Movies

ఆలోచనలతో ఇబ్బంది పడుతున్న ఆమీర్

ఆలోచనలతో ఇబ్బంది పడుతున్న ఆమీర్

‘‘ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా అని నిర్ధారణ కాకముందే తుది నిర్ణయానికి రాకూడదు. తప్పొప్పులు తేలే వరకూ ఒక వ్యక్తి పని కోల్పోవడమే కాకుండా ఏ పని దొరక్కుండా ఖాళీగా ఉండాలా? నా నిర్ణయం ఒకరికి జీవనోపాధి కోల్పోయేలా చేసింది అనే ఆలోచన నాకు చాలా రాత్రులు నిద్రపట్టకుండా చేసింది’’ అని ఆమిర్‌ ఖాన్‌ అన్నారు. సంగీత దర్శకుడు గుల్షన్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ‘మొఘల్‌’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఆమిర్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌ పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. సుభాష్‌ కపూర్‌ దర్శకుడు. అయితే ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సుభాష్‌ కపూర్‌ౖపై వేధింపుల ఆరోపణలు (గీతికా త్యాగీ ఆరోపించారు) రావడంతో ‘మొఘల్‌’ నుంచి ఆమిర్‌ తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు ప్రకటించారు. ‘‘గతంలో నేను తీసుకున్న నిర్ణయం ఆ సమయానికి సరైనది అనిపించింది. ఇప్పుడు మరోలా అనిపిస్తోంది. నా మనస్సాక్షిని నమ్మి వెళ్తున్నాను. కొందరికి ఈ నిర్ణయం కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు. మొన్న మే నెలలో ‘ఐఎఫ్‌టీడీఏ’ (ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌) నుంచి నాకో లేఖ వచ్చింది. ‘సుభాష్‌ కపూర్‌ కేస్‌ ప్రస్తుతం కోర్ట్‌లో నడుస్తోంది. అప్పుడే అతను దోషి అని ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. మీ ఆలోచనను మరోసారి సమీక్షించుకోండి’ అన్నది దాని సారాంశం. సుభాష్‌తో పని చేసిన కొందరు మహిళా అసిస్టెంట్‌ డైరెక్టర్స్, కాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్‌వాళ్లతో నేను, నా భార్య కిరణ్‌ తన తీరు గురించి మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్లు తన గురించి మంచిగా మాట్లాడారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తనెప్పుడూ స్త్రీలతో తప్పుగా ప్రవర్తించి ఉండడు అని చెప్పదలచుకోలేదు. అయినా తన మీద వచ్చిన ఆరోపణలు పని ప్రదేశంలో జరిగినవి కావు. అందుకే ఈ సినిమాలో మళ్లీ భాగమయ్యాను’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆమిర్‌ ఖాన్‌.