Devotional

రక్షాబంధన్ ప్రత్యేకం

RakshaBandhan Special Devotional Story

దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే- శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత విశిష్టమైన రోజు. ఈ పండుగను హిందువులతో పాటు సిక్కులు, జైనులు జరుపుకుంటారు. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమిగా పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి ‘రాఖీ’ కట్టి పదికాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై ఆమె సోదరులకు ఆత్మీయత బలపడి ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధపరచడమే ఈ పండుగ ఆంతర్యం.
**పురాణాల్లో..
పురాణగాథ ప్రకారం.. రాక్షస రాజైన బలి చక్రవర్తి విష్ణుమూర్తిని శాశ్వతంగా తన పాతాళ భవనంలో ఉండి పొమ్మని ప్రార్థించగా, అందుకు అంగీకరించిన విష్ణువు అక్కడే ఉండిపోతాడు. ఇది నచ్చని లక్ష్మీదేవి బలిచక్రవర్తి చేతికి రక్షాబంధం కడుతుంది. దీంతో బలి చక్రవర్తి ఆమెను తన సోదరిగా భావించి ఆమె కోరిక ప్రకారం విష్ణువు వైకుంఠానికి వెళ్లేందుకు అంగీకరిస్తాడు. అలాగే.. కృష్ణుని చేతికి ద్రౌపది, యముని చేతికి యమున రక్షాబంధనాలు కట్టినట్లు పురాణాలు చెబుతాయి.
***చరిత్రలో..
చరిత్రను పరిశీలిస్తే నాటి రాజపుత్ర స్ర్తిలు పొరుగు రాజులకు ఈ రక్షా బంధనాలు పంపేవారని తెలుస్తుంది. యుద్ధ సమయంలో అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తమునికి రక్షాబంధనం కట్టిందని, ఆ కారణంగా పురుషోత్తముడు ఆమెను సోదరిగా మన్నించి అవకాశం వచ్చినప్పటికీ అలెగ్జాండర్‌ను చంపకుండా విడచిపెట్టాడని చెబుతారు. అలాగే.. రాణి కర్ణావరి 1535లో బహదూర్ షా దండయాత్ర సమయంలో తన రాజ్యాన్ని కాపాడమని కోరుతూ హుమయూన్‌కి రక్షా బంధనం పంపుతుంది. అయితే.. సమయానికి హుమయూన్ రాకపోవటంతో శత్రువులు కర్ణావతి భర్తను చంపి రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు. దీంతో కర్ణావతి ప్రాయోపవేశం చేయగా, హుమయూన్ ఆ శత్రువులను జయించి, కర్ణావతి కుమారుదీని రాజుగా చేసినట్లు చెబుతారు. హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బ తీయడానికి బ్రిటీష్ పాలకులు బెంగాల్ విభజన చేయగా, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రక్షా బంధన్ స్ఫూర్తిగా హిందూ మహమ్మదీయ ఐక్యతను నిలిపారు. లక్షలాదిమంది హిందూ ముస్లింలు ఒకరికొకరు రాఖీ కట్టుకుని బెంగాల్ ఒక్కటేనని నినదించడం ఆధునిక భారత చరిత్రలో నిజంగా అపురూప సన్నివేశం. ఇలా రక్షాబంధన్ పండుగ కేవలం సోదరీ సోదరుల ఆత్మీయతకు మాత్రమే చిహ్నం కాకుండా పలు వర్గాల మధ్య ఐక్యతకు కారణం కావడం ఈ పండుగ ఔన్నత్యం.
**అనురాగ బంధాల్ని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమి వేళ సిరివెనె్నల కురిసే శ్రావణ పూర్ణిమ నాడు, ఈ బంధనంలో మమతల మధురిమలు వెల్లివిరుస్తాయి. సామరస్య సంతోషాలు సోదర సోదరీమణుల మధ్య వ్యక్తమవుతాయి. ఉత్తర భారతంలో విశేష వ్యాప్తి చెందిన ఈ సంబరం, కాలక్రమంలో దేశమంతటా విస్తరించింది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతలకు ఓ అందమైన ఆవిష్కరణ రక్షాబంధనం. సోదరుడి ఆరోగ్యం, శ్రేయస్సు, సంతోషాన్ని ఆకాంక్షిస్తూ.. సోదరి పవిత్ర హృదయంతో అతడి చేతికి రక్షా కంకణాన్ని ధరింపజేస్తుంది. నుదుట తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, మధుర పదార్థాన్ని సోదరుడికి సోదరి తినిపిస్తుంది. అమ్మ కనబరిచే ఆదరణ, నాన్న కలిగించే భద్రతను ప్రస్ఫుటం చేస్తూ సోదరి తన అనురాగాన్ని సోదరుడి పట్ల ప్రకటిస్తుంది. ‘నేను ధరింపజేసే ఈ రక్ష.. నీ భావి జీవితమంతా సర్వదా అండగా ఉంటుంది.’ అనే భావనను వ్యక్తీకరిస్తుంది. సోదరుడి కుడిచేతికి సోదరి ‘మంగళ రక్షాబంధనం’ చేయాలని ‘వ్రతోత్సవ చంద్రిక’ గ్రంథం చెబుతోంది. రక్షాబంధనం ఉత్సవానికి అనేక పేర్లున్నాయి. రక్షికా పున్నమి, నారికేళ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి.. ఇలా అనేక రీతుల్లో ఈ సందడి వ్యవహారంలో ఉంది. దీన్ని ‘్ధర్మబద్ధమైన వేడుక’గా పురాణాలు నిర్వచించాయి.
**పాండవులకు జయం సిద్ధించడానికి శ్రీకృష్ణుడు ఓ సూచన చేస్తాడు. ఆ మేరకు ధర్మరాజు తన సోదరులకు మంత్రపూర్వకంగా రక్షాబంధన మహోత్సవం నిర్వహించాడని ‘మహాభారతం’ చెబుతోంది. సోదరీమణులతో రక్షాబంధనం ధరింపజేసుకున్న వారికి యమకింకరుల భయం ఎన్నటికీ ఉండదని.. యముడు తన సోదరి యమునకు చెప్పినట్లు ‘్భవిష్యోత్తర పురాణం’ పేర్కొంది. దానశీలుడైన బలి చక్రవర్తికి శ్రీ మహావిష్ణువు తన శక్తిని ఓ కంకణంలో నిక్షిప్తం చేయడం ద్వారా ‘రక్ష’గా అందజేశాడని ‘విష్ణుపురాణం’ విశదపరిచింది. శత్రుభయం లేకుండా తన సుపుత్రుడు అఖండ పాలన కొనసాగించాలని ఆకాంక్షిస్తూ, భరతుడికి తల్లి శకుంతల రక్ష కట్టిందని పురాణ కథనం. ‘రాకా’ అంటే.. నిండుదనం, పున్నమి అనే అర్థాలున్నాయి. ‘రాకా చంద్రుడు’ అంటే పున్నమి చంద్రుడు. శ్రావణ పున్నమి నాడు ధరించే రక్ష ‘రాఖీ’గా స్థిరపడింది. ‘రాఖీ’ అంటే రక్షిక. అది సంవత్సర పర్యంతం సోదరుడికి రక్షగా నిలిచే మహత్తర కవచమని ‘్ధర్మసింధు’ ప్రస్తావించింది. చారిత్రకంగానూ రక్షాబంధనం ఎంతో ప్రశస్తి చెందింది. ఛత్రపతి శివాజీ ఏటా పూర్ణిమనాడు తుల్జా భవానీ సమక్షంలో రక్షాబంధనం చేసుకుని, ధర్మనిబద్ధతకు పునరంకితమయ్యేవాడని చరిత్ర చెబుతోంది. మరాఠా పాలకుడు పీష్వా బాజీరావు కాలంలో, ఈ పున్నమిని సమైక్యతా దినోత్సవంగా నిర్వహించేవారట. రాఖీ పండుగ ద్వారా స్వాతంత్య్రోద్యోమ కాలంలో ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్ష రగిలించారు. ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగూర్ రక్షాబంధన్ సందర్భాన్ని సామాజిక ఐక్యతా వారధిగా వినియోగించుకున్నారు. విభిన్న వర్గాల్ని ఏకీకృతం చేసిన ఆ కవీంద్రుడు, రక్షాబంధనాన్ని ఓ సంరంభంగా నిర్వహించారు. ఇలా రక్షాబంధన ఉత్సవం ఓ పర్వదినంగానే కాక.. జాతీయ సమగ్రతకు, మతసామరస్యానికి ఉపకరించింది. ఈ పర్వాన్ని ‘రక్షక్ దివస్’గా నిర్వహిస్తారు. కొబ్బరికాయల్ని సముద్రజలాల్లో వదిలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తారు. శ్రావణ పూర్ణిమను ‘సంతోషిమాత జన్మదినోత్సవం’గానూ పరిగణిస్తారు. జ్ఞానానికి అధిష్ఠాన దైవంగా భావించే హయగ్రీవ జయంతి కూడా నేడే.. సంస్కృత భాషాదినోత్సవంగానూ ఈ పున్నమి ఖ్యాతిని సంతరించుకుంది. ఇలా పలు విశేషాంశాల సమాహారంగా శ్రావణ పూర్ణిమ వర్థిల్లుతోంది.