NRI-NRT

డల్లాస్‌లో మేడసాని అష్టావధానం

Medasani Moha Ashtavadhanam In Dallas by TANA-TANTEX-డల్లాస్‌లో మేడసాని అష్టావధానం

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంయుక్తంగా ఆగష్టు 18 న అష్టావధానం కార్యక్రమాన్నిడాలస్ లో ఘనంగా నిర్వహించారు. దాదాపుగా 200 మందికి పైగా సాహితీ ప్రియులు 4 గంటల పాటు ఆసక్తితో, ఉత్సాహంగా కదలకుండా కూర్చుని సభని జయప్రదం చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు సభను ప్రారంభించి, డా. మేడసాని మోహన్ గారికి స్వాగతం పలికి, తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి ని , టాంటెక్స్ మరియు తానా కమిటి సభ్యులను సభకు పరిచయం చేశారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి మాట్లాడుతూ డా. మేడసాని గారి ప్రతిభను కొనియాడి, డాలస్ లో టాంటెక్స్ వారు సాహిత్యానికి ఇస్తున్న ప్రాముఖ్యతను అభినందించారు. ఈ రోజు అవధాన కార్యక్రమం తానా మరియు టాంటెక్స్ కలసి నిర్వహించడం చాల ఆనందదాయకంగా వుంది అని తెలియజేశారు.

కార్యక్రమంలో ముందుగా చి. తాన్వి పొప్పూరి ‘అన్నమయ్య కీర్తనలు’ ప్రారంభ గీతాలు శ్రావ్యంగా ఆలపించారు. అమెరికా తెలుగు సాహిత్యం అంటే గుర్తుకు వచ్చే పేరు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ , వారు నిర్వహించే నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమము 145 నెలలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఎందరో తెలుగు మహానీయులను అమెరికా తెలుగు వారికి సగర్వంగా పరిచయం చేశారు ఈనెల ఆగష్టు 18 వ తేదీన స్థానిక డల్లాస్ నగరంలో , ఫ్రిస్కో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో సాహిత్య అభిమానులు గర్వపడేలా, తెలుగు అవధాన మధు తరంగాలు దిగంతాలకు వ్యాపించేలా తెలుగు భాషలలో అత్యంత క్లిష్టమైన అవధాన ప్రక్రియను , “అపూర్వ పంచ సహస్ర అవధాన సార్వభౌమ ” , అవధాన బ్రహ్మ ఇలా ఎన్నో బిరుదులు గాంచి , అవధాన చరిత్రలో తనపేరు బంగారు అక్షరాలతో లిఖింపచేసిన డా|| మేడసాని మోహన్ అవధాని కావడంతో , అమెరికా నలుమూలల నుండి విచ్చేసిన అవధాన ప్రియులు , సాహిత్య జల్లులలో హాయిగా సేదతీరారు. అవధానం అంటే అవధులు లేని ఆనందం అనిపించేతగా ఈ కార్యక్రమం సాగింది. అవధాన ప్రక్రియలో 8 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు, ఈ పృచ్ఛకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద అవధాని ని పరీక్షిస్తారు. ఎక్కడా కాగితం కలం వాడకుండా, వారు అడిగిన ఛందస్సులో , కొన్ని సార్లు చమత్కారంగా , మరికొన్ని సార్లు భక్తి పారవశ్యంతో, ఛలోక్తులతో అవధాని ఇచ్చిన సమాధానాలు తెలుగు వారికే ఆ ఆనందం సొంతం అనిపించేతగా సాగాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అవధాని పూడూర్ జగదీశ్వరన్ సంధాత గా వ్యవహరించారు. ఆయన స్వహతాగా అవధాని కావడంతో ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించారు. ఈ సందర్భంగా తమ ఇరువురు తిరుపతి వెంకటేశ్వర కళాశాలలో కలిసి చదువుకొన్న విషయాలు ప్రస్తావించారు. అవధాన అంశాలలో , ఊరిమిండి నరసింహరెడ్డి దత్తపది, తోరకూర ప్రసాద్ న్యస్తాక్షరి , ఉపద్రష్ట సత్యం మహాకవి ప్రసంగం, కుమారి మద్దుకూరి మధుమాహిత సమస్య, వేముల లెనిన్ వర్ణన , శ్రీమతి కలవగుంట సుధ ఆశువు , కాజ సురేష్ నిషిద్ధాక్షరి అంశాలతో, మాడ దయాకర్ తన అప్రస్తుత ప్రసంగం తో, జలసూత్రం చంద్రశేఖర్ లేఖకుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దత్తపది అంశంలో ఊరిమిండి నరసింహా రెడ్డిచెరువు కరువు పరువు తరువు పదాలతో పోతనకృష్ణదేవరాయల వారిని రైతుల కోసం అభ్యర్ధన వర్ణించమన్నారు , కూరిమి తోడ అ’చ్చెరువు’ గూర్పెడి .. అన్న పద్యంతో అవధాని పూరించారు. ప్రసాద్ తోటకూర తో. కూ. ర. ట అక్షరాలతో న్యస్తాక్షరి సమస్య ఇచ్చారు , తీరా చూస్తే తమ ఇంటిపేరు తోరకూర వచ్చేలా కాశ్మీరం గురించి వర్ణించమన్నారు , అవధాని గారికి ఈ విషయం అర్ధమై ఛలోక్తులు విసిరారు. క్లిష్టమైన నిషిద్ధాక్షరి ప్రక్రియ తో కాజ సురేష్ అవధాని ని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నించారు, అవధాని ఏమి చెప్పబోతున్నారో ముందే ఊహించి , ఆయా అక్షరాలను నిషేధించడం ద్వారా ఆయన దారి మళ్లించే ప్రయత్నమే క్లుప్తంగా నిషిద్ధాక్షరి అంటే. ఆయనేమో పంచ సహస్ర అవధాని , 5000 మందితో ఒకేసారి అవధానం నిర్వహించిన మహా పండితుడు, ఆయన దారులు ఆయనకు ఉంటాయి కదా అనిపించేలా చక్కగా పూరించారు. మద్దుకూరి మధుమాహిత “నీరు త్రాగ వచ్చే నీరసంబు ” అని చిత్రమైన సమస్యను, వేముల లెనిన్ బాబు “దేశాభిమానం దురభిమానంగా మారి ఉన్మాది స్థితి చేరినపుడు ” కలిగే పరిణామాలు, కలవగుంట సుధ “వాలి సుగ్రీవ సంగ్రామం” మీద ఆశువు , ఉపద్రష్ట సత్యం అల్లసాని పెద్దన గారి సింహావలోక ఉత్పల మాలిక , హంపీ విజయనగరంలో డిండిమభట్టు ను ఓడించి తెలుగు సాహిత్య పతాకాన్ని ఎగురవేసిన శ్రీనాథమహాకవి గూర్చి కన్నడ ముమ్మకవి చెప్పిన సీస పద్యం చక్కగా గానం చేస్తే అవి ఈ సందర్భాలలో ఎవరు రాసారో అవధాని క్షణం ఆలస్యం చెయ్యకుండా చెప్పారు. వాతావరణంలో సాహిత్య సాంద్రత ఎక్కువ అవుతున్నపుడల్లా తన ఛలోక్తులతో , అప్రస్తుత ప్రసంగం తో మాడ దయాకర్ నవ్వులు పూయించారు. ఈ క్రమంలో తన మామ గారితో తనకున్న అనుభందం , మామ అల్లుళ్ళ సరదా సన్నివేశాలు చెప్పి అవధాని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. అవి చూసి తీరవలసిందే , ఎంత గొప్ప హాస్యానుభవం అని కార్యక్రమం తర్వాతా కూడా హాస్య ప్రియులు నవ్వుతూనే ఉన్నారు.

కళామతల్లికి పెద్దపీట వేసే టాంటెక్సు అధ్యక్షులు వీర్నపు చినసత్యం, తన ఆధ్వర్యంలో పంచసహస్ర అవధాని మేడసాని వారు రావడం , డల్లాస్ లో ప్రసిద్ధ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ఈ మహోన్నత అవధాన కార్యక్రమం జరగడం తన అదృష్టం అని కృతజ్ఞతా పూర్వక వందనాలు సమర్పించారు. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను పోగుచేసుకొన్న మధురానుభూతులతో అమెరికా నలుమూలల నుండి వచ్చిన అభిమానులు, తెలుగు వారై ఈ అమృతానందం మాకే సొంతం అని గర్వంగా టాంటెక్స్ వారినుండి మరొక ఆణిముత్యం ఈ కార్యక్రమం అని కొనియాడారు. డా. మేడసాని మోహన్ ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, సాంబ దొడ్డ మరియు తానా & టాంటెక్స్ కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సభలోనే ఉన్న తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి ని టాంటెక్స్ మరియు తానా కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతిష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, సుగన్ చాగర్లమూడి, కె.సి. చేకూరి , ప్రకాశరావు వెలగపూడి ,ఎం.వి.యల్.ప్రసాద్, టాంటెక్స్ పూర్వధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, శరత్ ఎర్రం తో సహా ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారికి, విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, టివి9, టివి5 మరియు ఇతర మీడియా ప్రతినిధులకు నిర్వాహకులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. డా. మేడసాని మోహన్ తనకు జరిగిన ఘన సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిరాటంకంగా నాలుగు గంటల పాటు వందలాదిమంది సాహితీప్రియులు, తెలుగు భాషపై ఉన్న మమకారంతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం తన జీవితంలో మర్చిపోలేని ఘటన అని ఉద్వేగభరితంగా అన్నారు.