DailyDose

జయలలిత మేనకోడలు సంచలన నిర్ణయం-రాజకీయ–08/20

Jayalalitha Niece Takes Sensational Decision-Telugu Politics-08/20

*‘పురుచ్చి తలైవి’ జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్.. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే గత కొద్ది రోజులుగా దీప తన పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దీప పార్టీ, ఏఐఏడీఎంకేకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ విలీనంపై దీప స్పందించారు. త్వరలోనే తన పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయబోతున్నట్లు ప్రకటించారు.
*ఎట్టకేలకు ఏర్పడ్డ యడ్డీ కేబినెట్‌
ప్రతిపక్షాల విమర్శలకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తన క్యాబినేట్‌లో మొత్తం 17 మందికి అవకాశం కల్పించారు. వీరంతా మంగళవారం గవర్నర్ వాజూభాయ్ వాలా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాలేదనే విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక కసరత్తుల తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కేంద్రం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
*వరదలో బురద రాజకీయం- జోగి రమేష్
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు వరదలో బురద రాజకీయాలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగిరమేష్ విమర్శించారు. బాధితులకు సాయమందించాల్సింది పోయి బురదజల్లే ప్రయత్నాలేంటి? అని ప్రశ్నించారు. సోమవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవ అడ్డుపెట్టి నీటిమట్టాన్ని పెంచారంటూ కనీసం అవగాహన లేకుండా లోకేశ్ ట్వీట్ చేస్తున్నారని మండిపడ్డారు.
*వైకాపా, భాజపాల బంధం ముగిసినట్లే- జయదేవ్
ఎన్నికల సమయంలో చెట్టపట్టాలేసుకుని తిరిగిన వైకాపా, భాజపాల బంధం ముగిసినట్లేనని, ప్రస్తుతం వైకాపా రాక్షస పాలనను భాజపా ఎండగట్టడమే ఇందుకు నిదర్శనమని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పులను కేంద్రం అడుగడుగునా ఎత్తి చూపుతోందని పేర్కొన్నారు. సోమవారం తెనాలిలో జరిగిన తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావేదిక కూల్చివేత, పోలవరం కాంట్రాక్టుల రద్దు, డ్రోన్ రాజకీయాలు.. వైకాపా దుర్మార్గపు పాలనకు నిదర్శనమని చెప్పారు.
*భాజపా గూటికి ఆదినారాయణరెడ్డి?
కడప జిల్లా తెదేపా నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి భాజపా గూటికి చేరేదిశగా అడుగులు వేస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్లో కాషాయదళం కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. నడ్డాను కలిసిన సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మూ-కశ్మీర్లో 370 అధికరణాన్ని రద్దు చేయడం ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆదినారాయణరెడ్డిని నడ్డా కోరారు.
*ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
శాసనమండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలకు నామినేషన్ దాఖలుచేసిన వైకాపా అభ్యర్థులు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ ఇన్ఛార్జి కార్యదర్శి పి.బాలకృష్ణమాచారి నుంచి సోమవారం ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. మూడో అభ్యర్థిగా ఎన్నికైన మంత్రి మోపిదేవి వెంకటరమణ వరద సహాయక చర్యల పర్యవేక్షణలో ఉన్నందువల్ల రాలేకపోయారని ఆయన సహాయకులు రిటర్నింగ్ అధికారికి తెలిపారు. ఈ 3 స్థానాలకూ తెదేపా నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో.. వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
*తెదేపాకు బలం, బలగం కార్యకర్తలే
తెలుగుదేశం పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని, ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిన నాయకులు కాదని పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో, చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పార్టీలో కొత్త నాయకత్వం వస్తుందన్నారు. ఎన్టీఆర్ భవన్ అనేది నాయకులను తయారుచేసే విశ్వవిద్యాలయం వంటిదన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో జాప్యంపై ఈ నెల 26న ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తామన్నారు.
*ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయన ఒక్కరే బరిలో ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగు అధికారి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఆయనకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. మంత్రులు జగదీష్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, శాసనసభ్యులు, మండలి సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ, ‘మూడుసార్లు ఎంపీగా గెలిచిన నేను కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్సీని అయ్యాను. దీన్ని గురుతర బాధ్యతగా భావిస్తా. ప్రజాసేవకే నా పదవిని వినియోగిస్తాను’ అని తెలిపారు.
*భాజపా ఎప్పటికీ బలపడదు
భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నాయకులను ఎంతమందిని చేర్చుకున్నా తెలంగాణలో బలపడదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఎద్దేవా చేశారు. తెరాసకు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్కు భాజపా అసలు పోటీనే కాదన్నారు. బహిరంగ సభలో భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెరాస ప్రభుత్వ అవినీతిపై చేసిన ఆరోపణలమీద సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్పై నమోదైన సీబీఐ కేసులపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
*నాకు ప్రాణహాని ఉంది: ఆళ్ల ఫిర్యాదు
ఫేస్బుక్లో తనతోపాటు తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీమ్ లోకేశ్ అనే సంస్థ నుంచి తెదేపాకు చెందిన నానిచౌదరి తనను ‘తరిమి తరిమి కొడతా’ ‘మీ నాయకుడు జగన్ జైలుకు వెళ్లగానే నీకు సినిమా మొదలవుతుంది.. ఖబడ్దార్’ అంటూ పరుష పదజాలం ఉపయోగించి ఫేస్బుక్లో పోస్టు చేశారని తెలిపారు.
*మీ-సేవ కేంద్రాల నిర్వహణపై స్పష్టతివ్వండి: సీపీఐ
మీ-సేవ కేంద్రాల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ-సేవ కేంద్రాల పాత్ర ఎనలేనిది. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 50వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మీ-సేవ కేంద్రాలను రద్దు చేయబోతున్నారన్న సమాచారంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది’ అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.
*సీఎం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా: బుద్ధా
వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షనేత చంద్రబాబుపై కుట్రలు ఆపకపోతే తాను ముఖ్యమంత్రి జగన్ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ, తెదేపా అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న హెచ్చరించారు. విజయవాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును హతమార్చేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఆయన ఇంటిని ఇటీవల డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారని ఆరోపించారు. నక్సలైట్లు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ముప్పున్న నేత భద్రతపై ప్రభుత్వ తీరు సరికాదన్నారు.
*కాంగ్రెస్ తప్పిదాలతోనే చైనా చొచ్చుకొచ్చింది
కాంగ్రెస్ పాలనలో లద్దాఖ్కు సరైన ప్రాధాన్యం లభించలేదని భాజపా నేత, ఆ ప్రాంత ఎంపీ జామ్యాంగ్ సేరింగ్ నంగ్యాల్ విమర్శించారు. దీనివల్లే లద్దాఖ్ ప్రాంతంలోకి చైనా ఆక్రమణలు సాగుతున్నాయని ఆరోపించారు. 370 అధికరణం ఉపసంహరణ అంశంపై పార్లమెంటులో చేసిన ప్రసంగంతో వార్తల్లోకెక్కిన నంగ్యాల్ తాజాగా ఒక వార్తా సంస్థతో ముచ్చటించారు. ‘‘అంగుళం అంగుళం చొప్పున చైనా దిశగా కదలాలన్న ‘ముందడుగు విధానాన్ని’ నెహ్రూ రూపొందించారు.
*విమోచన దినోత్సవాన్ని గట్టిగా చేయండి
‘‘తెలంగాణలో కష్టపడి పనిచేస్తే రానున్న ఎన్నికల్లో కాషాయజెండా ఎగరేయడం ఖాయం. కార్యక్రమం ఏదైనా పోలింగ్ బూత్ స్థాయి నుంచి చేపట్టండి. తెరాస సర్కారుపై పోరాటాలు చేయండి’’ అంటూ రాష్ట్ర ముఖ్యనేతలకు భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో సీఎం కేసీఆర్కు గుణపాఠం చెబుదాం అని పిలుపునిచ్చారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాత్రి కోర్కమిటీ భేటీ జరిగింది. సభకు ముందు పదాధికారుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు.
*కాంగ్రెస్ తప్పిదాలతోనే చైనా చొచ్చుకొచ్చింది
కాంగ్రెస్ పాలనలో లద్దాఖ్కు సరైన ప్రాధాన్యం లభించలేదని భాజపా నేత, ఆ ప్రాంత ఎంపీ జామ్యాంగ్ సేరింగ్ నంగ్యాల్ విమర్శించారు. దీనివల్లే లద్దాఖ్ ప్రాంతంలోకి చైనా ఆక్రమణలు సాగుతున్నాయని ఆరోపించారు. 370 అధికరణం ఉపసంహరణ అంశంపై పార్లమెంటులో చేసిన ప్రసంగంతో వార్తల్లోకెక్కిన నంగ్యాల్ తాజాగా ఒక వార్తా సంస్థతో ముచ్చటించారు. ‘‘అంగుళం అంగుళం చొప్పున చైనా దిశగా కదలాలన్న ‘ముందడుగు విధానాన్ని’ నెహ్రూ రూపొందించారు. ఆచరణలో అది ‘వెనకడుగు విధానం’గా మారిపోయింది. మనం వెనక్కి తగ్గేకొద్దీ చైనా మన భూభాగంలోకి చొరబడటం ప్రారంభించింది.
