Fashion

అమెరికా మొత్తం కన్నా భారతదేశ మహిళల వద్దే ఎక్కువ బంగారం

Gold With Indian Women Surpasses US's Total Gold Reserves-అమెరికా మొత్తం కన్నా భారతదేశ మహిళల వద్దే ఎక్కువ బంగారం

భారతీయ మహిళల శక్తి తెలుసా.. అమెరికా వద్ద ఉన్న బంగారం రిజర్వుల కంటే భారతీయ మహిళల వద్దే ఎక్కువగా బంగారం ఉంది. ఇప్పటికే బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తుండటంతో ప్రజలు బంగారాన్నే సురక్షితమైన పెట్టుబడికి మార్గంగా ఎంచుకొంటున్నారు. భారత్‌లో బంగారం నిల్వలు కొండల్లా పెరిగిపోవడానికి బలమైన చారిత్రక సామాజిక కారణాలు ఉన్నాయి.
**మన దగ్గర ఎంత బంగారం ఉంది..?
ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం భారతీయుల వద్ద 25,000 టన్నుల బంగారం ఉన్నట్లు తేలింది. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా (8,133 టన్నులు), జర్మనీ (3,373),ఐఎంఎఫ్‌ (2,814),ఇటలీ (2,450),ఫ్రాన్స్‌ (2,435), చైనా (1,842),రష్యా (1,778) మొత్తం రిజర్వుల కంటే ఇది చాలా ఎక్కువ. గత ఏడాది వరకు 24వేల టన్నులు ఉన్న నిల్వలు ఈ ఏడాది 25వేల టన్నులకు చేరినట్లు వరల్డ్‌ గోల్డ్‌కౌన్సిల్‌ భారతీయ విభాగం ఎండీ శామ్‌ సుందర్‌ వెల్లడించారు. ఇది దేశ జీడీపీలో 40శాతం మొత్తానికి సమానం. 2019లో అత్యధికంగా భారతీయులు 850 టన్నుల బంగారం కొనుగోలు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనికి ఆర్థిక మాంద్యం తోడైతే ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది.
జనవరి నుంచి మార్చిలోపే 159టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. 2010లో అత్యధికంగా 963 టన్నుల పుత్తడి భారతీయుల ఇళ్లల్లో చేరింది. 2016లో నోట్ల రద్దు సమయంలో కొనుగోళ్లకు కొంత బ్రేకు పడి 666 టన్నులకే పరిమితమైంది. ఇప్పటి వరకు 1,90,040 టన్నుల బంగారాన్ని భూగర్భం నుంచి వెలికి తీసినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిల్లో 1950 తర్వాత 1.26లక్షల టన్నులను బయటకు తీశారు.
**కేరళ టాప్‌..
దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక గోవా రెండో స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న గోవా కంటే కేరళ కొనుగోళ్లు ఆరురెట్లు అధికం కావడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారి కంటే పట్టణ ప్రాంతాల వారు నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సిక్కింలో అత్యల్పంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. కేరళలో బంగారు గనులు లేకపోయినప్పటికీ బంగారం అధికంగా ఉండటానికి కారణం సుగంధద్రవ్యాల వ్యాపారం. రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఐరోపా ఖండాలతో వాణిజ్యసంబంధాలుండేవి. అప్పట్లో కరెన్సీ లేకపోవడంతో వస్తుమార్పిడి పద్ధతి ఉండేది. దీంతో పాటు ఐరోపాలో శీతకాలం సుదీర్ఘంగా ఉండేది. ఐరోపాలో ఆహారపదార్థాలను నిల్వ చేసుకునేందుకు మిరియాలను వినియోగించేవారు. మిరియాలను మలబారు తీరం నుంచి దిగుమతి చేసుకునేవారు. సుగంధద్రవ్యాల కొనుగోళ్లకు బంగారు నాణేలనిచ్చేవారు. ఈ వాణిజ్యంతో కేరళ తీరంలోని పలు నౌకాశ్రయ నగరాలు అభివృద్ధి చెందాయి. ప్రజలు బంగారాన్ని ఒక అలంకారంగా కాకుండా ఆస్తిగా పరిగణించేవారు. దీంతో బంగారును సేకరించేవారు. ఇదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుండటంతో బంగారు వాణిజ్యంలో కేరళ టాప్‌గా నిలిచింది
**భారతీయులకు ఎందుకింత మోజు..
* భారతీయులు బంగారంపై మోజు పెంచుకోవడానికి చారిత్రక, సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. మన సంస్కృతిలో బంగారాన్ని సంపదకు, హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారం ధరించడానికి ఆసక్తి కనబరుస్తారు. వివాహ సందర్భంగా బంగారం నగలు కొనడం భారత్‌లో పరిపాటి. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ ఆకాశాన్నంటుతుంది.
* వివిధ పండుగలకు, పర్వదినాలకు బంగారం కొనడాన్ని శుభసూచకంగా భావిస్తారు. థన్‌తేరస్‌, అక్షయతృతీయ వంటి పండుగలకు బంగారం కచ్చితంగా కొనుగోలు చేయాలని భావిస్తారు.
* భారత్‌లో బంగారం నగదుతో సమానంగా చలామణి అవుతుంది. కష్టకాలంలో బంగారం విక్రయించుకుంటే తక్షణమే నగదు చేతికొస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది.
* నల్లధనం నిల్వ చేయడానికి బంగారం అనువైన మార్గంగా భావిస్తారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో బంగారం నిల్వ చేస్తారు. దీనిని అవసరమైనప్పుడు మార్కెట్లో విక్రయించి నగదుగా మార్చేస్తుంటారు.
* గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉండే భారత్‌లో పెట్టుబడి మార్కెట్లపై పెద్దగా అవగాహన లేకపోవడం.. బంగారం ధర నిలకడగా పెరుగుతుండటంతో సరక్షితమైన పెట్టుబడి మార్గంగా మారింది.
* తమ తర్వాతి తరాలకు సంపదను పంచడానికి భారతీయులు ఎంచుకునే మార్గాల్లో భూములు, బంగారం ప్రధానమైనవి. దీంతో చాలా వరకు సొమ్ము బంగారం రూపంలో భద్రం చేస్తారు. అంతేకాదు బంగారు నగలను వారసత్వ సంపదగా భావించే కుటుంబాలకు భారత్‌లో కొదవేలేదు.