Health

ప్రకృతి వ్యాయామం గురించి విన్నారా?

Nature Exercise aka Outdoor Workouts Have Higher Benefits

హార్మోన్లని సమతూకం చేస్తూ, అవయవాల్ని ఆరోగ్యంగా, శరీరాన్ని దృఢంగా మార్చే దిశగా వ్యాయామం కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకోసం…నాలుగ్గోడల మధ్య చేసే వర్కవుట్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి… ఆరుబయట కసరత్తులు చేయడమే దీని ప్రత్యేకత. ఈ విధానంలో స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలు-ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటివన్నీ కలగలసిన సమతులాహారానికే అధిక ప్రాధాన్యత. యంత్రాల సాయం అవసరం లేదు…కాళ్లకి పనిచెబుతూ, శరీరాన్ని కదిలిస్తూ పుషప్‌లు, స్క్వాట్స్‌, కార్డియో వర్కవుట్లు, జాగింగ్‌, రన్నింగ్‌, ఈత, డ్యాన్స్‌, ఆటలు ఇలా ఒకటేమిటి? యోగా, ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ కలిపి చేసేస్తున్నారు. ఇప్పుడు ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌ సంస్థలూ కొత్త బాట పట్టాయి. బూటప్‌ క్యాంప్‌లు, థీమ్‌ వర్కవుట్ల పేరుతో ఆరుబయట శిక్షణ ఇస్తున్నాయి. ప్రతి వ్యక్తికీ ప్రత్యేకంగా, వారి సమస్యకో పరిష్కారాన్ని చూపిస్తూ వ్యాయామ చికిత్సలు…అందిస్తున్నాయి.

Image result for outdoor workouts

వ్యాయామాన్ని ప్రకృతి ఒడిలో చేయగలిగితే ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. డి విటమిన్‌ అందుతుంది….ఇంకా మరెన్నో ప్రయోజనాలు దీనివల్ల అందుతాయంటున్నాయి అధ్యయనాలు. ఇలా చేసే వర్కవుట్లు పన్నెండు నుంచి పదహారు వారాల పాటు కొనసాగించగలిగితే … క్రమశిక్షణగా కొనసాగిస్తారు. ఒత్తిడి బారిన పడి అనారోగ్యాలకు గురవుతోన్న మహిళల సంఖ్య ఎక్కువే. అధికబరువే కాదు.. ఇరవైలు రాకుండానే హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌, పీసీఓఎస్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. పాతికల్లో ఉన్నవారిని సైతం సంతానలేమి, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి వేధిస్తున్నాయి. మెనోపాజ్‌ పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏ సమస్య కోసం డాక్టర్‌ దగ్గరికి వెళ్లినా…అవి అదుపులో ఉండాలంటే బరువు తగ్గించుకోవాలని చెబుతారు. ఆరుబయట చేసే కసరత్తుల వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా అందుతుంది. సూర్యకిరణాల నుంచి అందే డి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. వీటి వల్ల థైరాయిడ్‌, పోస్ట్‌మెనోపాజ్‌, ప్రీమెనోపాజ్‌ వంటి సమస్యలు సులువుగా అదుపులోకి వస్తాయి. కోరుకున్న ఆరోగ్య ఫలితాలు వేగంగా అందుతాయి. రోజూ బయట వ్యాయామం చేసే అవకాశం లేనివారు.. కనీసం వారంలో రెండు రోజులైనా ఇలా చేయడానికి ప్రయత్నించాలి. వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే…మీరు చేయగలిగిన వ్యాయామాలు, తీసుకోవలసిన డైట్‌ వంటివి మీ డాక్టర్‌ని సంప్రదించి ఓ నిర్ణయం తీసుకోండి. ఆపై నిపుణుల ఆధ్వర్యంలో కొన్నాళ్లు సాధన చేయండి. అప్పుడే ఇంట్లో అయినా, ఫిట్‌నెస్‌ కేంద్రంలో అయినా సులువుగా కసరత్తుల్ని చేయొచ్చు.

Image result for outdoor workouts

ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే! పచ్చటి చెట్ల మధ్య, పచ్చిక మీద, ధారాళంగా కాంతి, హాయిగా వీచే గాలి….ఉండే ఏ ప్రదేశమైనా ఈ అవుట్‌డోర్‌ ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌కి అనుకూలమే. యోగా, జుంబా…ఇలా ఏ వ్యాయామాన్ని అయినా అక్కడ సాధన చేయొచ్చు. అవేంటంటే…
యోగా: ఆరుబయట ప్రయత్నించగలిగే వ్యాయామ మార్గాల్లో యోగా ఒకటి. ముద్రలు, ధ్యానం, భంగిమలు ఇలా ఏది చేసినా…ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఫలితం త్వరగా శరీరానికి ఒంటపడుతుంది. శరీరం సౌకర్యంగా మారుతుంది.
డ్యాన్స్‌ కార్డియో: జుంబా బాలీవుడ్‌, ఫోక్‌, పాప్‌ ఏదైనా సరే! లయబద్ధంగా వేసే అడుగులతో చేసే ఈ వ్యాయామం ఉత్సాహం తెచ్చిపెడుతుంది. ఇది చక్కటి కార్డియో వ్యాయామం కూడా. దీనివల్ల శరీరం మొత్తానికి వ్యాయామ ఫలితం అందుతుంది. సులువుగా బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.
పిలాటిస్‌: ఇందులో సుమారు ఐదు వందల రకాల వ్యాయామాలు ఉంటాయి. శరీర కండరాలకు దృఢత్వాన్ని, సాగే గుణాన్ని అందిస్తాయి. ఒక్కో వ్యాయామాన్ని ఐదు నుంచి పదిసార్లు కనీసం నలభైఅయిదు నిమిషాలు చేయాల్సి ఉంటుంది. పొట్ట కండరాలు, నడుము కింది భాగం, తుంటి భాగాలకు ఇవి మేలు చేస్తాయి. తీరైన ఆకృతినీ అందిస్తాయి. ఒత్తిడి అదుపులో ఉంటుంది.
స్పాట్‌ వాకింగ్‌: ఉన్న చోటే నిలబడి…వేగంగా నడుస్తున్నట్లు అడుగులు వేసే వ్యాయామం ఇది.
తాడాట: తాడు సాయంతో శరీరాన్ని పైకిలేపగలిగే కసరత్తు ఇది. ఇలా రోజూ కనీసం పదినిమిషాలు ఆడితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఆటలు: చిన్నప్పుడెప్పుడో ఆడిన ఆటలకి పెద్దయ్యాక అంతా దూరం అవుతాం. ఏ కాస్త వీలు చిక్కినా…మీ స్నేహితులంతా ఓ బృందంగా ఏర్పడి ఆడండి. అది దొంగాపోలీస్‌ కావొచ్చు. కబడ్డీ అయి ఉండొచ్చు. ఆటేదైనా మీ శరీరానికి దృఢత్వాన్ని పెంచుతుంది. జీవక్రియా రేటుని మెరుగుపరిచి అనారోగ్యాలను అదుపులో ఉంచుతుంది.
రెసిస్టెంట్‌ బ్యాండ్‌తో: మొదట్లో వ్యాయామాల్ని ఏ ఆధారం లేకుండా చేయాల్సి వచ్చినప్పుడు నా వల్ల కాదు అనుకోనక్కర్లేదు. రెసిస్టెంట్‌ బ్యాండ్‌ సాయం తీసుకుంటే ఎలాంటి వ్యాయామాన్నైనా కాళ్లు చేతులతో తొక్కిపెట్టి చేయొచ్చు. కాస్త వయసు పైబడినవారు, అధికబరువుతో బాధపడేవారు…వీటితో చేయడం సౌకర్యం.

Image result for outdoor workouts