*భూటాన్లోనూ రూపే కార్డు: మోదీ
భారత్, భూటాన్ల మధ్య ఆర్థిక, సాంస్కృతిక బంధాలు మెరుగుపడతాయని, దీనిపై తాము చర్చించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండోసారి ప్రధాని అయిన తర్వాత భూటాన్లో తొలిసారి పర్యటిస్తున్న ఆయన.. అక్కడ 740 మెగావాట్ల మాంగ్దెఛు జలవిద్యుత్ కర్మాగారాన్ని ప్రారంభించారు. చారిత్రక సింటోఖా కోటలో భూటాన్ ప్రధాని లోటే థేర్సింగ్తో ఆయన చర్చించారు. అంతరిక్ష పరిశోధన, ఐటీ, విద్యుత్, విద్య లాంటి రంగాల్లో ఇరుదేశాల మధ్య 10 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రూపే కార్డును భూటాన్లో మోదీ ఆవిష్కరించారు. భూటన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యెల్ వాంగ్చుక్ను, రాణి జెట్సున్ పెమాను మోదీ కలిశారు.
*యురేనియం తవ్వకాలకు అడ్డుపడతా: రేవంత్
నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలతో కృష్ణా జలాలు కలుషితం అవుతాయని, ఈ ప్రాంతవాసిగా యురేనియం తవ్వకాలకు అడ్డుపడతానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నల్లమలలోని అమ్రాబాద్ మండల పర్యటనకు వెళ్తూ ఆయన స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడారు.
*నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాం: కోదండరాం
నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షడు కోదండరాం అన్నారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో నేటికీ అన్ని ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరగడం లేదన్నారు.
*డ్రోన్ రాజకీయాలు ఆపండి: పవన్
కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే వారికి సాయం చేయకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో విమర్శించారు. కరకట్టపై ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటమా మంత్రుల బాధ్యత అని ప్రశ్నించారు. డ్రోన్ రాజకీయాలు ఆపి, లోతట్టు ప్రాంత ప్రజలకు సాయమందించాలని సూచించారు. మాజీ సీఎం ఇంటిని ముంచేస్తారా? అని ప్రతిపక్షం.. మునిగిందా లేదా అని చూసేందుకు అధికారపక్షం వాళ్లు రాజకీయాలు చేస్తూ బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారని విమర్శించారు.
*తెలుగు రాష్ట్రాలకు భాజపా చాలా అవసరం
తెలుగు రాష్ట్రాలకు భాజపా అవసరం చాలా ఉందని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి వై.సుజనాచౌదరి అన్నారు. సంఘటన్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వచ్చారు. లాసన్స్బేకాలనీలోని భాజపా నగర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయాలు రెండు కుటుంబాల మధ్యనే నడుస్తున్నాయని.. వైఎస్సార్, చంద్రబాబు కుటుంబ పాలన సాగించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అదే బాటలో వెళుతున్నారన్నారు.
*రేపు, ఎల్లుండి కలెక్టర్లతో సీఎం సమావేశం
రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దీని అమలులో కలెక్టర్లు కీలకమని భావిస్తున్నారు. ఇందుకోసం మంగళ, బుధవారాల్లో ప్రగతిభవన్లో వారితో సమావేశం కానున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు. కొత్త రెవెన్యూ చట్టం అమలుపై క్షేత్ర స్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చట్టంలో ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశంపై విస్తృతంగా చర్చిస్తారు. కొత్త పురపాలక చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుపైనా కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. కొత్త చట్టాలను అనుసరించి పల్లెలు, పట్టణాల్లో అమలు చేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చిస్తారు. వీటిపై సమగ్రమైన చర్చ జరగాల్సి ఉన్నందున సమావేశం రెండురోజుల పాటు జరపాలని సీఎం నిర్ణయించారు.