ScienceAndTech

చంద్రయాన్ మరో మైలు రాయి దాటింది

Chandrayaan Leaves Earth's Orbit Headed To The Moon

ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 మిషన్‌లో ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. చంద్రయాన్‌-2 భూకక్ష్య వీడి జాబిల్లి కక్ష్య దిశగా విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ మేరకు కక్ష్యను పెంచే ప్రయోగాన్ని బుధవారం వేకువజామున 2.21గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్‌ను 1203 సెకన్ల పాటు మండించి కక్ష్యను పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇది జాబిల్లి కక్ష్యకు చేరే ట్రాన్స్‌ ల్యూనార్‌ మార్గంలో పయనిస్తోంది. చంద్రయాన్‌-2 ప్రయోగం తర్వాత ఇప్పటి వరకు ఐదు సార్లు కక్ష్యను పెంచే ప్రక్రియను చేపట్టామని అవన్నీ విజయవంతమయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు చంద్రయాన్‌-2 ఎలాంటి అవరోధం లేకుండా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోందని ఇస్రో ప్రకటించింది. వ్యోమనౌక పనితీరు సైతం మెరుగ్గా ఉందన్నారు. బెంగళూరు ఇస్రో మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ నెల 20న చంద్రయాన్‌-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. దాని కోసం మరోసారి ద్రవ ఇంజిన్‌ను మండించాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాబిల్లిపైకి దిగడానికి ముందు మరో నాలుగు కీలక ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే.