Business

భారీ నష్టాల్లో PayTM

భారీ నష్టాల్లో PayTM

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎంకు నష్టాలు పెరిగాయి. గూగుల్‌ పే, ఫోన్‌పే లాంటి ఇతర డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న పేటీఎం.. గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూసింది. సగటున రోజుకు రూ. 11కోట్ల చొప్పున నష్టపోయింది. పేటీఎం మాతృక సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తాజాగా కంపెనీ వార్షిక ఫలితాలను వాటాదారులతో పంచుకుంది. ఈ గణాంకాల ప్రకారం.. మార్చి 31, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 4,217కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదుచేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 1,604కోట్ల ఏకీకృత నష్టంతో పోలిస్తే ఇది 162శాతం ఎక్కువ. అంటే సగటున రోజుకు రూ. 11కోట్ల పైనే నష్టపోయినట్లు. ఒక్క ‘పేటీఎం మనీ’ విభాగంలోనే 36.8శాతం నష్టాలను చవిచూసింది. అయితే ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 3,309.61కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో అది రూ. 3,579.67కోట్లకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో బ్రాండ్‌ విలువను పెంచుకునేందుకు ఎక్కువగా ఖర్చు చేసినట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. ఫలితంగా నష్టాలు వచ్చాయని తెలిపింది. అయితే 2021 నాటికి లాభాలను సాధిస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. పేమెంట్స్‌ బ్యాంక్‌, ఇన్స్యూరెన్స్‌, ట్రావెల్‌ టికెటింగ్‌, హోటల్‌, మొబైల్‌ వాలెట్‌ సర్వీస్‌లపై మరింత దృష్టి సారించనున్నట్లు పేర్కొంది.