Movies

మరో పారితోషికం గొడవలో రజనీ సినిమా

మరో పారితోషికం గొడవలో రజనీ సినిమా-Rajinikanth 2.0 Movie In Troubles Again Over Remmuneration

‘2.ఓ’ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌పై ప్రముఖ సబ్‌టైటిలిస్ట్‌ రేఖ్స్‌ మండిపడ్డారు. నిర్మాతలు ఇప్పటి వరకు తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదని ఆరోపించారు. రేఖ్స్‌దక్షిణాది చిత్రాలకు సబ్‌టైటిల్స్‌ ఇస్తుంటారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ తెరకెక్కించిన ‘2.ఓ’ సినిమాకు కూడా ఆమే సబ్‌టైటిల్స్‌ ఇచ్చారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా రూ.800 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. కాగా ఈ చిత్రం కోసం పనిచేసినందుకు తనకు ఇంకా పూర్తి పారితోషికం ఇవ్వలేదని రేఖ్స్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ‘‘2.ఓ’ నవంబరులో విడుదలైంది. 10 నెలల్లో నా పారితోషికం ఇవ్వాలని వారికి (నిర్మాతలకు) చెప్పా. తరచూ ఫోన్‌కాల్స్‌ చేస్తూనే ఉన్నా. కానీ నా ప్రయత్నం అంతా వృథా అయ్యింది. ఏ సినిమాకైనా సబ్‌టైటిల్స్‌ వెన్నెముకలాంటివి. సబ్‌టైటిల్స్‌ వల్లే ‘2.ఓ’ సినిమాను ఎంజాయ్‌ చేయగలిగానని ‘రోగ్‌ వన్‌: ఎ స్టార్‌ వార్స్‌ స్టోరీ’ రచయిత గ్యారీ విట్టా చెప్పారు. కానీ దాని ప్రాముఖ్యతను చిత్ర పరిశ్రమలోని కొందరు గుర్తించడం లేదు. సబ్‌టైటిల్స్‌ వల్లే ఓ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు చేరువ అవుతుంది. పారితోషికం నిర్ణయించే ముందు నిర్మాతలు ఓసారి ఆలోచించాలనే ఉద్దేశంతో ఇదంతా చెప్పా’ అని ఆమె అన్నారు. అంతేకాదు ‘2.ఓ’ సినిమాకే కాకుండా కమల్‌ హాసన్‌, గౌతమ్‌ మీనన్‌, నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ల నుంచి కూడా తనకు బకాయిలు రావాలని వెల్లడించారు. అయితే రేఖ్స్‌ వ్యాఖ్యల్ని లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధి ఖండించారు. రేఖ్స్‌కు అన్ని నిర్మాణ సంస్థలతోనూ సమస్యేనని తప్పుపట్టారు. ‘మా సంస్థ రేఖ్స్‌ నుంచి వచ్చిన సందేశాలు, ఫోన్‌కాల్స్‌కు స్పందించింది. మేం బాధ్యతారహితంగా వ్యవహరించామని ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మాతో కలిసి పనిచేసిన వారికి మేం వెంటనే పారితోషికం ఇచ్చేస్తుంటాం. రేఖ్స్‌ ట్వీట్లు చూసిన మా సహ నిర్మాత చాలా బాధపడ్డారు. ఆమెకు పారితోషికం ఇచ్చినట్లు ఉన్న పత్రాలను సేకరించి, మా తప్పులేదని నిరూపించే ప్రక్రియలో ఉన్నాం. ఆమెకు నిర్మాణ సంస్థల్ని విమర్శించడం అలవాటు. ఆమె భారీ పారితోషికం డిమాండ్‌ చేశారు. మేం మా మార్కెట్‌ను బట్టి ఇచ్చాం. ఆమె తీరు ఏ మాత్రం సరికాదు. ప్రస్తుతం మేం డాక్యుమెంట్లు వెతికే పనిలో ఉన్నాం’ అని సంస్థ ప్రతినిధి తెలిపారు.