Sports

ఒలంపిక్స్-కామన్‌వెల్త్ క్రీడల్లో క్రికెట్

Cricket Into Olympics 2028

ప్రపంచ మెగా క్రీడా సంబరం ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు లభిస్తుందా అంటే అవుననే సమాధానమే లభిస్తుంది. ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టే 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రయత్నాలు చేస్తోందని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ ప్రపంచ క్రికెట్ కమిటీ ఛైర్మన్ మైక్ గాటింగ్ పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా సమాఖ్యలను పర్యవేక్షించే వాడా (వరల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ) పరిధిలోకి ఇటీవలే బీసీసీఐ చేరింది. దీంతో ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడానికి ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయిందని ఆయన తెలిపాడు. ఓ క్రీడా ఛానెల్ పేర్కొన్న వివరాల ప్రకారం.. 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకు తగిన కార్యాచరణ ప్రారంభించామని ఐసీసీ కొత్త ముఖ్య కార్యదర్శి మనుసావ్నే ఎంసీసీ కమిటీతో అన్నాడని గాటింగ్ వివరించాడు.అయితే ఈ ఆటలు నెలరోజుల పాటు కాకుండా రెండు వారాల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాడు. అన్ని పురుష జట్లతో పాటు మహిళల జట్లూ ఇందులో పాల్గొంటాయని వివరించాడు. కాగా, క్రికెట్ను ఒలింపిక్స్లో జతచేయాలనే అంశం ఇప్పటికే పలుసార్లు చర్చకు కూడా వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ సైతం ఈ విషయానికి మద్దతు తెలిపాడు. ఇటీవలే మహిళల క్రికెట్ను 2022 కామన్వెల్త్ గేమ్స్లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ క్రీడల్లో మళ్లీ క్రికెట్కు చోటు దక్కింది. 2022లో ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్కు స్థానం కల్పించారు. ఈ విషయాన్ని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య మంగళవారం అధికారికంగా ప్రకటించింది. మహిళల విభాగంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తారు. ట్వంటీ20 ఫార్మాట్లో ఈ పోటీలు ఉంటాయి. భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర జట్లు ఈ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. కాగా, కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్కు చోటు కల్పించాలని కోరుతూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది. గతంలో కూడా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. 1998లో మలేసియా వేదికగా జరిగిన క్రీడల్లో పురుషుల విభాగంలో క్రికెట్కు అవకాశం కల్పించారు. ఆ తర్వాత క్రికెట్ను క్రీడల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఐసిసి క్రమం తప్పకుండా తన ప్రయత్నాలను కొనసాగించింది. చివరికి ఇది ఫలించింది. బర్మింగ్హామ్ క్రీడల్లో క్రికెట్కు చోటు దక్కింది. కాగా, క్రికెట్కు చోటు దక్కడంపై పలు దేశాలు క్రికెట్ బోర్డులు ఆనందం వ్యక్తం చేశాయి. ఇదో చారిత్రక నిర్ణయమని ఐసిసి ఓ ప్రకటనలో పేర్కొంది.