Devotional

శ్రీవారి ఆర్జిత సేవల వివరాలు

శ్రీవారి ఆర్జిత సేవల వివరాలు

1. బ్రాహ్మీ ముహూర్తం అంటే…
ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు. అయితే తిథి వార నక్షత్రాలతో పనిలేకుండా ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు కాలాన్ని- అంటే తెల్లవారుజామును మంచి ముహూర్తంగా చెబుతారు పెద్దలు. అందుకే ఆ సమయంలో ప్రారంభించిన ఏ పని అయినా ఎలాంటి ఆటంకాలూ లేకుండా సజావుగా సాగిపోతుందంటారు. తెల్లవారుజామును రెండు రకాలుగా వర్గీకరిస్తారు. సూర్యోదయానికి రెండు ఘడియల ముందు కాలాన్ని – అంటే 48 నిమిషాల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అనీ, ఆసురీ ముహూర్తానికి ముందు 48 నిమిషాల కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అనీ అంటారు. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది… కశ్యప బ్రహ్మకూ వినతాదేవికీ జన్మించినవాడు అనూరుడు. అతడే సూర్యుడి సారధి. తల్లి వినతాదేవి పుత్రుడిని చూసుకోవాలనే ఆత్రుతతో పుట్టకముందే అండాన్ని పగలకొట్టడంతో సగం శరీరంతో జన్మించాడు. బ్రహ్మ అతడిని సూర్యుడికి సారధిగా నియమించి, ‘నువ్వు భ్రష్టలోకాన ఉన్న సమయమే బ్రహ్మకాలం. ఆ సమయానికి ఎలాంటి దోషాలూ ఉండవు’ అని వరమిస్తాడు. సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు బ్రహ్మ కాలం. బ్రహ్మకాలాన్నే బ్రాహ్మీముహూర్తమనీ అంటారు. ఇది చాలా మంచికాలం. ఆ సమయంలో చెడు అన్నది ఏ నక్షత్రాలూ గ్రహాలూ చెయ్యలేవన్నదే బ్రహ్మ ఇచ్చిన వరం.
2. రాఘవేంద్రస్వామి సన్నిధికి తితిదే పట్టువస్త్రాలు
పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 348వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఘనంగా సాగుతున్నాయి. స్వామి బృందావనంలో ప్రవేశించిన రోజును పురస్కరించుకుని మధ్యారాధనోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నుంచి పట్టు వస్త్రాలు పంపడం ఆనవాయితీ. ఆ మేరకు తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. మఠం అధికారులు వాటిని రాఘవేంద్రస్వామి బృందావనం చెంత ఉంచి, ఊంజల్ సేవ చేశారు. స్వామివారి మూల బృందావనానికి పంచామృతాభిషేకం చేసి, అలంకరించి, మంగళహారతులు ఇచ్చారు.
3. ఊరేగింపుల్లో ‘గజ’ ఒత్తిడి
జంతు ప్రదర్శనశాలలు, జనసమూహాల్లో ఏనుగులు శారీరకంగా, మానసికంగా అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ఇది వాటి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తోందని సీసీఎంబీ-లాకోన్స్ పరిశోధనలో తేలింది. అంతరించిపోతున్న జంతుజాతుల ప్రయోగశాల(లాకోన్స్)కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.ఉమాపతి నేతృత్వంలో పరిశోధకులు రాజశేఖర్, వినోద్‌కుమార్, ముత్తులింగం, ప్రదీప్, ఆదిశేషు ఈ పరిశోధన చేశారు. నిర్బంధంలో ఉన్న ఏనుగుల ఆరోగ్యాన్ని వేర్వేరు పరిస్థితుల్లో పరీక్షించారు. మైసూర్ జంతు ప్రదర్శనశాల, మైసూర్ దసరా ఉత్సవం, ముదుమలై, బంధవ్‌గఢ్ ప్రాంతాల్లో నిర్బంధంలో ఉన్న 37 ఏనుగుల నుంచి 870 నమూనాలను సేకరించారు. ఒత్తిడి హార్మోన్లను విడుదల చేసే గ్లూకోకార్టికాయిడ్ జీవక్రియలను పరీక్షించారు. 24 ఆడ, 13 మగ ఏనుగుల నమూనాలను విశ్లేషించగా మైసూర్ దసరా ఉత్సవం ఊరేగింపులో పాల్గొన్న ఏనుగు, మైసూర్ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఏనుగు కంటే ఎక్కువ ఒత్తిడికి గురైనట్లు గుర్తించారు.
4.నీట మునిగిన రామలింగేశ్వరుడు
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం పాతకుస్తాపురం శివారులోని చారిత్రక రామలింగేశ్వరాలయం ఎస్సారెస్పీ వెనుక జలాల్లో మునిగింది. గత వేసవిలో ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటడంతో ఆలయం తేలింది. సుమారు మూడు నెలల పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్ జిల్లాల ప్రజలతో పాటు మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. రాముడు వనవాసం సందర్భంగా ఈ ప్రాంతంలో పర్యటించినపుడు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. గత 20 రోజులుగా ఎస్సారెస్పీలోకి నీరు వస్తుండటంతో ఆలయం నీట మునిగింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కుస్తాపూర్ గ్రామస్థులకు కరీంనగర్ జిల్లాలో పునరావాసం కల్పించారు. ఈ ఆలయం ఇప్పటి వరకు కేవలం తొమ్మిది సార్లే బయటపడింది.
5. శబరిమల ప్రధాన పూజారుల ఎంపిక
శబరిమల ప్రధాన పూజారిగా మలప్పురం జిల్లాకు చెందిన ఏకే సుధీర్ నంబూద్రి ఎంపికయ్యారు. ఆయన నవంబర్ 17 నుంచి ఏడాదిపాటు ఆ హోదాలో కొనసాగుతారు. ఆలువాకు చెందిన ఎం.ఎస్.పరమేశ్వరన్ నంబూద్రి మాలికాపురం దేవి ఆలయం ప్రధాన పూజారిగా వ్యవహరిస్తారు.
6. బోనాల ఉత్సవాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రాష్ట్ర హైకోర్టు ఆవరణలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్తో పాటు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూర్యకిరణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చలపతిరావు, సంఘం ప్రతినిధులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
7. సులువు దర్శనానికి ‘శ్రీవాణి’కి విరాళం
ఆలయాల నిర్మాణానికి దాతల నుంచి విరాళాలను సేకరించే శ్రీవాణి ట్రస్టు విధివిధానాలను తితిదే సరళీకృతం చేసింది. రాజధాని అమరావతిలో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో మందిరాలులేని గ్రామాలు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్రీవారి ఆలయాల కోసం ట్రస్టు కింద నిధులు సేకరించనుంది. తితిదే ఆధ్వర్యంలో ఇప్పటికే తొమ్మిది ట్రస్టులున్నాయి. వీటికి రూ.లక్షకు పైబడి విరాళమిచ్చే దాతలకు స్వామివారి బ్రేక్‌దర్శనం కల్పిస్తున్నారు. రూ.10 లక్షలు ఇచ్చే దాతలకు వీఐపీ దర్శనంతోపాటు వసతి, రూ.కోటి విరాళమిచ్చే వారికి ప్రొటోకాల్ దర్శనంతోపాటు సుప్రభాత సేవ, వసతి సౌకర్యాలను తితిదే కల్పిస్తోంది. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్టు కోసం తిరుమలలో ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.10 వేల విరాళమిచ్చే భక్తుడికి ప్రొటోకాల్ మర్యాదలతో బ్రేక్ దర్శనం చేసుకునేలా రశీదును ఇచ్చేందుకు ప్రతిపాదిస్తున్నారు. తొలుత దీన్ని రోజుకు 200 మందితో ప్రయోగాత్మకంగా ప్రారంభించి.. తర్వాత నిత్యం వెయ్యి మందికి విస్తరించాలని తితిదే భావిస్తోంది. ప్రస్తుతం ఉన్నత వర్గాల భక్తులు బ్రేక్ దర్శనానికి దళారులను ఆశ్రయిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టులో సొమ్ము జమ చేస్తే దర్శనం సులువు కానుంది. విశేష సేవలైన వస్త్రాంలంకరణ, అభిషేకం, తోమాల, అర్చన సేవాటిక్కెట్లను సైతం శ్రీవాణి ట్రస్టు పరిధిలోకి తేవాలని తితిదే ప్రతిపాదిస్తోంది. ఆరోజు అందుబాటులో ఉన్న టిక్కెట్లలో కొన్నింటిని ట్రస్టు కిందికి మళ్లిస్తారు. ఉదాహరణకు వస్త్రాలంకరణ సేవా టిక్కెట్టు ఒకటి ఖాళీ ఉంటే.. రూ.5 లక్షలు విరాళమిచ్చే దాతకు కేటాయిస్తారు. ఈ ప్రతిపాదనలను ధర్మకర్తల మండలి ఆమోదించాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు.
8. శ్రీశైల దేవస్థానం, లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు ఇటీవల నిర్వహించిన వేలంపాటను రాష్ట్ర ప్రభుత్వ రద్దు చేసింది.. అన్యమతస్థులకు ఈ షాపులను వేలంలో అప్పగించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వేలంను రద్దు చేస్తూ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. దుకాణాల వేలం పాట రద్దుకు తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై పూర్తి వివరాలు అందిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్థానం పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.
9. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజు మంగళవారం *20-08-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో భక్తుల రద్దీసాధారణం …… శ్రీవారి దర్శనానికి *04* కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు… శ్రీవారి సర్వ దర్శనానికి *08* గంటల సమయం పడుతోంది….. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *3* గంటల సమయం పడుతుంది….నిన్న ఆగస్టు *19* న *82,575* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *3.92* కోట్లు.
10. శుభమస్తు తేది : 20, ఆగష్టు 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : భౌమవాసరే (మంగళవారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 30 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 31 ని॥ వరకు పంచమి తిధి తదుపరి షష్ఠి తిధి)
నక్షత్రం : రేవతి
(నిన్న రాత్రి 7 గం॥ 48 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 28 ని॥ వరకు రేవతి నక్షత్రం తదుపరి అశ్వని నక్షత్రం )
యోగము : (శూల ఈరోజు సాయంత్రం 4 గం ll 27 ని ll వరకు తదుపరి గండ రేపు సాయంత్రం 4 గం ll 56 ని ll వరకు)
కరణం : (కౌలవ ఈరోజు సాయంత్రం 4 గం ll 32 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నం 12 గం ll 19 ని ll )
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 7 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 35 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 48 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 1 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : మీనము
11.నేటి సామెత
తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టుకొంతమంది ఏమీ తోచక విచిత్రమైన పనులు చేస్తుంటారు. చూసేవాళ్ళకు ఆ చేష్టలు వింతగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎంతో హాస్యరసపూరితంగా చెప్పడానికి తోచీ తోచనమ్మ తన తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టుంది అంటారు. తెలుగు సామెతలలో చమత్కారం మేళవింపుకి ఇది ఒక మచ్చుతునక.
12. మన ఇతిహాసాలు
అర్జునుడు అఖండమైన సవ్యసాచి ఎలా పేరుగాంచాడు?మహాభారతంలోని పంచపాండవుల్లో అర్జునుడు ఒకరు. ఈయన ఘనమైన విలుకాడుగా ఎలా రూపొందడానికి ప్రధాన కారణంగా ఆయనలో ద్విగుణీకృతమైన పట్టుదల. మొక్కవోని దీక్షలే. తనకు కాంతి తక్కువ ఉన్నప్పుడు విలువిద్య కష్టంగా ఉందని పలికిన అర్జునుడితో ద్రోణుడు “అర్జునా.. నీవు ఈ జగతిలో స్థిరంగా నిలిచిపోయే విలుకాడు కావాలని ఆకాంక్షిస్తున్నావు. అంకితభావం. కఠోరంగా పరిశ్రమిస్తే శబ్దాన్ని బట్టి ఆ వస్తువును ఛేదించే శబ్దవేది విద్యలోనూ నీవు గొప్ప విలుకాడు కాగలవు. అతి సున్నితమైన వస్తువులను సైతం ఛేదించాలంటే నీవు అతి తక్కువ కాంతితో సాధన చేస్తేనే పరిపూర్ణుడివి అవుతావు అని అనగానే అర్జునునికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అప్పటి నుంచి నిరంతరం పరిశ్రమించి తన విద్యలో అఖండమైన ప్రజ్ఞను సాధించి జగతిలోనే ‘సవ్యసాచి’గా పేరుగాంచాడు.