Politics

దొర పాలనలో వేలకోట్ల దోచుకుంటున్నారు

దొర పాలనలో వేలకోట్ల దోచుకుంటున్నారు

విద్యుత్‌ శాఖలో రూ.వేల కోట్లు దోపిడీ చేస్తే ప్రశ్నించొద్దా? అని మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా నిన్న విద్యుత్‌ ఉద్యోగులు చేసిన ధర్నాకు బాధ్యులెవరని ప్రశ్నించారు. వాళ్లను ఎందుకు ప్రోత్సహించారు? వాళ్లపై ఏం చర్యలు తీసుకుంటారని అడిగారు. విద్యుత్‌ శాఖపై సీబీఐ విచారణ చేయించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారని, మరి సీబీఐ విచారణ ఏదీ? ఏమైంది? అని రేవంత్‌ నిలదీశారు. తెరాస, భాజపా ఒకే తానులోని ముక్కలని ఆరోపించారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు ఆలస్యం వల్ల ఏటా రూ.400 కోట్లు భారం పడుతోందన్నారు. విద్యుత్‌ శాఖలో ఉద్యోగుల జీతాలు అప్పులు తెచ్చి ఇస్తున్నారని విమర్శించారు. వీటికి సమాధానం చెప్పాల్సింది సీఎం కేసీఆర్‌, విద్యుత్‌ సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావేనన్నారు. ప్రజాధనాన్ని కేసీఆర్‌ కుటుంబం కొల్లగొడుతోందని.. ఈ దోపిడీని అంతా కలిసి అడ్డుకోవాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్‌ శాఖలో అవినీతి, నియామకాలపై రాజకీయంగా, న్యాయపరంగా కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. భాజపాలో అంతర్గత పోరు జరుగుతోందని.. కేసీఆర్‌ వ్యతిరేక వర్గం, అనుకూల వర్గంగా ఆ పార్టీ చీలిపోయిందని రేవంత్‌ ఆరోపించారు.