Business

10 గ్రాముల పసిడి ధర రూ. 39,670కు చేరింది

10Grams Gold In Indian Market Reaches Close To 40000 INR

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి క్షీణత, బలమైన అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా ఐదో రోజు ఈ లోహాల ధరలు పెరిగాయి. సోమవారం ఒక్కరోజే రూ. 675 పెరిగి పసిడి ధర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నేటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 39,670కు చేరింది. ఆగస్టు 20 నుంచి ప్రతిరోజూ పుత్తడి ధర పెరుగుతూనే ఉంది. అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో నేటి మార్కెట్లో వెండి ధర రూ. 1,450 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ. 46,550 పలికింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత, ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు దేశీయంగా కూడా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ధరలు అమాంతం పెరుగుతున్నట్లు తెలిపారు.