Politics

ఏపీ అసెంబ్లీ సీట్లపై అమిత్‌షా వ్యూహం

Amith Shahs Plan On Andhra Assembly Seats

ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ స్థానాల పెంపు పైన కేంద్రంలో మరోసారి కదలిక వచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ..తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. దీని పైన గతంలో నే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో పలు మార్లు చర్చలు చేసారు. అయినా కేంద్రం స్పందించలేదు. ఇక, 2019 ఎన్నికల సమయంలో పెంచుతారని అందరూ భావించారు. జరగలేదు. కానీ, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ లో డీలిమిటేషన్ మీద చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. పార్టీ పరంగా బీజేపీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపునకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఏపీ లో రాజకీయ సమీకరణాల్లో మార్పు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ దీనిని రాజకీయంగా సద్వినియోగం చేసుకొనేందుకు ఇప్పటికే వ్యూహాలు సిద్దం చేసింది.
*అసెంబ్లీ సీట్ల పెంపు పై కదలిక…
ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో ఆ రాష్ట్రంలో 7 సీట్లను పెంచటం పైన కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. అదే సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పైనా చర్చకు వచ్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిక్కింలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి పరిశీలన జరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌ విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ నిబంధనల గురించి ఎన్నికల కమిషన్‌ సభ్యులకు తెలియజేశాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య అసెంబ్లీ సీట్లను పంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చ మొదలైంది. అయితే, గతంలోనే ఇటువంటి చర్చలు జరిగినా..ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగంలోని 170వ అధికరణ సవరించాలని గతంలో ప్రభుత్వానికి అటార్నీ జనరల్‌ సూచించారు. దీంతో..అది ఆచరణకు రాలేదు.
*అమిత్ షా వ్యూహం ఇదేనా..
తెలుగు రాష్ట్రాల సీట్ల పెంపు అంశం పార్టీ పరంగా బీజేపీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపునకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. త్వరలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలతో ఇదే విషయమై సమావేశం ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో..సంబంధిత బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే వెంటనే డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మరో 50 పెరిగి 225 కు చేరుతుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య కు మరో 34 పెరిగి 153 కు చేరుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ..తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజీపీ ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తోంది. ఇదే సమయంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచటం ద్వారా కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి ఎన్నికల్లో పోటీకి ఉన్న అవకాశాల గురించి మరింత ఆసక్తి పెరగనుంది. నియోజకవర్గాల సంఖ్య పెరగటం ద్వారా ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య సైతం ప్రధాన పార్టీల్లో పెరిగే అవకాశం ఉంటుంది.ఇప్పటికే టీడీపీ ని నైతికంగా దెబ్బ తీయటం ప్రారంభించిన బీజేపీ..కొత్తగా మరిన్ని చేరికల ద్వారా వచ్చే నేతలకు ముందుగానే నియోజకవర్గాలను కేటాయిస్తామని చెబుతోంది. దీని ద్వారా నేతలు అక్కడ ప్రజలతో మమేకం అయ్యేలా చూడటమే అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది.
*ఏపీలో మారనున్న సమీకరణాలు.
ఇక, ఏపీలో తాము అధికారంలోకి వస్తే ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని కొత్త జిల్లాలుగా మారుస్తామని..ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25కు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే, కేంద్రం నుండి వస్తున్న సంకేతాల కారణంగా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం దీని పైన నిర్ణయం తీసుకోలేదు. ఇక, ఇప్పుడు అసెంబ్లీ సీట్ల పెంపు అంశం పైన చర్చ మొదలైన సమయంలో.. టీడీపీ..వైసీపీల్లో ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు కీలకంగా మారనుంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే ఏ జిల్లాలో ఎక్కడ కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతాయనే దాని పైన అంచనాలు ఉన్నాయి. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సీట్లు మారటంతో పాటుగా కొత్త వారికి అవకాశాలు దక్కనున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేక..వారికి మరో రకంగా ప్రాధాన్యత ఇస్తామంటూ వైసీపీలోని పలువురికి జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇటువంటి వారికి అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశం ఏర్పడుతుంది. ఇక, డీ లిమిటేషన్ లో రిజర్వ్ స్థానాల ఖరారు కీలకం కానుంది. పార్టీలు ఇచ్చే అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుంది.