DailyDose

మంత్రులతో జగన్ కీలక భేటి-రాజకీయ–08/14

Jagan Meets Ministers-Telugu Political News Today-Aug142019

* మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ. అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దు త్తిళ్లను ఖాతరు చేయొద్దు నామీద కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయివాటికి లొంగే ప్రసక్తే లేదు టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకు వచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏదిచూసినా వందలు, వేలకోట్ల రూపాయల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయిప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతిచేసినవారిని వదిలేయాలా?ఇళ్ల నిర్మాణం తీసుకున్నా అదే పరిస్థితిఅవినీతి లేకుంటే అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి కాదా?రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోండిదీనివల్ల మిగిలే ప్రతిపైసా ప్రజలకే చెందుతుందని గుర్తుంచుకోండిదేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించండిఈ సమావేశానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడి , ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, ఇతర ఉన్నతాధికారులు, అధికారులు హాజరయ్యారు.
* చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : బొత్స
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చారిత్రత్మక నిర్ణయాలు చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని ఆరోపించారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగాయని చెప్పారు. అందుకే ప్రజలు చంద్రబాబు పాలనకు చరమగీతం పాడారని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానిది పారదర్శక పాలన అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
* పైశాచిక ఆనందం పొందుతున్నారు: దేవినేని ఉమా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలోకి వరద నీరు వచ్చిందని వైసీపీ నేతలు సంబరపడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. కానీ అక్కడ చాలా మంది పేదలు ఉన్నారని మరిచి… పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి మెట్లను వరద నీరు ఎక్కించేందుకు…ప్రకాశం బ్యారేజీ నీటి నిర్వహణను పక్కన పెడుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు.
*370 అధికరణ రద్దు దేశ భద్రత కోసమే: వెంకయ్య
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను రద్దు చేయడాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సమర్ధించారు. దేశ ఐక్యత, సమగ్రత కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని, 370వ అధికరణను రద్దు చేసింది కూడా అందుకేనని అన్నారు. ఈ చర్యను ‘మతతత్వ’ కోణంలో చూడరాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశంగానే చూడాలని పేర్కొన్నారు.’370 అధికణ తాత్కాలిక వెసులుబాటే. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఏ ఒక్కరి జోక్యాన్ని మనం అనుమతించేది లేదు’ అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఛండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీలో జరిగిన బలరామ్జీ దాస్ టాండన్ తొలి స్మారకోపన్యాసంలో వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. 370 అధికరణ రద్దుతో యావత్ దేశం ఆనందంగా ఉందన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు సంబంధించిన అంశం ఇదని, అయితే కొందరు పాశ్చాత్య దేశాలకు చెందిన మీడియా వాళ్లు మాత్రమే 370 అధికరణపై తప్పుదారి పట్టించే ప్రచారం సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
* ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దు: సీఎం జగన్‌
అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయితే వాటికి లొంగే ప్రసక్తే లేదని తెలిపారు. టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకువచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏది చూసినా వందలు, వేలకోట్ల రూపాయాల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసినవారిని వదిలేయాలా? అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం విషయాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి ఉందని, అవినీతి లేకుండా అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి కదా? అని అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, దీనివల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందని అన్నారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని, ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దని సూచించారు.
*కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కొత్త సచివాలయ నిర్మాణం: కోమటిరెడ్డి
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిని కలిసారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని కేంద్రవర్గాలు చెబుతున్నాయని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడుకును సీఎం చేసేందుకే కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. పాత సచివాలయం కూల్చివేతను విరమించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. లక్ష కోట్లు అప్పు చేశారని ఆయన విమర్శించారు.
* రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి:భట్టి
తెలంగాణలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జ్వరాల బారినపడుతున్నారని.. రాష్ట్రం రోగాల తెలంగాణగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంలేదని ఆరోపించారు. ఈ నెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను సందర్శిస్తామని ఈ సందర్భంగా భట్టి వెల్లడించారు. తాము ఆరోగ్య సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం తమపై విమర్శలు చేస్తోందని ఆక్షేపించారు. నీలోఫర్ ఆసుపత్రి సందర్శించి వైద్య సౌకర్యాలు సరిగ్గాలేవని గతంలో ప్రభుత్వానికి చెప్పామని.. అయినా పట్టించుకోలేదని ఆరోపించారు.
* ఇప్పటికైనా ఈ మేధావులకి తలకెక్కుతుందో లేదో : చంద్రబాబు
పోలవరం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా తప్పుపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చాం కదా అని ఏదో కాస్త హడావుడి చేస్తే తప్పులేదు కానీ ఇళ్లు పీకి పందిరేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. మనకు తెలియనప్పుడు ఎవరైనా చెబితే వినాలని కానీ వైసీపీ ప్రభుత్వం కనీసం అది కూడా చేయడం లేదన్నారు చంద్రబాబు. చివరికి పోలవరం అథారిటీ కూడా రివర్స్‌ టెండరింగ్‌ను తప్పుపట్టిందన్నారు . ఇప్పటికైనా ఈ మేధావులకి తలకెక్కుతుందో లేదో అంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు.
* ఏపీ ప్రభుత్వానికి ‘రివర్స్’ పంచ్
ఏపీ ప్రజల జీవనాడి పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ల పై షాక్‌లు తగులుతున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి తీరుతామని సీఎం జగన్‌ పదే పదే చెబుతున్నారు. ఇటు టీడీపీ నేతలు, అటు కేంద్రం సైతం రివర్స్‌ టెండరింగ్‌ను వ్యతిరేకిస్తున్నా జగన్‌ మాత్రం ముందుకెళ్లాలనే సంకల్పంలో ఉన్నారు.గత చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్న నాటి సీఎం.. ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టాలెక్కించారు. వైసీపీ అధికారంలోకి రాగానే.. సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ వైపు మొగ్గుచూపారు. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నది సీఎం అభిప్రాయం. ఇప్పటికే కాంట్రాక్టు సంస్థ నవయుగకు ప్రీక్లోజర్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్‌ను పోలవరం అథారిటీ వ్యతిరేకించడంతో ప్రభుత్వానికి షాక్‌ తగిలినట్టైంది.
* వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. వెలగపూడిలోని అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వీరు నామినేషన్ వేయడం జరిగింది
* చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు
తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భద్రత వ్యవహారంలో హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ ఎవరి పని అనే అంశంపై ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. అలాగే, చంద్రబాబు కాన్వాయ్‌లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు సీఎస్‌వోను ప్రభుత్వం నియమించవచ్చని హైకోర్టు తెలిపింది. తన భద్రత కుదించడాన్ని సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టులో ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు తీర్పును రిజర్వు చేశారు. తాజాగా బుధవారం ఆ కేసుపై తుది తీర్పును వెల్లడించారు.
*దమ్ముంటే మజ్లిస్తో తలపడండి
భాజపా నేతలు పొద్దస్తమానం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబపైనా, తెరాసపైనా విమర్శలు చేస్తున్నారని, వారికి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి తెలంగాణకు ఏదైనా గట్టి సాయం చేయించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. ఏదైనా సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని, కేంద్రం నుంచి నిధులు తెప్పించాలన్నారు. భాజపా నేతలు వారి బలం గురించి అతిగా ఊహించుకుంటున్నారని, మజ్లిస్ను బూచిగా చూపి ప్రజలకు రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ యూటీ, రెండో రాజధాని అనే వదంతులను తాము పట్టించుకోబోమని అన్నారు. భాజపా తమకు పోటీయే కాదని, ముందు పాతబస్తీలో మజ్లిస్తో తలపడి వారి బలాన్ని నిరూపించుకోవాలన్నారు.
*కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చుచేసినా తెలంగాణకు నీళ్లు ఇవ్వని సీఎం కేసీఆర్ ఏపీలోని రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ‘‘ఏ రోటికాడ ఆ పాట పాడటంలో కేసీఆర్ సిద్ధహస్తులు. తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి శాసనసభ ఎన్నికల్లో పబ్బం గడిపేసుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర సెటిలర్లలో తెరాసపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుని లబ్ధి పొందేందుకే తాజాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు.
*తెలంగాణపై భాజపా వివక్ష
తెలంగాణపై భాజపా అడుగడుక్కీ వివక్ష ప్రదర్శిస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పైసా సాయం అందించలేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వంటి నేతలకు తెలంగాణపై మాట్లాడే హక్కే లేదని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘భాజపా తెలంగాణ వ్యతిరేక ధోరణితో ఉంది. ఉద్యమ సమయంలోనూ ఆ పార్టీ గోడ మీది పిల్లిలా వ్యవహరించింది. 2014లో తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించే సందర్భంలో ఆటంకాలు కల్పించింది.
*టికెట్ల కేటాయింపులో కొప్పుల ప్రమేయం లేదు: కుంతియా
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజుకు ఎలాంటి ప్రమేయం లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. టీపీసీసీ, సీఎల్పీ, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆలోచన మేరకే టికెట్లు కేటాయించారన్నారు. కొంత మంది రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు.. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, రాహుల్గాంధీ అపాయింట్మెంట్ లభించకుండా కొప్పుల రాజు అడ్డుకుంటున్నారని మీడియా ద్వారా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సీనియర్ నాయకులు పార్టీలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని, మీడియాకు ఎక్కొద్దని కుంతియా సూచించారు.
*హైదరాబాద్పై ఇంకా చిన్నచూపేనా?
