Editorials

భారతదేశం పేరు చెప్తేనే వణికిపోతున్న ప్రవాసులు

NRIs Scared To Visit Or Live In India

భారత్‌లో జీవనం, జీవన ప్రమాణాలపై ప్రవాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విదేశీలయులకు భారత్‌ అంత సురక్షితంకాదని ఒక తాజా అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలోని ప్రమాదకర దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉన్నది. అంతర్జాతీయ ప్రవాసుల కమ్యూనిటీ అయిన ‘ఇంటర్‌నేషన్స్‌’ పలు అంశాలపై అధ్యయనం చేపట్టింది. ఆ నివేదికను గతవారం విడుదల చేసింది. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన 20,259 మంది ప్రవాసుల మనోగతాలను తెలుసుకున్నారు. ఒక్కో దేశంపై 75మంది చొప్పున శాంపిల్‌గా తీసుకున్నారు. వారు నివసిస్తున్న దేశంలో నాణ్యమైన జీవనం, స్థిరపడటం, పని జీవనం, ఆర్థిక స్వావలంబన, జీవన వ్యయం, కుటుంబజీవనం వంటి పలు అంశాలపై సర్వే చేశారు. ఇందులో భాగంగా 64 దేశాలకు ర్యాంకులను కేటాయించారు. ఇందులో భారత్‌ 59వ ర్యాంకుతో అట్టడుగు దేశాల స్థానాల్లో నిలిచింది. ఇక్కడ నాణ్యమైన జీవితం పైనే ప్రవాసీయులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒక మహిళగా నేను ఇక్కడ భద్రత పట్ల అంత నమ్మకంగా లేను’ అని సర్వేలో పాల్గొన్న యూఎస్‌ఏకు చెందిన ఓ మహిళ తెలిపింది. అలాగే భారత్‌లో కాలుష్యం, అనారోగ్య పరిస్థితుల పైనా విదేశీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వ్యక్తిగత ఆర్థికం(9), జీవన వ్యయం(18) లలో మాత్రం భారత్‌ కాస్త మెరుగ్గానే ఉన్నది. అయితే నాణ్యమైన జీవితం(63), వ్యక్తిగత భద్రత(60), ఆరోగ్య సంరక్షణ(60), రవాణా అవకాశాలు(61) వంటి అంశాల్లో మాత్రం అట్టడుగున నిలిచాయి. టాప్‌-10లో భారత్‌తో పాటు కువైట్‌(64), ఇటలీ(63), నైజీరియా(62), బ్రెజిల్‌(61), టర్కీ(60), యూకే(58), గ్రీస్‌(57), రష్యా(56), దక్షిణ కొరియా(55) లు చెత్తప్రదర్శనను చూపాయి. అగ్రస్థానంలో వియత్నాం నిలిచింది. తర్వాతి స్థానాల్లో పోర్చుగల్‌, మెక్సికో స్పెయిన్‌ దేశాలున్నాయి. అమెరికా 47వ స్థానంలో ఉండగా, కతర్‌ 18 స్థానం లభించింది.