DailyDose

దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులు జరగవచ్చు

Chance Of Terrorist Attacks On South India-Reports Intelligence

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో పాకిస్తాన్‌ మన దేశంపై రగులుతూనే ఉంది. ఎలాగైనా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఉగ్రవాదులతో భారత్‌పై దాడులకు తెగబడాలని చూస్తోంది. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో అక్కడ పాక్‌ పన్నాగాలు పారడంలేదు. ఎల్‌వోసీ వెంట ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించడానికి చేస్తున్న ప్రయత్నాలను సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. దీంతో ఉత్తర భారతంలో తమ ప్రయత్నాలు బెడిసికొడుతుండటంతో తాజాగా ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్మీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌కే సైనీ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కీలక సమాచారం అందిందని తెలిపారు. అరేబియా సముద్రంలోని సర్‌క్రీక్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని గుర్తు తెలియని పడవలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దీంతో దక్షిణాది తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించిన సైన్యం కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తనిఖీలను ముమ్మరం చేసింది. కాగా, పాకిస్తాన్‌ రహస్యంగా లష్కరే తోయిబా నాయకుడు మసూద్‌ అజర్‌ను విడుదల చేయడంతో భారత సైన్యం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఇక జమ్మూకశ్మీర్‌లో సైనిక స్థావరాలే లక్ష్యంగా ఎల్‌ఈటీ ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారనే ఇంటెలిజెన్స్‌ సమాచారంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.