమీప భవిష్యత్తులో ఒకవేళ మాట్లాడే కంప్యూటర్ల సృష్టిస్తే అది కేవలం సంస్కృత భాష వల్లే జరుగుతుంది. ఎందుకంటే సంస్కృతం ఒక శాస్త్రీయ భాష. సంస్కృతంలో పదాలను ఎలా పలుకుతామో రాయడం కూడా అలాగే రాస్తాం’’ అని శనివారం ఐఐటీ-బాంబేలో జరిగిన వార్షికోత్సవంలో అన్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అణువులు, పరమాణువుల గురించి చెప్పింది కూడా భారత్‌కు చెందిన చరక రుషి అని పోఖ్రియాల్‌ అన్నారు. ఆయుర్వేద శాస్త్రంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఐఐటీలే భారత విద్యావిధానానికి తార్కాణాలుగా నిలుస్తున్నాయన్నారు. విద్యారంగంలో రానున్న ఐదేళ్లలో భారతదేశం ప్రపంచంలోనే ముందంజలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశ సంస్కృతి, విద్యా వ్యవస్థను మిళితం చేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో తయారీ, డిజిటల్ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా పథకాల వల్లే భారత్‌ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు.