Business

అమెరికన్లకు యాపిల్ క్రెడిట్ కార్డులు

Americans Going Crazy With Apple Credit Card

అమెరికాలో ఉంటున్న యాపిల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇకపై యాపిల్ కార్డును తమ వినియోగదారులందరికీ అందజేయనున్నట్లు యాపిల్ తెలిపింది. ఈ మేరకు యాపిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఆరంభంలో యాపిల్.. యాపిల్ కార్డు పేరిట ఓ నూతన తరహా క్రెడిట్ కార్డు సర్వీస్‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఆరంభంలో కేవలం కొద్ది మంది ఎంపిక చేసిన యాపిల్ వినియోగదారులకు మాత్రమే ఈ కార్డును కేవలం ఇన్విటేషన్ ప్రాతిపదికన అందించారు. అయితే ప్రస్తుతం ఈ కార్డును యాపిల్ వినియోగదారులందరికీ అందిస్తున్నారు. యాపిల్ కార్డు కావాలనుకునే యూజర్లు ఆ సర్వీస్‌కు తమ వివరాలను అందజేసి దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ క్రమంలో కార్డు అప్రూవ్ కాగానే యూజర్‌కు చెందిన యాపిల్ వాలెట్‌లో ఆ కార్డు వివరాలు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. ఇక కార్డుకు రిజిస్టర్ చేసుకున్న కేవలం 1 నిమిషం వ్యవధిలోనే కార్డు అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా.. అన్నది తెలిసిపోతుంది. దీంతో కార్డు అప్రూవ్ కాగానే యాపిల్ వాలెట్‌లో కనిపించే కార్డుతో యూజర్లు ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. ఇక యూజర్ కోరుకుంటే కొద్ది రోజుల్లో ఆ కార్డును ఫిజకల్‌గా కూడా మెయిల్‌లో ఇంటికి పంపుతారు. కాగా యాపిల్ ఈ క్రెడిట్ కార్డు సర్వీస్‌ను అందించడం కోసం గోల్డ్‌మన్ సాక్స్, మాస్టర్‌కార్డ్ సంస్థలతో ఇప్పటికే భాగస్వామ్యమైంది. అయితే ఈ కార్డుకు ఎలాంటి వార్షిక ఫీజును వసూలు చేయడం లేదు. అలాగే ఇంటర్నేషనల్, ఓవర్ లిమిట్, లేట్ ఫీజు లాంటివేవీ ఈ కార్డుకు లేవని యాపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక ఈ కార్డుకు నంబర్, సీవీవీ సెక్యూరిటీ కోడ్, ఎక్స్‌పైరేషన్ డేట్ కూడా ఏమీ ఉండవు. కార్డుపై సిగ్నేచర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కాగా ఈ కార్డుపై యూజర్లు జరిపే లావాదేవీలకు గాను యాపిల్ రోజుకు 3 శాతం క్యాష్‌బ్యాక్‌ను ప్రస్తుతం అందిస్తున్నది.