Health

కృత్రిమశ్వాసపై తల్లిప్రాణాన్ని నిలిపి బిడ్డకు ప్రాణం పోశారు

Brain Dead Czech Lady's Baby Saved After 4Months Of Treating The Mom

వైద్యరంగంలో టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు అనేందుకు సజీవ సాక్ష్యం ఈ ఘటన. వైద్యులు సుమారు నాలుగు నెలలు శ్రమించి బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళకు మాతృత్వాన్ని ప్రసాదించారు. మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ రోజులు కృత్రిమ శ్వాసపై తల్లిప్రాణాన్ని నిలిపి ఆమె బిడ్డకు ప్రాణం పోశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన అరుదైన ఘటన ఇది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 27 ఏళ్ల మహిళ అచేతన స్థితిలో చెక్‌ రిపబ్లికన్‌లోని బర్నో విశ్వ విద్యాలయ ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు నిర్వహించగా 27వారాల గర్భిణి అని తేలింది. ఆసుపత్రిలో చేరిన నాలుగురోజులకే ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు గుర్తించారు. కడుపులోని బిడ్డను కాపాడేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. శరీరంలోని కీలక అవయవాలను పనిచేయించేందుకు యంత్రాలను ఉపయోగించారు. కొద్ది రోజులకే కడుపులోని బిడ్డలో పెరుగుదలను గుర్తించారు. 117 రోజుల పాటు విశ్వ ప్రయత్నాలు చేసి ఆమెకు తాజాగా సిజేరియన్‌ ద్వారా కాన్పు చేశారు. బ్రెయిన్‌ డెడ్‌ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.శిశువు 2.3కిలోల బరువుతో జన్మించింది. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గర్భవతిగా ఉన్నన్ని రోజులు బ్రెయిన్‌ డెడ్‌ మహిళకు కృత్రిమ శ్వాస అందించారు. ప్రసవం అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో దాన్ని తొలగించారు. దీంతో ఆమె కన్నుమూసింది.