Sports

అరుదైన రికార్డుకు చేరువలో జడేజా

అరుదైన రికార్డుకు చేరువలో జడేజా-Ravindra Jadeja Close To A Good Record

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో రెండొందల వికెట్ల మార్కును చేరేందుకు జడేజా స్వల్ప దూరంలో ఉన్నాడు. టెస్టు కెరీర్‌లో ఇంకా ఎనిమిది వికెట్లు సాధిస్తే ‘డబుల్‌ సెంచరీ’ మార్కును చేరతాడు. గురువారం నుంచి నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో వెస్టిండీస్‌తో ఆరంభం కానున్న తొలి టెస్టులో జడేజా రెండొందల వికెట్ల మార్కును చేరితో భారత్‌ తరఫునఈ ఫీట్‌ సాధించిన 10వ బౌలర్‌గా నిలుస్తాడు. అదే మయంలో వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా జడేజా రికార్డు నమోదు చేస్తాడు. ఈ జాబితాలో రవి చంద్రన్‌ అశ్విన్‌ ముందంజలో ఉన్నాడు. ఇప్పటివరకూ 41 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జడేజా 192 వికెట్లు సాధించాడు. భారత్‌ తరఫున అశ్విన్‌ 37 టెస్టు మ్యాచ్‌ల్లోనే 200 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో హర్భజన్‌ సింగ్‌ ఉన్నాడు. హర్భజన్‌ సింగ్‌ 46 టెస్టుల్లో ఈ మార్కును చేరగా, దాన్ని జడేజా బ్రేక్‌ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఓవరాల్‌గా చూస్తే వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో యాసిర్‌ షా(33), గ్రిమ్మిట్‌(36 టెస్టులు-ఆసీస్‌) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో అశ్విన్‌ కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనే యోచనలో భారత్‌ ఉంది. దాంతో జడేజాకు తుది జట్టులో చోటు లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కుల్దీప్‌ యాదవ్‌ను తుది జట్టులో ఆడించాలని భావిస్తే జడేజాకు ఉద్వాసన తప్పకపోవచ్చు.