NRI-NRT

ఆంధ్రప్రదేశ్‌ను…ఆనందాంధ్రప్రదేశ్ చేద్దాం

YS Jagan 2019 USAmerica Dallas Tour Speech Saturday Aug 17th-ఆంధ్రప్రదేశ్‌ను...ఆనందాంధ్రప్రదేశ్ చేద్దాం

* మీ సామర్థ్యానికి సహకారానికి సెల్యూట్
* జయహో జగన్ నినాదాలతో నిండిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్
* నేను విన్నాను. నేను ఉన్నాను. నేను చేసి చూపిస్తానన్న ముఖ్యమంత్రి

నాయకత్వమనేది మార్పు నుండి ప్రారంభమవుతుందని అటువంటి మార్పు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆనందాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్ది దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడం తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి డల్లాస్ నగరంలో శనివారం సాయంత్రం ప్రవాసులనుద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. చెడు నుండి మంచికి, పేద నుండి సంపన్నతకి, అవినీతి నుండి నీతికి, అరాచకం నుండి చట్టబద్ధతకు తన ప్రభుత్వంలో మార్పు పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ సమయాన్ని సామర్థ్యాన్ని సహకరాన్ని వినియోగించి ఏపీలో అధికార ప్రక్షాళనతో పాటు తన విజయానికి బాసటగా నిలిచిన ప్రవాసులకు ఆయన సెల్యూట్ చేసి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 41లక్షల మంది ప్రవాస భారతీయుల్లో 6లక్షల మంది తెలుగువారు అమెరికాలో ఉన్నారని తెలిసి ముచ్చటపడుతున్నానన్నారు. టెండర్లలో పారదర్శకతపై ఓ ప్రత్యేక న్యాయమూర్తి చేత వారం రోజులు ప్రజలకు అందుబాటులో ఉంచిన అనంతరం లభించిన సూచనల ఆధారంగా టెండర్ల ప్రక్రియలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ప్రవాసులు జయహో జగన్ నినాదాలు భారీ ఎత్తున చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే కార్యక్రమాలు గడిచిన రెండున్నర నెలల వ్యవధిలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ I have a dream ప్రసంగం తనకు స్ఫూర్తి అన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం ఏపీలో వివిధ కులాలు, తరగతుల మధ్య ఏర్పడిన అసమానతలను నవరత్నాలనే పథకాల ద్వారా చెరిపేసి అవినీతి లంచగొండితనం లేని ఏపీ తన డ్రీం అని తెలపడంతో ప్రవాసుల హర్షాతిరేకాలు మిన్నంటాయి. ఈ లక్ష్యం అందుకునేందుకు ప్రవాసుల ఆశీస్సులు తనకు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను విన్నాను. నేను ఉన్నాను. నేను ఇచ్చిన హామీలు అమలు చేసి చూపిస్తానని జగన్ డల్లాస్ వేదికగా ఉద్ఘాటించారు. ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీరామచంద్రమూర్తి రూపొందించిన జయహో పుస్తకాన్ని అధికార భాషా సంఘం అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించి తొలి కాపీని ముఖ్యమంత్రికి అందించారు. జగన్ ప్రసంగానికి పూర్వం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జగన్ వేదిక వద్దకు వచ్చిన సమయంలో కాసింత గందరగోళం నెలకొన్నప్పటికీ ఆయన వేదిక మీదకు వెళ్లగానే అతిథులు తమ స్థానాల్లో సర్దుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రజానీకానికి ఉచిత ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో సౌత్‌లేక్ మేయర్ లారా హిల్, ప్రముఖ వైద్యులు డా.ప్రేమ్‌సాగర్‌రెడ్డి, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, కడప రత్నాకర్, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గుడివాడ అమరనాధ్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, యార్లగడ్డ శివరాం, తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్, సిలికానాంధ్ర నుండి కూచిభొట్ల ఆనంద్, దీనబాబు కొండుభట్ల, ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి, టాటా నుండి పైళ్ల మల్లారెడ్డి, డాటా నుండి పోలీస్ చంద్రారెడ్డి, TDF నుండి కలవాల అజయ్, విశ్వేశ్వర్ కలవాల తదితరులు పాల్గొన్నారు.