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ రెండో రాజధాని కావాలని, ఇక్కడే సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటుచేయాలని వక్తలు డిమాండ్ చేశారు. దక్షిణ భారత రాజకీయ; న్యాయవాదుల ఐకాసల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య కళానిలయంలో ‘దగాపడిన దక్షిణ భారత్’పై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు.అధ్యక్షత వహించిన రాజకీయ ఐకాస ఛైర్మన్ గాలి వినోద్కుమార్ మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సహా తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి వంటి దక్షిణాది ప్రాంతాలు అన్ని రంగాల్లోనూ వెనుకబాటు బారిన పడ్డాయన్నారు. ఇకనైనా దక్షిణాది అభివృద్ధి మండలిని పునరుద్ధరించాలని, భాషా సాంస్కృతిక మండలిని ఏర్పాటుచేయాలని కోరారు. ప్రత్యేక హోదా వంటి హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు.
*ఇప్పటికైనా తలకెక్కుతుందా?
‘అధికారంలోకి వచ్చాం కదా.. ఏదో కాస్త హడావుడి చేద్దామనుకుంటే తప్పు లేదు. ఇల్లు పీకి పందిరేద్దామనే ఆలోచన చేయకూడదు కదా! మనకు తెలియనప్పుడు ఎవరైనా చెబితే వినాలి. కానీ వినరుగా. చివరకు ఈ రోజు పోలవరం అథారిటీ కూడా చెప్పింది. ఇప్పటికైనా తలకెక్కుతుందో లేదో ఈ మేధావులకు’ అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మంగళవారం ట్వీట్ చేశారు. పోలవరానికి సంబంధించి ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళ్లడంపై పోలవరం అథారిటీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. అథారిటీ ఇచ్చిన పత్రికా ప్రకటనను దీనికి జత చేశారు.
*నదుల అనుసంధానంపై కేసీఆర్ది యూటర్న్: దత్తాత్రేయ
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో ఊరించడం, హైటెక్ ప్రచారం చేసుకోవడం తప్ప.. రూ.వేల కోట్లు ఖర్చు చేసినా ఇప్పటివరకు ఎకరా పొలంలోనూ ఆ నీళ్లు పారించలేదని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి వరకు 115 కిలోమీటర్ల మేర గోదావరి జలాలున్నాయని చెబుతున్నా రైతుల పొలాలకు నీళ్లు అందకపోవడం సీఎం వైఫల్యమని వ్యాఖ్యానించారు. మంగళవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే నదుల అనుసంధానంపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని ఆక్షేపించారు.
*పశ్చిమబెంగాల్లో కొత్త పొత్తులు!
భాజపా దూకుడును పశ్చిమబెంగాల్లో కట్టడి చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉభయ పార్టీల నాయకుల మధ్య గత కొద్దిరోజులుగా అనధికారికంగా సమావేశాలు, చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో టీఎంసీ చీఫ్విప్ కల్యాణ్ బెనర్జీతో దాదాపు అరగంట సేపు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై కళ్యాణ్ బెనర్జీ వివరణ ఇస్తూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు టీఎంసీ పట్ల వ్యతిరేకతను కనబరుస్తున్న విషయాన్ని రాహుల్ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు.
*కేసులు సబబు కాదు: పవన్కల్యాణ్
ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తుణ్ని పోలీసుస్టేషన్కి తీసుకొచ్చిన విషయమై ప్రజాప్రతినిధిగా స్టేషన్కి వెళ్లిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను అవమానించి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం సబబు కాదని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. అదే అధికార పార్టీకి చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి జమీన్ రైతుపత్రిక ఎడిటర్ డోలేంద్రప్రసాద్పై దాడి చేసి గాయపరిస్తే కనీసం అతన్ని పోలీసుస్టేషన్కు పిలవలేదని, ఇదేంనీతి అని ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం పవన్ తొలుత ఓ వీడియో సందేశంలో స్పందించారు.
*పేదలుండేచోట అన్న క్యాంటీన్లు: బొత్స
అన్న క్యాంటీన్లను ఈ నెల చివరి నాటికిగానీ, సెప్టెంబర్ మొదటి వారంలోగానీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్లు పేదల కోసం కాకుండా ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంటే అక్కడ పెట్టారన్నారు. ఒక్కొక్క క్యాంటీన్ నిర్మాణానికి రూ.50 లక్షలు చొప్పున దోచుకున్నారని విమర్శించారు. క్యాంటీన్లను ఆసుపత్రులు, పేదప్రజలు ఎక్కువగా ఉండేచోట ప్రారంభిస్తామన్నారు. చంద్రబాబు నదుల అనుసంధానం చేయలేదని.. నిధుల అనుసంధానం చేశారన్నారు. ఇసుక విధానంలో మార్పులు చేసి త్వరతిగతిన సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.